
ఆంక్షలు సడలిస్తేనే నాలుగో టెస్టు.. లేదంటే!
సీఏకు బీసీసీఐ అధికారిక లేఖ
దిల్లీ: బ్రిస్బేన్‌లో నాలుగో టెస్టు ఆడాలంటే టీమ్ఇండియా క్రికెటర్లకు కఠిన క్వారంటైన్ నిబంధనల్లో సడలింపులు ఇవ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియాకు బీసీసీఐ అధికారికంగా లేఖ రాసింది. ఆస్ట్రేలియాకు వచ్చేముందు భారత జట్టు రెండు నగరాల్లో కఠిన క్వారంటైన్ అయ్యేందుకు ఒప్పందం చేసుకోలేదని తెలిపింది. దుబాయ్ నుంచి రాగానే సిడ్నీలో ఆటగాళ్లు ఐసోలేషన్‌కు వెళ్లారని గుర్తుచేసింది. పర్యటనకు ముందు చేసుకున్న ఒప్పందంలోని అంశాలను బీసీసీఐ అత్యున్నత అధికారి సీఏ అధినేత ఎర్ల్ ఎడింగ్స్ దృష్టికి తీసుకొచ్చారు.
సిడ్నీ టెస్టు ముగిసిన తర్వాత టీమ్ఇండియా గబ్బా వేదికగా నాలుగో టెస్టు ఆడాల్సి ఉంది. జనవరి 15న ఇది ఆరంభమవుతుంది. అయితే బ్రిస్బేన్ నగరానికి చేరుకున్న వెంటనే ఆటగాళ్లంతా హోటల్ గదులకు మాత్రమే పరిమితం అవ్వాలని అక్కడి నిబంధనలు చెబుతున్నాయి. ఇలాంటి వాతావరణానికి క్రికెటర్లు ససేమిరా అంటున్నారు.
‘చర్చలు జరుగుతున్నాయి. బ్రిస్బేన్‌లో మ్యాచ్ కావాలంటే కఠిన క్వారంటైన్ నిబంధనల్లో సడలింపులు ఇవ్వాలని బీసీసీఐ అధికారికంగా నేడు లేఖరాసింది. పర్యటనకు ముందు చేసుకున్న ఒప్పందంలో రెండు కఠిన క్వారంటైన్లు లేవు. సిడ్నీలో టీమ్ఇండియా ఒక కఠిన క్వారంటైన్ పూర్తిచేసుకుంది. బీసీసీఐ డిమాండ్ తేలికైందే. ఆటగాళ్లు ఐపీఎల్ తరహాలో హోటల్ లోపల బయోబుడగ కావాలని కోరుకుంటున్నారు. కలిసి భోజనం చేయాలని, కలిసి జట్టు సమావేశాలకు హాజరు అవ్వాలని కోరుకుంటున్నారు. నిజానికి ఇదో పెద్ద డిమాండే కాదు’ అని బీసీసీఐ అధికారి తెలిపారు.
క్రికెట్ ఆస్ట్రేలియా సైతం హోటల్లో ఒకర్నొకరు కలుసుకోవచ్చని చెబుతోంది. అయితే ఒకే అంతస్తులోని వారు మాత్రమే కలుసుకోవాలి. ఇతర అంతస్తుల్లో ఉన్నవారు మిగతా వారిని కలవకూడదు. దీనినే టీమ్ఇండియా క్రికెటర్లు వ్యతిరేకిస్తున్నారు. ‘సడలింపులపై రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని సీఏను బీసీసీఐ కోరుతోంది. దుబాయ్ నుంచి సిడ్నీకి వచ్చిన తర్వాత ఆటగాళ్లు ఒకర్నొకరు కలుసుకోకుండా హోటల్ అంతస్తుల్లో పోలీసులను మోహరించారు. బ్రిస్బేన్‌కు వెళ్లాక అలాంటివి జరగొద్దన్నదే మా ఉద్దేశం. మాకు కావాల్సిందల్లా ఐపీఎల్ తరహా బయోబుడగ’ అని బీసీసీఐ అధికారి తెలిపారు.
నగరమంతా సాధారణంగా ఉంటే హోటల్లో టీమ్ఇండియా మాత్రమే ఆంక్షలు పాటించడంపై ఇప్పటికే రహానె అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ క్వీన్స్లాండ్ ప్రభుత్వం ఈ డిమాండ్లకు అంగీకరించకపోతే నాలుగో టెస్టు సిడ్నీలోనే జరిగే అవకాశం ఉంది.
ఇవీ చదవండి
పంత్.. ఇదేం కీపింగ్?
జాతీయ గీతం ఆలపిస్తూ సిరాజ్ కంటతడి..