Team India: ఇక్కడో జట్టు.. అక్కడో జట్టు.. కొత్త పుంతలు తొక్కుతున్న భారత క్రికెట్‌

క్రికెట్లో పెద్ద దేశాలు ఏదైనా అప్రాధాన్య సిరీస్‌ ఆడాల్సినపుడు.. ద్వితీయ శ్రేణి జట్లను పంపడం మామూలే. కానీ ఒక దేశం ఒకే సమయంలో వేర్వేరు జట్లతో వేర్వేరు సిరీస్‌లు ఆడటం మాత్రం అరుదే. భారత క్రికెట్లో రెండేళ్లుగా ఈ ఒరవడి కొనసాగుతోంది. తరచుగా రెండు జట్లను బరిలోకి దించుతోంది.

Published : 25 Sep 2023 16:12 IST

క్రికెట్లో పెద్ద దేశాలు ఏదైనా అప్రాధాన్య సిరీస్‌ ఆడాల్సినపుడు.. ద్వితీయ శ్రేణి జట్లను పంపడం మామూలే. కానీ ఒక దేశం ఒకే సమయంలో వేర్వేరు జట్లతో వేర్వేరు సిరీస్‌లు ఆడటం మాత్రం అరుదే. భారత క్రికెట్లో రెండేళ్లుగా ఈ ఒరవడి కొనసాగుతోంది. తరచుగా రెండు జట్లను బరిలోకి దించుతోంది. అలా అని రెండో జట్టును ‘ద్వితీయ శ్రేణి’ అని తక్కువ చేయలేం. అది కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లే ఉండటం విశేషం.

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, హార్దిక్‌ పాండ్య, కుల్‌దీప్‌ యాదవ్‌ లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగింది భారత్‌ (Team India). అయినా బలమైన జట్టుతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడించి సిరీస్‌ను చేజిక్కించుకుంది. ఈ మ్యాచ్‌లకు అందుబాటులో లేని నలుగురు ముఖ్య ఆటగాళ్లు ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తున్నారు. తొలి రెండు వన్డేల్లో ఆడిన ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌.. మూడో వన్డేకు అందుబాటులో ఉండట్లేదు. అతను ఆసియా క్రీడల (Asian Games) కోసం హాంగ్‌జౌకు వెళ్తున్నాడు. ఆ క్రీడల్లో రుతురాజ్‌ నాయకత్వంలోనే మరో భారత జట్టు క్రికెట్‌ పోటీల్లో తలపడబోతోంది. ఆ జట్టులోని అర్ష్‌దీప్‌ సింగ్, యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, అవేష్‌ ఖాన్, వాషింగ్టన్‌ సుందర్, తిలక్‌ వర్మ, రవి బిష్ణోయ్, ముకేశ్‌ కుమార్‌.. ఇలా చాలామంది భారత జట్టుకు ఆడిన వాళ్లే. ఎక్కువగా కుర్రాళ్లు ఉన్నారన్న మాటే కానీ.. అందరూ అంతర్జాతీయ క్రికెట్లో అదరగొట్టే స్థాయి ఉన్న వాళ్లే. ఇలా ఒకేసారి రెండు అంతర్జాతీయ జట్లను బరిలోకి దించే స్థాయిలో భారత్‌ ఉందంటే మన క్రికెట్‌ ప్రమాణాలు ఎంత గొప్పగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఇదే తొలిసారి కాదు

భారత్‌ ఇలా ఒకేసారి వేర్వేరు జట్లను బరిలోకి దించడం ఇదే తొలిసారి కాదు. రెండు నెలల కిందట ఒక జట్టు వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లింది. అప్పుడు హార్దిక్‌ పాండ్య సారథ్యంలో ఓ జట్టు టీ20 సిరీస్‌ ఆడుతుండగా.. బుమ్రా నాయకత్వంలో మరో జట్టు ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్లింది. గత ఏడాది దక్షిణాఫ్రికాతో ఓ భారత క్రికెట్‌ జట్టు టీ20 సిరీస్‌ ఆడింది. అది ముగించుకున్నాక రోహిత్‌ శర్మ సారథ్యంలోని జట్టు టీ20 ప్రపంచకప్‌ కోసం ఆస్ట్రేలియాకు పయనమైంది. కానీ ఆ సిరీస్‌లో తలపడ్డ దక్షిణాఫ్రికా జట్టుతో వెంటనే శిఖర్‌ ధావన్‌ నేతృత్వంలోని మరో భారత బృందం వన్డే సిరీస్‌ ఆడింది. ఈ రెండు సిరీస్‌ల్లోనూ భారత్‌దే విజయం కావడం విశేషం. 2021 నుంచి భారత్‌ తరచుగా అవసరాన్ని బట్టి రెండో జట్టుతో సిరీస్‌లు ఆడిస్తోంది. ఆ ఏడాది విరాట్‌ కోహ్లి సారథ్యంలో ప్రధాన జట్టు ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లగా.. అదే సమయంలో ధావన్‌ నాయకత్వంలో మరో జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. అక్కడ వన్డే, టీ20 సిరీస్‌లను సొంతం చేసుకుంది. నిరుడు వెస్టిండీస్‌లో వన్డే సిరీస్‌ కోసం కూడా రెండో జట్టును పంపారు.

ఐపీఎల్‌ పుణ్యం

అంతర్జాతీయ మ్యాచ్‌ల మోతాదు బాగా పెరిగిపోవడం, దీనికి ఐపీఎల్‌ కూడా తోడవుతుండడంతో ఒకే జట్టుతో అన్ని సిరీస్‌లూ ఆడించడమంటే ఆటగాళ్లకు మోయలేని భారమే అవుతుంది. అదే సమయంలో ఇండియాకు ప్రాతినిధ్యం వహించేందుకు ఎదురు చూస్తున్న ప్రతిభావంతులకు లెక్క లేదు. అందుకే బీసీసీఐ ద్వితీయ జట్టు ఆలోచనను తెరపైకి తెచ్చింది. ఇది ఉభయతారకంగా పని చేస్తోంది. ప్రపంచంలో మరే దేశానికీ లేనంత క్రికెట్‌ ప్రతిభ మన దగ్గర ఉందనడంలో సందేహం లేదు. బీసీసీఐ ప్రణాళికాబద్ధమైన కసరత్తు వల్ల.. బలమైన దేశవాళీ వ్యవస్థ, ఐపీఎల్‌ వల్ల ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు. ముఖ్యంగా ఐపీఎల్‌లో ప్రతిభ చాటుకున్న కుర్రాళ్లు వేగంగా అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్నారు. సెలక్టర్లు కూడా కుర్రాళ్లకు భారత జట్టులో ఉదారంగా అవకాశాలు ఇస్తున్నారు. మ్యాచ్‌లు, సిరీస్‌ల సంఖ్య పెరగడంతో గతంతో పోలిస్తే ఎక్కువమంది భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించగలుగుతున్నారు. ఒకేసారి రెండు కాదు మూడు జట్లను బరిలోకి దించే సత్తా భారత్‌కు ఉందని బ్రయాన్‌ లారా లాంటి దిగ్గజం వ్యాఖ్యానించడం మన ప్రతిభకు నిదర్శనం.

  - ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని