Rahul Dravid: ఎన్‌సీఏలో ద్రవిడ్‌ పదవికి దరఖాస్తులు కోరిన బీసీసీఐ

జాతీయ క్రికెట్‌ అకాడమీ చీఫ్‌ పదవికి బీసీసీఐ దరఖాస్తులు కోరుతోంది. ప్రస్తుతం ఆ పదవిలో రాహుల్‌ ద్రవిడ్‌ కొనసాగుతున్నారు. భారత్‌-ఏ, అండర్‌-19 కోచ్‌గా పనిచేశాక 2019, జులైలో ఆయన ఎన్‌సీఏలో చేరారు....

Published : 10 Aug 2021 22:45 IST

ముంబయి: జాతీయ క్రికెట్‌ అకాడమీ చీఫ్‌ పదవికి బీసీసీఐ దరఖాస్తులు కోరుతోంది. ప్రస్తుతం ఆ పదవిలో రాహుల్‌ ద్రవిడ్‌ కొనసాగుతున్నారు. భారత్‌-ఏ, అండర్‌-19 కోచ్‌గా పనిచేశాక 2019, జులైలో ఆయన ఎన్‌సీఏలో చేరారు. భారత రిజర్వు బెంచిని పటిష్ఠంగా మార్చారు. ఆయన రెండేళ్ల ఒప్పందం ముగియడంతో నిబంధనల ప్రకారం కొత్త నోటిఫికేషన్‌ వేశారని తెలిసింది. బహుశా ద్రవిడే మళ్లీ దరఖాస్తు చేస్తారని సమాచారం.

‘మళ్లీ ఆ పదవికి రాహుల్‌ ద్రవిడే దరఖాస్తు చేసే అవకాశం ఉంది. కానీ టీ20 ప్రపంచకప్‌ ముగిశాక 2021, నవంబర్‌కు రవిశాస్త్రి ఒప్పందం ముగుస్తుంది. ఆ పదవిని ద్రవిడ్‌ చేపట్టే అవకాశమూ లేకపోలేదు. ఏదేమైనా ఆయన క్రికెట్‌ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తారు’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

ఈ మధ్యే శ్రీలంక పర్యటనలో టీమ్‌ఇండియాకు రాహుల్‌ ద్రవిడ్‌ కోచ్‌గా వ్యవహరించారు. భవిష్యత్తులో టీమ్‌ఇండియా కోచ్‌గా చేస్తారా అని ప్రశ్నించగా ఇంకా నిర్ణయించుకోలేదని ఆయన తెలపడం గమనార్హం. ‘నిజం చెప్పాలంటే నేనేమీ అనుకోలేదు. చేస్తున్న పనిని మాత్రం ఆస్వాదిస్తున్నాను’ అని వివరించారు.

టీమ్‌ఇండియా కోచ్‌ పదవికి గరిష్ఠ వయో పరిమితి 60 సంవత్సరాలు. మేనెలలో శాస్త్రికి 59 నిండాయి. అందుకే టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా రాణించకపోతే ద్రవిడ్‌కు అవకాశం రావొచ్చు! శాస్త్రి-కోహ్లీ నేతృత్వంలో భారత ఇప్పటి వరకు ఐసీసీ టోర్నీ గెలవలేదు. అయితే మిగతా సిరీసుల్లో బాగానే రాణించింది. విదేశాల్లో గెలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని