Wriddhiman Saha: సాహా వ్యాఖ్యలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.. కానీ, త్వరలోనే..!

టీమ్‌ఇండియా సీనియర్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా చేసిన వ్యాఖ్యలపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కానీ త్వరలోనే అతడి నుంచి వివరణ కోరే...

Published : 25 Feb 2022 14:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా సీనియర్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా చేసిన వ్యాఖ్యలపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కానీ త్వరలోనే అతడి నుంచి వివరణ కోరే అవకాశముందని కోశాధికారి అరుణ్‌ ధూమాల్‌ స్పష్టం చేశాడు. గత శనివారం శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు టీమ్‌ఇండియా జట్టును ఎంపిక చేసినప్పుడు అందులో సాహా పేరు లేకపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడు మీడియాతో మాట్లాడుతూ.. జట్టులో తన స్థానంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ, హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ప్రత్యేకంగా చెప్పిన విషయాలను బహిర్గతం చేశాడు. దీంతో ఈ విషయం సంచలనంగా మారింది. మరోవైపు తన ఇంటర్వ్యూ కోసం ఓ పేరు మోసిన జర్నలిస్టు కూడా తనని బెదిరించాడని సాహా ట్విటర్‌ వేదికగా పేర్కొన్నాడు. దీంతో అతడి పేరు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

కాగా, సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఆటగాళ్లు క్లాజ్‌ 6.3 ప్రకారం.. జట్టుకు సంబంధించిన విషయాలు, సెలెక్షన్‌ కమిటీకి సంబంధించిన వివరాలు లేదా ఆటకు సంబంధించిన విషయాలను బయటపెట్టరాదు. కానీ, సాహా వాటిని ఉల్లంఘించి మీడియాతో మాట్లాడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే తాజాగా అరుణ్‌ ధూమాల్‌ మీడియాతో మాట్లాడుతూ సాహా వ్యాఖ్యలపై వివరణ కోరతామని చెప్పాడు. ‘సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఆటగాడిగా ఉంటూ జట్టు సెలెక్షన్‌కు సంబంధించిన విషయాలను మీడియాతో ఎలా పంచుకుంటారని బీసీసీఐ అతడిని అడిగే వీలుంది. అలాగే డ్రెస్సింగ్‌ రూమ్‌లో ద్రవిడ్‌తో సాగిన చర్చను మీడియా ముందుకు ఎందుకు తీసుకువచ్చాడనేది బీసీసీఐ తెలుసుకుంటుంది. దీంతో అతడి వ్యాఖ్యలపై వివరణ లేదా షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసే అవకాశం ఉంది. ఈ విషయానికి సంబంధించి మేం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ త్వరలోనే అది జరుగుతుంది’ అని అరుణ్‌ స్పష్టం చేశాడు. ఇక ఈ విషయంలో అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడాల్సి వస్తే.. సాహాను ప్రోత్సహించడానికే అలా చేప్పి ఉండొచ్చని వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని