Sourav Ganguly: దాదా పాలనలో అందరూ హ్యాపీనే: అరుణ్‌ ధుమాల్

బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరభ్ గంగూలీ పదవీ కాలం త్వరలోనే ముగియనుంది. కొత్త ప్రెసిడెంట్‌గా రోజర్‌ బిన్నీ ఖారారైనట్లు తెలుస్తోంది. గంగూలీ మరోసారి వద్దామనుకున్నా.. కొందరు సభ్యులు అడ్డుకోవడంతో ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే వాటిని  బీసీసీఐ ట్రెజరర్‌ అరుణ్‌ ధుమాల్‌ కొట్టిపడేశారు.

Published : 15 Oct 2022 01:43 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత క్రికెట్ బోర్డు పగ్గాలు చేపట్టిన తర్వాత సౌరభ్ గంగూలీ కీలక నిర్ణయాలు తీసుకొన్నాడు. క్రికెటర్ల జీత భత్యాలను భారీగానే పెంచాడు. కరోనా సమయంలోనూ భారత టీ20 లీగ్‌ సహా ఇతర మ్యాచ్‌లను నిర్విరామంగా నిర్వహించాడు. సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో రెండోసారి కూడా బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతాడని అంతా భావించారు. అనూహ్యంగా రేసులోకి టీమ్‌ఇండియా తొలి వరల్డ్‌ కప్‌ జట్టు సభ్యుడు రోజర్‌ బిన్నీ వచ్చేశారు. దీంతో గంగూలీకి బ్రేక్‌ పడటంపై అనేక రకాలుగా వాదనలు వచ్చాయి. బోర్డులోని మిగతా సభ్యులు సమ్మతించకపోవడతోనే గంగూలీ విరమించుకొన్నాడని రూమర్లు  వచ్చాయి. అయితే బీసీసీఐ ట్రెజరర్‌ అరుణ్‌ ధుమాల్‌ మాత్రం వాటిని కొట్టిపడేశారు. గంగూలీ సారథ్యంలోని బోర్డు సభ్యులు అందరూ ఎంతో సంతోషంగా పనిచేశారని పేర్కొన్నాడు. ఎవరూ కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదని స్పష్టం చేశాడు. 

‘‘స్వతంత్ర భారతంలో గంగూలీ కాకుండా ఎవరూ మూడేళ్లపాటు బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి లేరు. గంగూలీకి కొందరు వ్యతిరేకంగా మాట్లాడటం వల్లే రెండోసారి పోటీ చేసేందుకు విముఖత చూపాడని మీడియాలో వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. అవన్నీ నిరాధారం. బీసీసీఐలో పదవుల కోసం నామినేషన్ల దాఖలు చేసే నిర్ణయాల్లో గంగూలీ కూడా భాగమే. దాదాకు ఎవరూ ఒక్క మాట కూడా వ్యతిరేకంగా  మాట్లాడలేదు. ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా పనిచేశారు. బృందమంతా సంతృప్తికరంగా ఉన్నారు. భారత కెప్టెన్‌గా ఎంతో అద్భుతమైన కెరీర్‌ ముగించాడు. అలాగే అత్యుత్తమ నాయకుడు, పరిపాలకుడిగా టీమ్‌ను ఏకతాటిపై నడిపించాడు. కొవిడ్‌వంటి క్లిష్టపరిస్థితుల్లోనూ బీసీసీఐతోపాటు మ్యాచ్‌లను ఎలా నిర్వహించాడో  ప్రతి ఒక్కరికీ తెలుసు’’ అని అరుణ్‌ ధుమాల్‌ వెల్లడించారు. అక్టోబర్‌ 18న జరిగే ఏజీఎంలో బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ బాధ్యతలు స్వీకరించడం ఖాయంగానే తెలుస్తోంది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని