T20 League: క్రికెటర్లకు మళ్లీ కాసుల పంట.. ఎప్పుడు ఉండొచ్చంటే?

మరోసారి క్రికెటర్లకు కాసుల వర్షం కురిపించే అవకాశం తలుపు తట్టనుంది. గత సీజన్‌కు ముందు మెగా వేలం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా 2023 సీజన్‌కు సంబంధించి...

Published : 24 Sep 2022 02:14 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మరోసారి క్రికెటర్లకు కాసుల వర్షం కురిపించే అవకాశం తలుపు తట్టనుంది. గత సీజన్‌కు ముందు మెగా వేలం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా 2023 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల కోసం వేలం నిర్వహించాలని బీసీసీఐ ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు సమాచారం. డిసెంబర్‌ మూడో వారం (16వ తేదీగా అంచనా) ఆరంభంలో ఉండే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఫ్రాంచైజీలతో బీసీసీఐ సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. ఇది మినీ-వేలంగా నిర్వహించే  అవకాశం ఉంది. అయితే ప్రతి ఫ్రాంచైజీ రూ. 95 కోట్లతో వేలంలో  పాల్గొనాల్సి ఉంటుంది. గత మెగా ఆక్షన్ కంటే రూ. 5 కోట్లు అధికం కావడం గమనార్హం. భారత టీ20 లీ‌గ్‌ 2022 సీజన్‌కు ముందు రెండు రోజులపాటు సాగిన మెగా వేలంలో క్రికెటర్లకు భారీ ధర పలికిన విషయం తెలిసిందే. భారత యువ క్రికెటర్‌ ఇషాన్‌ కిషన్‌ (రూ.15.25 కోట్లు) బంపర్‌ ఆఫర్‌ కొట్టాడు. 

మినీ-వేలం సందర్భంగా తమ జట్టులోని ఆటగాళ్లను ఫ్రాంచైజీలు మార్చుకోవడం లేదా అమ్ముకోవడం చేసేందుకు అవకాశం కూడా ఉంటుందని సమాచారం. గత సీజన్‌ తర్వాత చెన్నై జట్టు రవీంద్ర జడేజాను విడిచి పెట్టి గుజరాత్‌ నుంచి శుభ్‌మన్‌ గిల్‌ను తెచ్చుకుంటుందనే రూమర్లు వచ్చాయి. అయితే వీటిని రెండు ఫ్రాంచైలు కొట్టిపడేశాయి. జడేజా కోసం గుజరాత్‌ మాత్రమే కాకుండా ఇతర జట్లూ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చెన్నై మాత్రం ఇలాంటి వార్తలను ఖండిస్తూ.. టాప్‌ ఆల్‌రౌండర్‌ను వదిలి పెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఇప్పటికే భారత టీ20 లీగ్‌ వచ్చే సీజన్‌ను ‘‘ఇంటా-బయటా’ పద్ధతిలో నిర్వహిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పష్టం చేశాడు. అక్టోబర్‌ 18న జరిగే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) అనంతరం మినీ-వేలం గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని