Asia cup : ఆసియా కప్‌ నిర్వహణపై ఇప్పుడే మాట్లాడటం తగదు..!

శ్రీలంక వేదికగా ఆగస్టులో ఆసియా కప్‌ నిర్వహించాలని ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) నిర్ణయం తీసుకుంది. అయితే శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంతోపాటు...

Published : 15 Jul 2022 02:11 IST

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ స్పందన

ఇంటర్నెట్‌ డెస్క్‌: శ్రీలంక వేదికగా ఆగస్టులో ఆసియా కప్‌ నిర్వహించాలని ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) నిర్ణయం తీసుకుంది. అయితే శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంతోపాటు రాజకీయ పరిణామాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే లంక అధ్యక్షుడు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. తీవ్ర స్థాయిలో ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆసియా కప్‌ నిర్వహణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే రెండు రోజుల కిందట వరకు శ్రీలంకలో ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు పర్యటించింది. టీ20, వన్డే, టెస్టు సిరీస్‌లను ఆడింది. దీంతో క్రికెట్‌ మ్యాచ్‌లకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని చెప్పక చెప్పినట్లు అయింది. ఆసియా కప్‌ నిర్వహణపై బీసీసీఐ అధ్యక్షడు సౌరభ్‌ గంగూలీ స్పందించాడు. శ్రీలంకలో పరిస్థితులపై బోర్డు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని తెలిపాడు. 

‘‘ ప్రస్తుత పరిస్థితుల్లో తొందరపడి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేను. భారత్‌ ఆతిథ్యం ఇవ్వగలదా..? లేదా అనేది ఇప్పుడే ఏమీ చెప్పలేం. అయితే శ్రీలంకలో పరిస్థితులను మాత్రం పరిశీలిస్తున్నాం. ఆసీస్‌ ఇప్పటికే అక్కడ ఆడింది. శ్రీలంక క్రికెట్‌ జట్టు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆతిథ్యం ఇచ్చింది. అందుకే ఇప్పుడే ఏం మాట్లాడలేను. ఆసియా కప్‌నకు కనీసం నెల రోజుల సమయం ఉంది. అప్పటి వరకు వెయిట్‌ చేద్దాం’’ అని గంగూలీ వివరించాడు.  

అప్పుడు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా..

‘‘కొవిడ్‌ సమయంలో బీసీసీఐ అధ్యక్షుడిగా అనేక సవాళ్లను ఎదుర్కొన్నా. అయితే క్రికెట్‌ టోర్నమెంట్లను చాలా చక్కగా నిర్వహించాం. అదేవిధంగా టీ20 లీగ్‌ మీడియా హక్కులకు భారీ మొత్తం దక్కేలా చేయగలిగాం. అయితే ఆటకు, డబ్బుకు ముడి పెట్టను. అయితే సంపద సృష్టి మాత్రం మంచిదే. ఎందుకంటే మౌలిక సదుపాయాల కల్పనకు ఎలాంటి అవాంతరాలు ఉండవు. ఇప్పుడు భారత క్రికెట్‌ పటిష్ట స్థానంలో ఉంది. దీనిని మేం ప్రారంభించినా.. ఆటగాళ్లు, పాలనాయంత్రాంగం ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. అలాగే ప్రతిసారీ ఐసీసీ టోర్నమెంట్లను మనమే గెలవలేము. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌, 2019 ప్రపంచకప్‌ సెమీస్‌లో ఓటమి పాలయ్యాం. ఇది సరైన ప్రదర్శన కాదనే అంచనా వేయడం తప్పవుతుంది. టీమ్‌ఇండియా మీద భారీగా అంచనాలు ఉంటాయి. వాటిని తట్టుకొని విజయాలు సాధించడం తేలికేమీ కాదు. భారత జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు’’ అని గంగూలీ స్పష్టం చేశాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts