Asia Cup 2023: ఆసియా కప్‌ కోసం భారత జట్టు.. ‘ఈ నాలుగే’ కీలకం!

వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) వంటి మెగా టోర్నీకి ముందు భారత్ మరో మినీ టోర్నీ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. పిచ్‌ పరిస్థితుల్లో పెద్దగా వ్యత్యాసం ఉండని ఉపఖండంలోనే ఈ రెండు టోర్నీలు జరగనుడటం టీమ్‌ఇండియాకు (Team India) కలిసొచ్చే అంశం. అయితే, జట్టు ఎంపికలో కీలక పాత్ర పోషించే అంశాలు నాలుగు ఉన్నాయి.

Updated : 15 Aug 2023 13:21 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచ కప్‌ 2023 మెగా టోర్నీకి ముందు టీమ్‌ఇండియాకు సరైన సన్నద్ధత లభించే అవకాశం ఆసియా కప్‌ రూపంలో రానుంది. ఆగస్టు 30 నుంచి పాక్‌, శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్న ఆసియా కప్‌ ప్రారంభం కానుండగా.. సెప్టెంబర్‌ 2న చిరకాల ప్రత్యర్థి పాక్‌తో భారత్‌ మ్యాచ్‌ ఉండనుంది. వన్డే ఫార్మాట్‌లోనే జరగనున్న ఈ మినీ టోర్నీ తర్వాత ఆస్ట్రేలియాతో భారత్‌ మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది. కాబట్టి దాదాపు ఆరు దేశాలు పాల్గొనే ఆసియా కప్‌.. భారత్‌ తన శక్తియుక్తులను పరీక్షించుకోవడానికి సరైన వేదిక అనడంలో సందేహం లేదు. అయితే, ఓ నాలుగు అంశాలపై దృష్టిపెట్టి అందుకు తగ్గట్టుగా జట్టును ఎంపిక చేయాల్సిన బాధ్యత బీసీసీఐ సెలెక్షన్ కమిటీపై ఉంది. ఎందుకంటే ఆసియా కప్‌లో ఆడిన జట్టులో ఒకటీ రెండు మార్పులతోనే ప్రపంచకప్‌ బరిలోకి దిగే అవకాశాలు ఉంటాయి.

1. టాప్‌ ఆర్డర్ సెట్ చేయాలి..

భారత జట్టులో టాప్‌ ఆర్డర్‌ చాలా కీలకం. ఇక్కడ ఆడే ఆటగాళ్లు రాణిస్తే మిడిలార్డర్‌తోపాటు ఆ తర్వాత వచ్చే బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడగలరు. ఒకవేళ విఫలమైతే మాత్రం పేకమేడలా కుప్పకూలే లక్షణం ఉంది. ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ - శుభ్‌మన్‌ గిల్ దాదాపు ఫిక్స్. ఇక మూడో స్థానంలో విరాట్ కోహ్లీ వచ్చేస్తాడు. టాప్‌ఆర్డర్‌కు బ్యాకప్‌గా ఎవరు ఆడగలరనే విషయాన్ని గమనించాలి. ఇషాన్‌ కిషన్‌ కూడా టాప్‌ఆర్డర్‌లో రాణించగల ఆటగాడు. అతడు ఎడమచేతివాటం బ్యాటర్‌ కావడం కూడా కలిసొచ్చే అంశమే. వన్డేల్లో ఓపెనర్‌గానూ ఉత్తమ ప్రదర్శన ఇచ్చాడు. 50 ఓవర్ల క్రికెట్‌లో డబుల్‌ సెంచరీ చేసిన బ్యాటర్‌గానూ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. 

2. ‘నాలుగు’ విషయంలో స్పష్టత..

ఎప్పట్నుంచో కలవరపెడుతున్న అంశం ‘నాలుగో’ స్థానంలో ఎవరు ఆడతారు? విండీస్‌ పర్యటనలోనూ ఓ స్పష్టతకు రాకపోవడం గమనార్హం. ప్రపంచకప్‌ నాటికి సెట్ కావాలంటే.. ఆసియా కప్‌లో అలాంటి ఆటగాడికి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. గత వన్డే ప్రపంచకప్‌లో విజయ్‌ శంకర్‌, అంబటి రాయుడు మధ్య తీవ్ర పోటీ ఉంది. చివరికి శంకర్‌కు అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇప్పుడు కేఎల్ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌తోపాటు సూర్యకుమార్‌, తిలక్ వర్మ, సంజూ శాంసన్‌ ఆ స్థానానికి రేసులో ఉన్నారు. శ్రేయస్‌ ఫిట్‌నెస్‌ సాధిస్తే మాత్రం అతడే అక్కడ ఫిక్స్‌ అయిపోవడం ఖాయం. విండీస్‌తో టీ20 సిరీస్‌లో అదరగొట్టిన తిలక్‌ ఇటు బౌలింగ్‌ కూడా చేయనుండటం సానుకూలాంశం. మరి సెలెక్షన్‌ కమిటీ ఎవరిని ఎంపిక చేస్తుందో వేచి చూడాలి. 

రిటైర్‌మెంట్‌లోనూ వీడని ధోనీ-రైనా స్నేహబంధం.. సంజూ బదులు రింకు.. బెన్‌స్టోక్స్‌ యూ-టర్న్!

3. స్పిన్ కాంబినేషన్ ఎలా ఉండనుంది? 

ఉపఖండం పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయి. అయితే, ప్రత్యర్థి బ్యాటర్లూ స్పిన్‌ను ఎదుర్కోగలరనే విషయం గమనించాలి. మరీ ముఖ్యంగా పాకిస్థాన్‌, శ్రీలంక జట్ల ఆటగాళ్ల నుంచి ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ క్రమంలో స్పిన్నర్ల ఎంపిక విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా ఉంటాడు. అతడికి బ్యాకప్‌గా అక్షర్ పటేల్‌కు అవకాశం దక్కే వీలుంది. వీరిద్దరూ బ్యాటింగ్‌, బౌలింగ్‌లో జట్టుకు అండగా ఉంటారు. మరో సీనియర్‌ స్పిన్నర్ కమ్‌ బ్యాటర్ రవిచంద్రన్ అశ్విన్‌ కూడా తన ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్ల విషయంలో మాత్రం ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. విండీస్‌ పర్యటనలో అదరగొట్టిన కుల్‌దీప్‌యాదవ్‌తోపాటు యుజ్వేంద్ర చాహల్ రేసులో ఉన్నాడు. కానీ, విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో చాహల్‌కు అవకాశం రాలేదు. దీంతో చాహల్‌ వైపు మొగ్గు చూపే అవకాశాలు తక్కువగానే ఉన్నట్లు క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. 

4. పేస్‌ కుదిరేనా..?

భారత క్రికెట్ అభిమానులతోపాటు ఆటగాళ్లందరి చూపు బుమ్రా వైపే ఉంది. స్టార్‌ పేసర్‌ జట్టులోకి వస్తే భారత బౌలింగ్‌ విభాగం పటిష్ఠంగా మారుతుందనడంలో సందేహం లేదు. ఆగస్ట్ 18 నుంచి ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు బుమ్రాను కెప్టెన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. అక్కడ ఫిట్‌నెస్‌పరంగా సఫలమైతే భారత్‌కు తిరుగుండదు. బుమ్రాతోపాటు సిరాజ్‌, షమీ, ముకేశ్‌ కుమార్‌తో కూడిన పేస్ దళం ఉంది. పేస్‌ ఆల్‌రౌండర్లుగా శార్దూల్ ఠాకూర్‌, హార్దిక్‌ పాండ్య ఉండనే ఉంటారు. శార్దూల్ మంచి ఫామ్‌లో ఉండగా.. పాండ్య మాత్రం తన స్థాయి ఆటను ప్రదర్శించడంలో విఫలం కావడం ఆందోళనకు గురి చేసే అంశం. విండీస్‌ పర్యటనలోనూ ఏమంత గొప్పగా ఆడలేదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు