Hanuma Vihari: విహారికి దక్కని చోటు

తెలుగు కుర్రాడు, మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ గాదె హనుమ విహారిని టీమ్‌ఇండియా టెస్టు జట్టు నుంచి తప్పించారు. 2018 నుంచి టీమ్‌ఇండియా టెస్టు జట్టులో కొనసాగుతున్న విహారిపై ఎలాంటి కారణం లేకుండా వేటు వేశారు. సొంతగడ్డపై ...

Updated : 13 Nov 2021 08:47 IST

కోహ్లి, రోహిత్‌, పంత్‌, బుమ్రా, షమిలకు విశ్రాంతి

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు టీమ్‌ఇండియా ఎంపిక

దిల్లీ

తెలుగు కుర్రాడు, మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ గాదె హనుమ విహారిని టీమ్‌ఇండియా టెస్టు జట్టు నుంచి తప్పించారు. 2018 నుంచి టీమ్‌ఇండియా టెస్టు జట్టులో కొనసాగుతున్న విహారిపై ఎలాంటి కారణం లేకుండా వేటు వేశారు. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం శుక్రవారం ఎంపిక చేసిన టీమ్‌ఇండియా జట్టులో విహారికి చోటు దక్కలేదు. ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్‌ఇండియా 2-1తో టెస్టు సిరీస్‌ నెగ్గడంలో ముఖ్యభూమిక పోషించిన విహారిపై అప్పట్లో ప్రశంసల వర్షం కురిసింది. గాయం కారణంగా బ్రిస్బేన్‌ టెస్టు (చివరి మ్యాచ్‌)లో ఆడలేకపోయిన విహారి.. సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో 4 టెస్టుల సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. అయితే మిగతా వాళ్లంతా ఐపీఎల్‌తో బిజీగా ఉండగా.. విహారి మాత్రం కౌంటీ క్రికెట్లో బరిలో దిగాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ కోసం అక్కడి పరిస్థితులకు తగ్గట్లుగా సన్నద్ధమయ్యాడు. జట్టు కూర్పులో భాగంగా అదనపు బౌలర్‌తో ఆడటంతో ఈ రెండు సిరీస్‌లలో విహారికి అవకాశం రాలేదు. తుదిజట్టులో చోటివ్వకుండా విహారిని విఫల ఆటగాడిగా జట్టు నుంచి తప్పించడం విమర్శలకు తావిస్తోంది. ‘‘ఎ-సిరీస్‌ కోసం విహారిని దక్షిణాఫ్రికా పర్యటనకు పంపిస్తున్నాం. అక్కడ మూడు మ్యాచ్‌ల్లో సత్తాచాటి ప్రధాన జట్టులోకి రావొచ్చు’’ అని బీసీసీఐ అధికారి తెలిపాడు అయితే ఈనెల 9న ప్రకటించిన ఇండియా-ఎ జట్టులో విహారి పేరే లేదు. అంటే.. కచ్చితంగా టెస్టు జట్టులో చోటు దక్కాల్సిన విహారికి చివరి నిమిషంలో మొండిచెయ్యి ఎదురైందన్నది సుస్పష్టం. టెస్టుల్లో ఎలాంటి అనుభవం లేని శ్రేయస్‌ అయ్యర్‌కు 16 మంది సభ్యుల జట్టులో చోటు లభించింది. వన్డేలు, టీ20లకు పరిమితమైన శ్రేయస్‌ పేరును ఎవరు ప్రతిపాదించారన్నది తెలియరాలేదు. ఏదేమైనా సరైన అవకాశాలు ఇవ్వకుండా.. ఎలాంటి కారణం చూపించకుండా టెస్టు జట్టులో నుంచి విహారిని తప్పించడం విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కోహ్లి ఒక్క టెస్టుకే: మరోవైపు రెండు టెస్టుల సిరీస్‌ నుంచి టీమ్‌ఇండియా టీ20 జట్టు కెప్టెన్‌ రోహిత్‌శర్మ, వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమిలకు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రెండో టెస్టు నుంచి జట్టుకు అందుబాటులో ఉంటాడు. అతని గైర్హాజరీలో ఆజింక్య రహానె తొలి టెస్టులో జట్టుకు సారథ్యం వహిస్తాడు. వెటరన్‌ వృద్ధిమాన్‌ సాహా, తెలుగు కుర్రాడు కోన శ్రీకర్‌ భరత్‌కు వికెట్‌ కీపర్లుగా జట్టులో స్థానం లభించింది. ఈనెల 25 నుంచి 29 వరకు కాన్పూర్‌లో తొలి టెస్టు, డిసెంబరు 3 నుంచి 7 వరకు ముంబయిలో రెండో టెస్టు జరుగనున్నాయి.

జట్టు: అజింక్య రహానె (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, చెతేశ్వర్‌ పుజారా (వైస్‌ కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, వృద్ధిమాన్‌ సాహా (వికెట్‌ కీపర్‌), శ్రీకర్‌ భరత్‌ (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, ఆర్‌.అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, జయంత్‌ యాదవ్‌, ఇషాంత్‌శర్మ, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని