
Sports News: ఖేల్‌రత్నకు అశ్విన్, మిథాలీ పేర్లు
ఫుట్‌బాల్ నుంచి ఛెత్రీ పేరు సిఫార్సు
దిల్లీ: ప్రతిష్ఠాత్మక క్రీడా పురస్కారాలకు భారత క్రీడా సంఘాలన్నీ క్రీడాకారుల పేర్లు సిఫార్సు చేస్తున్నాయి. జూన్ 21తో ముగిసిన గడువును పొడిగించడంతో జాబితాలు సిద్ధం చేస్తున్నాయి. బీసీసీఐ, ఫుట్‌బాల్, రెజ్లింగ్ ఇతర సంఘాలు ఇప్పటికే కొందరి పేర్లను ప్రస్తావించాయి.
రాజీవ్ ఖేల్‌రత్నకు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, మహిళల వన్డే, టెస్టు సారథి మిథాలీ రాజ్ పేర్లను బీసీసీఐ సిఫార్సు చేసింది. అర్జున కోసం శిఖర్ ధావన్, కేల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా పేర్లను ప్రతిపాదించింది.
‘అర్జున కోసం మరే మహిళా క్రికెటర్ పేరు ప్రతిపాదించలేదు. మిథాలీని మాత్రం ఖేల్‌రత్న కోసం సిఫార్సు చేశాం’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్లో మిథాలీ రాజ్ ఈ మధ్యే 22 ఏళ్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. వన్డేల్లో 7000కు పైగా పరుగులు చేసింది.
ఇక సీనియర్ స్పిన్నర్ అశ్విన్ 79 టెస్టుల్లో 413, వన్డేల్లో 150, టీ20ల్లో 42 వికెట్లు తీశాడు. జట్టు విజయాల్లో కీలకంగా నిలుస్తున్నాడు. శ్రీలంక పర్యటనలో భారత్‌కు సారథ్యం వహిస్తున్న శిఖర్ ధావన్ పేరును మళ్లీ పంపించారు. గతేడాది అతడిని పురస్కారం వరించలేదు. బుమ్రా, రాహుల్ అంతర్జాతీయ క్రికెట్లో వేగంగా ఎదుగుతున్నారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య సైతం నలుగురి పేర్లను అర్జున పురస్కారాల కోసం ప్రతిపాదించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకాలు గెలిచిన రవి దహియా, దీపక్ పునియా, అన్షు మలిక్, సరితను ఎంపిక చేశారు. వీరు ఒలింపిక్స్‌లో పోటీపడే సంగతి తెలిసిందే. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య టీమ్ఇండియా సారథి సునిల్ ఛెత్రీ పేరును రాజీవ్ ఖేల్ రత్న కోసం సిఫార్సు చేసింది. దస్త్రాలు మాత్రం ఇంకా సమర్పించలేదని తెలిసింది.
గతేడాది ప్రకటించిన క్రీడా పురస్కారాలు ఆశ్చర్య పరిచాయి. ఒకేసారి ఐదుగురిని ఖేల్‌రత్నకు ఎంపిక చేశారు. టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనికా బాత్రా, క్రికెటర్ రోహిత్ శర్మ, రెజ్లర్ వినేశ్ ఫొగాట్, హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్, పారాలింపిక్స్ హైజంప్ ఆటగాడు మరియప్పన్ తంగవేలుకు పురస్కారం అందజేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.