BCCI: గంభీర్‌తోపాటు కోచ్‌గా రామన్.. ఆలోచనలో బీసీసీఐ!

భారత క్రికెట్‌ జట్టు కోచ్‌ నియామకంలో బీసీసీఐ కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరు మాజీ క్రికెటర్లను ఇంటర్వ్యూ కూడా చేసిన సంగతి తెలిసిందే.

Published : 20 Jun 2024 12:37 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రేసు ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటివరకు కేవలం గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) మాత్రమే ఉన్నాడని భావిస్తే.. మాజీ క్రికెటర్ డబ్ల్యూవీ రామన్‌ కూడా బీసీసీఐ ఇంటర్వ్యూకి వెళ్లాడు. తన ప్రణాళికలను గంభీర్ వివరించగా.. భారత క్రికెట్‌ అభివృద్ధి కోసం రామన్‌ రోడ్‌మ్యాప్‌ను బీసీసీఐకి సమర్పించినట్లు తెలిసింది. గంభీర్‌ ఐపీఎల్‌లో లఖ్‌నవూ, కోల్‌కతాకు మెంటార్‌గా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఉంది. రామన్‌ అండర్-19తోపాటు భారత మహిళా జట్టు కోచ్‌గా కూడా పనిచేశాడు. దీంతో ఎవరిని తీసుకోవాలనే సంక్లిష్ట పరిస్థితుల్లో బీసీసీఐ ఉన్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరో వార్త చక్కర్లు కొడుతోంది. 

‘‘భారత మాజీ క్రికెటర్లు రామన్, గౌతమ్‌గంభీర్‌ సేవలను వినియోగించుకునేందుకు క్రికెట్‌ బోర్డు ఆలోచన చేస్తున్నట్లుంది. గంభీర్‌ను ప్రధాన కోచ్‌గా చేసి.. రామన్‌ను బ్యాటింగ్‌ కోచ్‌గా లేదా సుదీర్ఘ ఫార్మాట్‌ కోచ్‌గా నియమించాలని భావిస్తోంది. వీరిద్దరి వల్ల టీమ్‌ఇండియా క్రికెట్‌ మరింత వృద్ధి చెందే అవకాశం ఉంది. రామన్‌ ఇప్పటికే అండర్-19, భారత్ A జట్లకు కోచ్‌గా పని చేశాడు. ఇప్పుడు ఆటగాళ్లతో మంచి సంబంధాలే ఉన్నాయి. ఇప్పుడు టీ20 వరల్డ్‌ కప్‌ ముగిశాక.. రాబోయే 15 నెలల్లో భారత్‌ ఎక్కువగా వన్డేలు, టెస్టులు ఆడాల్సిఉంది’’ అని క్రీడా వర్గాలు తెలిపాయి. 

ప్రస్తుతం టీమ్‌ఇండియా కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ సేవలు టీ20 ప్రపంచకప్ వరకు మాత్రమే ఉంటాయి. జులై 1 నుంచి కొత్త కోచ్‌ బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. దీంతో బీసీసీఐ ఈ నెలాఖరుకు నూతన కోచ్‌ ఎవరనేది ప్రకటించనుంది. ద్రవిడ్‌ కొనసాగేందుకు ఆసక్తి చూపకపోవడంతో కొత్త కోచ్ నియామకం తప్పట్లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని