పంత్‌ వల్లే నాపై నిందలు: అశ్విన్‌

వికెట్‌కీపర్‌ రిషభ్‌పంత్‌ వల్లే డీఆర్‌ఎస్‌లు వృథా అవుతున్నాయని టీమ్‌ఇండియా ప్రధాన స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అంటున్నాడు. తననెప్పుడూ పంత్‌ నిరాశ పరుస్తుంటాడని సరదాగా వ్యాఖ్యానించాడు. సమీక్షల్లో వైఫల్యాలపై ప్రశ్నించగా అతడిలా నవ్వుతూ బదులిచ్చాడు. ఇండియాటుడే సదస్సులో యాష్‌...

Published : 17 Mar 2021 14:12 IST

డీఆర్‌ఎస్‌ వైఫల్యాలపై సరదా జవాబు

ఇంటర్నెట్‌ డెస్క్‌: వికెట్‌కీపర్‌ రిషభ్‌పంత్‌ వల్లే డీఆర్‌ఎస్‌లు వృథా అవుతున్నాయని టీమ్‌ఇండియా ప్రధాన స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అంటున్నాడు. తననెప్పుడూ పంత్‌ నిరాశ పరుస్తుంటాడని సరదాగా వ్యాఖ్యానించాడు. సమీక్షల్లో వైఫల్యాలపై ప్రశ్నించగా అతడిలా నవ్వుతూ బదులిచ్చాడు. ఇండియాటుడే సదస్సులో యాష్‌ మాట్లాడాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అవకాశమిస్తే కచ్చితంగా రాణిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. వచ్చిన అవకాశాలను గొప్పగా మలచుకోవడమే తనకిష్టమని పేర్కొన్నాడు.

2018 నుంచి ఇప్పటి ఇంగ్లాండ్‌ సిరీస్‌ వరకు అశ్విన్‌ 19 మ్యాచులు ఆడాడు. అతడి బౌలింగ్‌లో టీమ్‌ఇండియా 20 సమీక్షలు కోరింది. అందులో నాలుగు తలకిందులయ్యాయి. ఐదు అంపైర్‌ కాల్స్‌గా ప్రకటించారు. 11 వృథాగా మారాయి. ఇక ఇంగ్లాండ్ సిరీసులో 10 సమీక్షలు కోరగా ఒకటి మాత్రమే సరైంది. 9 విఫలమయ్యాయి. అందులో ఒకటి అంపైర్‌ కాల్‌ కావడం గమనార్హం.

‘డీఆర్‌ఎస్‌ అంశంలో నన్ను చూసే దృష్టికోణం మారాలి! ఎందుకంటే కొన్నిసార్లు అవతలివారు చెప్పింది సరికాదేమో. ఇంగ్లాండ్‌ సిరీస్‌కు ముందు నా డీఆర్‌ఎస్‌లు చాలా బాగుండేవి. కానీ డీఆర్‌ఎస్‌లు తీసుకొనేటప్పుడు కీపర్‌పై ఆధారపడాల్సి ఉంటుంది. ఎందుకంటే బంతి సరైన ప్రాంతంలో పడిందా?విసిరిన కోణం బాగుందా? వికెట్లను తాకగలదా? అనే విషయంలో కీపర్‌ సాయం అవసరం. కానీ చాలా సందర్భాల్లో రిషభ్‌ నన్ను నిరాశ పరుస్తాడు (నవ్వుతూ)! అందుకే మేమిద్దరం డీఆర్‌ఎస్‌పై క్రాష్‌ కోర్సు చేయాలి. ఎందుకంటే రవిభాయ్‌కు ఈ విషయంలో నాపై ఫిర్యాదులున్నాయి’ అని యాష్‌ అన్నాడు. ఏదేమైనా డీఆర్‌ఎస్‌ల అంశంలో మెరుగవ్వాల్సిన అవసరమైతే ఉందని అశ్విన్‌ తెలిపాడు. భవిష్యత్తులో సమీక్షలు కోరేటప్పుడు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అన్నాడు.

పరిమిత ఓవర్ల క్రికెట్‌ గురించి ప్రశ్నించగా తనకు దొరికిన ప్రతి అవకాశాన్నీ గొప్పగా మలచుకుంటానని అశ్విన్‌ స్పష్టం చేశాడు. ‘నేను ప్రశాంతంగా ఉన్నాను. నాతో నేనే పోటీ పడుతున్నాను. అందుకే తెలుపు బంతి క్రికెట్‌పై ప్రశ్నలు అడిగినప్పుడు నవ్వొస్తుంది. ఎందుకంటే నాకొచ్చిన ప్రతి అవకాశాన్నీ అందిపుచ్చుకోవడమే నాకిష్టం. వాటి పట్ల సంతోషంగా ఉన్నాను. అందుకే ఇతరుల అభిప్రాయలకు ఆందోళన చెందను. ఆడిన ప్రతి మ్యాచులో నా ప్రదర్శనతో అవతలివారి మోములో చిరునవ్వులు తెప్పించేందుకే ప్రయత్నిస్తాను’ అని యాష్‌ తెలిపాడు. ప్రస్తుతం వాషింగ్టన్‌ సుందర్‌ బాగా ఆడుతుండటంతో యాష్‌కు అవకాశం ఇవ్వడం లేదని కోహ్లీ పేర్కొన్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని