Ben Stokes: మన్కడ్‌పై అభిప్రాయంలోకి సంస్కృతిని తీసుకురావాలా?

దీప్తి శర్మను ఇంగ్లిష్‌ మీడియా టార్గెట్‌ చేయడంపై హర్షా భోగ్లే స్పందించిన విషయం తెలిసిందే. అయితే రనౌట్‌ విషయంలోకి సంస్కృతిని తీసుకొని రావాల్సిన అవసరం లేదని ఇంగ్లాండ్‌ ఆటగాడు బెన్‌స్టోక్స్‌  ట్విటర్‌లో పేర్కొన్నాడు. 

Published : 02 Oct 2022 01:28 IST

హర్షా భోగ్లే ట్వీట్లకు బెన్‌స్టోక్స్‌ కౌంటర్

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్‌-ఇంగ్లాండ్‌ మహిళల వన్డే మ్యాచ్‌ సందర్భంగా చోటు చేసుకున్న రనౌట్ (మన్కడింగ్‌) వివాదంపై చర్చ కొనసాగుతూనే ఉంది. టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మను ఇంగ్లిష్‌ మీడియా టార్గెట్‌ చేయడంపై ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే ఘాటు స్పందించారు. ‘ఇది సంస్కృతికి సంబంధించిన అంశం. ఇంగ్లాండ్‌ చాలాకాలంపాటు ప్రపంచ క్రికెట్‌ను పాలించిన కారణంగా.. ఇంకా తాము ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుందనే భావిస్తున్నట్లుంది’’ అని వరుసగా ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే. అయితే హర్షా ట్వీట్లకు ఇంగ్లాండ్‌ టెస్టు జట్టు కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ కౌంటర్‌ ఇస్తూ రీట్వీట్లు చేయడం గమనార్హం. 

‘‘మన్కడింగ్‌కు సంబంధించి అభిప్రాయాల్లోకి సంస్కృతి తీసుకోరావాల్సిన అవసరం ఉందా..? 2019 వన్డే ప్రపంచకప్‌ జరిగి దాదాపు రెండేళ్లవుతోంది. ఇప్పటికీ భారత అభిమానుల నుంచి నాకు వివిధ రకాల మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి. ఇదేమైనా మిమ్మల్ని ఆటంకం కలిగించిందా..? ఇక మన్కడింగ్‌ విషయంలో సంస్కృతికి సంబంధమే లేదు. ఇక్కడ మన్కడింగ్‌పైనే కామెంట్లు వస్తున్నాయి కానీ.. ఎవరు ఇంగ్లిష్‌ వాళ్లు అని కాదు. భారత్‌-ఇంగ్లాండ్‌ మహిళల మ్యాచ్‌ సందర్భంగా జరిగిన ఆ సంఘటనపై మిగతా ప్రపంచం ఏమంటోంది? క్రికెట్‌ ఆడుతోంది ఇంగ్లాండ్‌ ఒక్కటే కాదుగా’’ అని వరుసగా బెన్‌ స్టోక్స్‌ ట్వీట్లు చేశాడు.

హర్షా భోగ్లే ఏమన్నారంటే..?

‘‘క్రీడా చట్టం ప్రకారం ఆడిన ఓ మహిళా క్రికెటర్‌ను ప్రశ్నలతో ఇంగ్లాండ్‌ మీడియా ఉక్కిరిబిక్కిరి చేసింది. అదే చట్టవిరుద్ధంగా ప్రయోజనాలను పొందిన వారిని మాత్రం ఎవరూ ప్రశ్నించలేకపోయారు. మీడియాలో సహేతుకమైన వ్యక్తులు ఉన్నారని భావిస్తున్నా. క్రికెట్‌ను చాలాకాలంపాటు పాలించిన ఇంగ్లాండ్‌ అది తప్పు అని అందరికీ చెబుతోంది. వలసవాద ఆధిపత్యం చాలా శక్తివంతమైంది. కొంతమంది దాన్ని ప్రశ్నించారు. అందుకే ఇంగ్లాండ్‌ తాము ఏదైతే తప్పు అని అనుకుంటుందో ప్రపంచమంతా అలాగే భావించాలనే సంస్కృతిని ఇప్పటికీ కొనసాగిస్తోంది. అయితే పరిధిని దాటి ఎవరూ ప్రవర్తించకూడదు. వారికి కరెక్ట్‌ అనిపించవచ్చేమో కానీ.. ఇతరులకు కాదు’’ అని వరుస ట్వీట్లలో హర్షా భోగ్లే విమర్శలు గుప్పించాడు.





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని