Ben stokes: బెన్‌ స్టోక్స్‌ గెలిపించిన మ్యాచ్‌లివే..!

పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తే, ఏ బ్యాటరైనా పరుగులు వరద పారిస్తాడు. టాప్‌ ఆర్డర్‌ పునాది వేస్తే, తరవాత వచ్చిన ఆటగాడు చెలరేగుతాడు. ప్రపంచ క్రికెట్‌లో అభిమానులు

Updated : 20 Jul 2022 13:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తే.. ఏ బ్యాటరైనా పరుగుల వరద పారిస్తాడు. టాప్‌ ఆర్డర్‌ పునాది వేస్తే.. తర్వాత వచ్చిన ఆటగాడు చెలరేగుతాడు. ప్రపంచ క్రికెట్‌లో అభిమానులు ఈ తరహా ఆటగాళ్లను ఏంతో మందిని చూసుంటారు. అయితే, జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకొనే బ్యాటర్లు అరుదుగా ఉంటారు. ఈ అరుదైన కోవకు చెందినవాడే ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌. తాజాగా వన్డేలకు గుడ్‌ బై చెప్పి అభిమానులకు షాక్‌ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో స్టోక్స్‌ వన్డేల్లో ఆడిన మ్యాచ్‌ విన్నింగ్స్‌లను గుర్తుచేసుకుందాం.

ఇంగ్లాండ్‌ కలను నెరవేర్చిన ఇన్నింగ్స్‌..

 

ఇంగ్లాండ్‌కు క్రికెట్‌ పుట్టినిల్లన్న పేరే తప్ప వన్డే ప్రపంచకప్‌ గెలిచింది లేదు. దీంతో ఆ జట్టును ఎవరైనా విమర్శించాలంటే ఈ అస్త్రాన్నే మాటల తూటాల్లా వినియోగించేవారు. కానీ.. వాటికి బెన్‌స్టోక్స్‌ ఫుల్‌ స్టాఫ్‌ పెట్టాడు. దశాబ్దాల కలను నెరవేరుస్తూ 2019 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఇంగ్లాండ్‌ను విజేతగా నిలబెట్టాడు. న్యూజిలాండ్‌తో లార్డ్స్‌ వేదికగా తుది సమరానికి ఇంగ్లాండ్‌ సిద్దమైంది. న్యూజిలాండ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి 241 పరుగులు చేసింది. సాధారణంగా అయితే లక్ష్యం చిన్నదే. కానీ ఇటువంటి మెగా టోర్నీ ఫైనల్‌లో ఇదే కొండంత లక్ష్యం. సెమీస్‌లో భారత్‌ను కట్టడి చేసినట్లుగానే కివీస్‌ పేసర్లు విజృంభించారు. దీంతో  242 పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్‌ 86 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో బెన్‌స్టోక్స్‌ (84 నాటౌట్‌; 98 బంతుల్లో 5x4, 2x6) గొప్పగా పోరాడాడు. బట్లర్‌ (59; 60 బంతుల్లో 6x4)తో కలిసి ఐదో వికెట్‌కు 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. జట్టు స్కోరు 196 పరుగులు వద్ద బట్లర్‌ ఐదో వికెట్‌ రూపంలో వెనుదిరిగాడు.  ఆపై ఇంగ్లాండ్‌ వరుసగా వికెట్లు కోల్పోయినా.. స్టోక్స్‌ పోరాటం ఆగలేదు. చివరి ఓవర్లో 15 పరుగులు కావాలి. అప్పటికే ఇంగ్లాండ్‌ 8 వికెట్లు నష్టపోయింది. అయితే, స్టోక్స్‌ స్ట్రెక్‌ తీసుకుంటూ ఆ ఓవర్లో 14 పరుగులు చేశాడు. దీంతో  50 ఓవర్లు పూర్తయ్యేసరికి 241 పరుగులే చేసి ఆలౌటైంది. అయితే, సూపర్‌ ఓవర్‌లో స్టోక్స్‌ మూడు బంతులు ఎదుర్కొని 8 పరుగులు రాబట్టాడు. చివరకు సూపర్‌ ఓవరూ టై అవ్వడంతో బౌండరీ కౌంట్‌ ఆధారంగా ఇంగ్లాండ్‌ విజేతగా నిలిచింది. స్టోక్స్‌ అద్వితీయ పోరాటమే ఉత్కంఠభరితమైన క్షణాల్లో ఇంగ్లాండ్‌ను గట్టెక్కించేలా చేసింది. చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడిన స్టోక్స్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

ఆసీస్‌పై అజేయ శతకం

2017 ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆస్ట్రేలియాను ఢీకొట్టేందుకు ఇంగ్లాండ్‌ సిద్దమైంది. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ టాస్‌ గెలిచి ప్రత్యర్థి జట్టుకు బ్యాటింగ్‌ అప్పగించింది. ఫించ్‌, స్మిత్‌, హెడ్‌ అర్ధశతకాలతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 277 పరుగులు చేసింది. ఛేదనలో ఆసీస్‌ పేసర్ల ధాటికి 35 పరుగులకే ఇంగ్లాండ్‌ టాప్‌ 3 వికెట్లు కోల్పోయింది. అయితే, కెప్టెన్‌ మోర్గాన్‌ , స్టోక్స్‌ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డారు. నెమ్మదిగా స్కోరు వేగాన్ని పెంచారు. ఈ క్రమంలోనే స్టోక్స్‌ 39 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేశాడు. అయితే, జట్టు స్కోరు 194 పరుగుల వద్ద మోర్గాన్(87) రనౌట్‌ అయ్యాడు. తరవాత బట్లర్‌(29నాటౌట్‌)తో స్టోక్స్‌ లక్ష్యం దిశగా స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. జంపా వేసిన ఇన్నింగ్స్‌ 40 ఓవర్‌ తొలిబంతికి ఫోర్‌కొట్టి స్టోక్స్‌(109 బంతుల్లో 102; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) తన కెరీర్‌లో తొలి శతకం నమోదు చేశాడు. ఈ సమయంలో వర్షం పడటంతో  డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం అప్పటికీ ఆసీస్‌ కంటే 40 పరుగులు ముందున్న ఇంగ్లాండ్‌ను అంపైర్లు విజేతగా ప్రకటించారు. అద్భుతమైన శతకం బాదిన స్టోక్స్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కింది.

టీమ్‌ఇండియాపై విధ్వంసం

ఇంగ్లాండ్‌ 2021లో టీమ్‌ఇండియాపై మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ ఓడిపోయింది. పుణె వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ బ్యాటర్లు చెలరేగారు. రాహుల్‌ శతకం, కోహ్లీ, పంత్‌ అర్ధశతకాలతో టీమ్‌ఇండియా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్‌ ఓపెనర్లు రాయ్, బెయిర్‌ స్టో తొలి వికెట్‌కు 110 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే, రాయ్‌(55) ఔట్‌య్యాక వచ్చిన స్టోక్స్‌ భారత బౌలర్లతో ఓ ఆట ఆడుకున్నాడు. బెయిర్‌స్టో (112 బంతుల్లో 124)తో కలిసి 175 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 40 బంతుల్లో 50 పరుగులు చేసిన స్టోక్స్‌ ... ఆ తర్వాత  వచ్చిన బాల్‌ను వచ్చినట్లు బౌండరీకి తరలిచ్చాడు. స్పిన్నర్లు కుల్‌దీప్‌ యాదవ్‌, కృనాల్‌ పాండ్యలపై విరుచుకుపడ్డాడు. కుల్‌దీప్‌ వేసిన ఇన్నింగ్స్‌ 33వ ఓవర్లలో హ్యాట్రిక్‌ సిక్సర్లు బాదాడు. కృనాల్‌ వేసిన ఆ తరవాతి ఓవర్‌లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌ కొట్టాడు. భువనేశ్వర్‌ బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టి శతకానికి చేరువయ్యాడు. అయితే, ఆ తరవాతి బంతికే పంత్‌కి క్యాచ్‌ ఇచ్చి (52 బంతుల్లో 99; 4 ఫోర్లు, 10 సిక్సర్లు) సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఔటయ్యాడు. అర్ధశతకం తర్వాత స్టోక్స్‌ 12 బంతుల్లోనే 49 పరుగులు చేయడం విశేషం. దీంతో ఇంగ్లాండ్‌ 43.3 ఓవర్లలోనే  337 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది.

పాక్‌కు నిరాశ మిగిల్చిన స్టోక్స్‌..

2019లో పాకిస్థాన్‌ ఐదు వన్డేల సిరీస్‌ ఆడేందుకు ఇంగ్లాండ్‌లో పర్యటించింది. సిరీస్‌లో రెండు మ్యాచులు ఓడిపోగా, ఒక మ్యాచ్‌ రద్దయ్యింది. కీలకమైన నాలుగో వన్డేలో ఓడితే సిరీస్‌ గల్లంతే. నాటింగ్‌హామ్‌ వేదికగా మ్యాచ్‌. ఇంగ్లాండ్‌ టాస్‌ గెలిచి ఫీల్డిండ్ ఎంచుకొంది. అయితే, ఆరంభం నుంచి పాక్‌ బ్యాటర్లు ఎంతో పట్టుదలతో ఆడారు. బాబర్‌ అజామ్‌ శతక్కొట్టగా, ఫకార్‌ జమాన్‌, మహమ్మద్‌ హఫీజ్‌ అర్ధ శతకాలు చేశారు. దీంతో 50 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు ఓపెనర్లు 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి శుభారంభం ఇచ్చారు. అయితే, ఓపెనర్ జేమ్స్‌ విన్సీ(43) ఔటయ్యాక జో రూట్‌(36)తో కలిసి జాసన్‌ రాయ్‌(114) స్కోరు బోర్డును 200 పరుగులు దాటించాడు. అలవోకగా లక్ష్యాన్ని ఛేదిస్తారని అంతా భావించారు. అయితే , జట్టు స్కోరు 201 పరుగుల వద్ద రాయ్‌ వెనుదిరిగాడు. అప్పుడే బెన్‌స్టోక్స్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. కానీ, ఇంగ్లాండ్‌ మరో 15 పరుగుల వ్యవధిలోనే రూట్‌, బట్లర్‌, అలీ వికెట్లను కోల్పోయింది. దీంతో పాకిస్థాన్‌కు విజయంపై ఆశలు చిగురించాయి. అయితే  స్టోక్స్‌ (64 బంతుల్లో 71; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ఇన్నింగ్స్‌తో పాక్‌ ఆశలు ఆవిరయ్యాయి. టెయిలెండర్లతో కలిసి జట్టుకు విజయాన్ని అందించాడు. స్టోక్స్‌ పోరాటంతో ఇంగ్లాండ్‌ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ పూర్తి చేసింది.

వరల్డ్‌ కప్‌ ఫస్ట్ మ్యాచ్‌లో ..

సొంతగడ్డపై ఇంగ్లాండ్‌ 2019 ప్రపంచకప్‌ గెలిచేందుకు ఎదురుచూస్తోంది. ప్రపంచకప్‌ మొదటి మ్యాచ్‌లో సౌతాఫ్రికాను ఢీకొట్టేందుకు సిద్ధమైంది. టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా జట్టు ఇంగ్లాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తాహిర్‌ వేసిన తొలి ఓవర్‌ రెండో బంతికే ఓపెనర్ బెయిర్‌ స్టో డకౌటయ్యి పెవిలియన్‌ చేరాడు. మరో ఓపెనర్‌ రాయ్‌, జో రూట్‌ అర్ధ శతకాలు చేసి ఔటయ్యారు. 111/3 వద్ద బెన్‌ స్టోక్స్‌ క్రీజ్‌లో అడుగుపెట్టాడు. మోర్గాన్‌తో కలిసి దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలోనే 45 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. జట్టు స్కోరు 217 పరుగుల వద్ద మోర్గాన్‌(57)నాలుగో వికెట్‌ రూపంలో వెనుదిరిగాడు. అయితే,  ఆ తరవాత వచ్చిన బట్లర్(18), మొయిన్(3) విఫలం అయ్యారు. స్టోక్స్‌(79 బంతుల్లో 89; 9ఫోర్లు) మాత్రం ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. జట్టు స్కోరు 300 పరుగుల వద్ద స్టోక్స్‌ ఔటయ్యాడు. ఇంగ్లాండ్‌ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 311 పరుగులు చేయగలిగింది. ఛేదనలో ఇంగ్లిష్‌ బౌలర్ల ధాటికి సఫారీలు 207 పరుగులకే కుప్పకూలారు. బ్యాట్‌తో పాటు బంతి(రెండు వికెట్లు)తో రాణించిన స్టోక్స్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇదే టోర్నీ ఫైనల్‌ మ్యాచ్‌నూ స్టోక్సే గెలిపించడం విశేషం.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని