Ben Stokes: బెన్‌ స్టోక్స్‌కు చెన్నై పగ్గాలు..?

ఐపీఎల్‌ మినీ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లలో ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ఒకడు. చెన్నై అతడిని ఏకంగా రూ.16.25కోట్లకు దక్కించుకుంది. మరి భవిష్యత్తులో అతడు చెన్నై పగ్గాలు అందుకుంటాడా?

Published : 24 Dec 2022 11:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌ మినీ వేలంలో ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్ స్టోక్స్‌ (Ben Stokes)ను చెన్నై ఏకంగా రూ.16.25కోట్లకు దక్కించుకుంది. ఆ జట్టు కొనుగోలు చేసిన అత్యంత ఖరీదైన ఆటగాడు ఇతడే. ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ టెస్టు సారథిగా ఉన్న స్టోక్స్‌.. భవిష్యత్తులో చెన్నై (Chennai) పగ్గాలు చేపట్టే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్‌ స్కాట్‌ స్టైరిస్‌ కూడా దీనిపై స్పందించాడు. వచ్చే లీగ్‌ సీజన్‌లోనే ధోనీ (Dhoni) నుంచి స్టోక్స్‌.. కెప్టెన్సీ బాధ్యతలు అందుకోవచ్చని అంచనా వేశాడు.

‘‘అతడే(స్టోక్స్‌) చెన్నై కెప్టెన్‌ అవుతాడని అనిపిస్తోంది. గతంలో(గత సీజన్‌ను ఉద్దేశిస్తూ) ఎంఎస్‌ ధోనీ తన కెప్టెన్సీ బాధ్యతలను మరొకరికి అప్పగించాడు. ఐపీఎల్‌ సీజన్ల మధ్యలో ధోనీ పెద్దగా మ్యాచ్‌లు ఆడట్లేదు. రాబోయే సీజన్‌లోనూ కెప్టెన్సీని అప్పగించేందుకు ధోనీకి స్టోక్స్‌ రూపంలో అవకాశం వచ్చింది. అదే జరిగితే స్టోక్స్‌ తదుపరి కెప్టెన్‌ అవుతాడు’’ అని ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ స్టైరిస్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

గత సీజన్‌కు ముందు ధోనీ (Dhoni).. కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. దీంతో చెన్నై పగ్గాలను భారత ఆల్‌రౌండర్‌ జడేజాకు అప్పగించారు. కానీ, జడేజా సారథ్యంలో చెన్నై జట్టుకు ఆశించిన ఫలితాలు దక్కలేదు. దీంతో సీజన్‌ మధ్యలో అతడిని తప్పించి.. తిరిగి ధోనీనే కెప్టెన్‌ చేశారు.

ఇక.. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో ఇంగ్లాండ్‌ (England) ఛాంపియన్‌గా నిలవడంతో.. ఐపీఎల్‌ వేలంలో ఆ దేశ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌కరన్‌ ఏకంగా రూ.18.5 కోట్లతో ఐపీఎల్‌ (IPL Auction 2023) చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. స్టోక్‌ కూడా రూ.16.25కోట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్‌ టీ20 ప్రపంచకప్‌ విజయంలో స్టోక్స్‌ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని