IND vs SL : భారత్-లంక రెండో టెస్టు పిచ్‌కు ‘బిలో యావరేజ్‌’ రేటింగ్‌

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం పిచ్‌కు...

Updated : 20 Mar 2022 19:38 IST

ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం పిచ్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) దారుణమైన రేటింగ్‌ను ఇచ్చింది. ఇటీవల చిన్నస్వామి స్టేడియం వేదికగానే భారత్-శ్రీలంక జట్ల మధ్య గులాబీ బంతి టెస్టు మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. పిచ్‌కు సంబంధించిన నివేదికను మ్యాచ్‌ రిఫరీ జవగల్ శ్రీనాథ్ ఐసీసీకి సమర్పించారు. శ్రీనాథ్‌, ఐసీసీ ప్రకటన ప్రకారం.. ‘‘చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌కు ఉపయోగించిన పిచ్‌ మొదటి రోజు నుంచే టర్నింగ్‌ ట్రాక్‌గా మారింది. రోజులు గడిచే కొద్దీ మార్పులు వస్తున్నప్పటికీ.. బ్యాట్‌, బంతికి మధ్య సరైన పోటీ లేదనిపించింది. అందుకే పిచ్‌ రేటింగ్‌ను ‘బిలో యావరేజ్‌’గా పేర్కొన్నాం’’ అని శ్రీనాథ్‌ వెల్లడించాడు. ఐసీసీకి సమర్పించిన నివేదికను బీసీసీఐకి పంపినట్లు పేర్కొన్నాడు. అంతేకాకుండా పిచ్‌, అవుట్ ఫీల్డ్‌ మానిటరింగ్ ప్రాసెస్‌ కింద చిన్నస్వామి స్టేడియానికి ఒక డిమెరిట్ పాయింట్‌ను ఐసీసీ విధించింది. 

భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన డే/నైట్‌ టెస్టు మూడు రోజుల్లోపే ముగిసింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమ్‌ఇండియా 238 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకే పరిమితమైంది. అయితే బుమ్రా (5/24) టర్నింగ్‌ డెలివరీలకు లంక 109 పరుగులకే కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో 303/9 స్కోరు వద్ద టీమ్‌ఇండియా డిక్లేర్డ్‌ చేసింది. భారీ లక్ష్య ఛేదనలోనూ అశ్విన్‌ (4/55), బుమ్రా (3/23) దెబ్బకు లంక 208 రన్స్‌కే ఆలౌటైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని