Published : 31/03/2021 01:21 IST

ఐపీఎల్‌లో ఉత్తమ ఆల్‌రౌండర్లు వీరే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: వన్డేలు, టీ20లు, టెస్టులు ఇలా ఏ ఫార్మాట్‌  అయినా ఆల్‌రౌండర్లదే కీలకపాత్ర. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆపద్బాంధవులుగా మారి మ్యాచ్‌లను మలుపు తిప్పుతారు. మెరుపు వేగంతో కదులుతూ అద్భుతమైన క్యాచులు ఒడిసిపడతారు. చిరుతలా పరుగెత్తుతూ రనౌట్లు చేస్తారు.  ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లోనూ అలాంటి ఆటగాళ్లకు కొదవలేదు. ప్రతి జట్టులో కనీసం నలుగురు లేదా అయిదుగురు ఆల్‌రౌండర్లు ఉన్నారు. వీరిలో కొంతమంది మాత్రమే నిలకడైన ఆటతీరుతో అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు. అయితే ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఉన్న అత్యుత్తమ ఆల్‌రౌండర్లు ఎవరో  తెలుసుకుందాం!

1.కీరన్‌ పొలార్డ్‌ 

ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ ఫీల్డర్లు, ఆల్‌రౌండర్లలో పొలార్డ్ ఒకడు. అందుకు అతడు పట్టే క్యాచులే నిదర్శనం. అలాగే క్రీజులో కుదురుకున్నాడంటే భారీ సిక్సర్లతో విరుచుకుపడుతూ విధ్వంసం సృష్టించడం అతడి నైజం. 2009లో జరిగిన ఛాంపియన్స్‌ లీగ్‌లో ట్రినిడాడ్‌ అండ్‌ టుబాగో తరఫున మంచి ప్రదర్శన కనబరచడంతో 2010లో ముంబయి ఇండియన్స్ పొలార్డ్‌ను తీసుకుంది. అప్పటి నుంచి ఆ జట్టులోనే కొనసాగుతున్నాడు. ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి ముంబయికి విజయాలందించాడు ఈ కరీబియన్‌ ప్లేయర్‌. ఐపీఎల్‌‌లో అతడి గణాంకాలు పరిశీలిస్తే.. 164 మ్యాచుల్లో 149.87 స్ట్రెక్‌రేట్‌తో 29.93 సగటు సాధించి 3,023 పరుగులు సాధించాడు. అలాగే బౌలింగ్‌లోనూ 60 వికెట్లు పడగొట్టాడు. దీంతోనే అతడు ఆ జట్టుకు ఎంత విలువైన ఆటగాడో స్పష్టమవుతోంది. కొన్ని సార్లు ముంబయికి కెప్టెన్‌గానూ వ్యవహరించాడు.


                                                                          

2. డ్వాన్‌‌ బ్రావో

వికెట్‌ తీయగానే డ్యాన్స్‌ చేస్తూ సంబరాల్లో మునిగితేలే డ్వాన్ బ్రావో ప్రస్తుతం చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడుతున్నాడు. బ్రావో  ఐపీఎల్‌ మొదటి మూడు సీజన్లలో ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. మోర్కెల్‌, రవీంద్ర జడేజా లాంటి ఆల్‌రౌండర్లు ఆ జట్టులో ఉన్నా 2011లో ఇతడిని సీఎస్కే కొనుగోలు చేసింది. కెప్టెన్‌ కూల్‌ ఎం.ఎస్‌ ధోనీ సారథ్యంలో బ్రావో మంచి ఆల్‌రౌండర్‌గా తయారయ్యాడు. లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేసే ఈ కరీబియన్‌ క్రికెటర్‌‌ మంచి మ్యాచ్‌ఫినిషర్‌ కూడా.  అలాగే డెత్‌ ఓవర్లలో తక్కువ వేగంతో వైవిధ్యమైన బంతులు వేస్తూ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెడతాడు. రెండు సీజన్లలో పర్పుల్‌ క్యాప్‌(అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌)ను సొంతం చేసుకున్నాడు. మొత్తం మీద 140 ఐపీఎల్‌ మ్యాచ్‌లాడిన ఈ విండీస్‌ ప్లేయర్‌.. 128.22 స్ర్టెక్‌రేట్‌తో 1,490 పరుగులు చేశాడు.  అలాగే153 వికెట్లు పడగొట్టి బౌలింగ్‌లోనూ సత్తాచాటాడు.


                                                                                    

3.షేన్ వాట్సన్‌

ఐపీఎల్‌లో ఉన్న అత్యుత్తమ‌ ఆల్‌రౌండర్లలో షేన్‌ వాట్సన్‌ ఒకడు. భీకరమైన షాట్లు ఆడుతూ ఫోర్లు, సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తించే ఈ ఆసీస్‌ ప్లేయర్‌ బంతితోనూ రాణిస్తాడు. ఐపీఎల్‌ మొదలైనప్పటి 2008 నుంచి 2015 వరకు రాజస్థాన్‌ తరఫున ఆడిన అతడు.. ఆరంభ  సీజన్‌లో ఆ జట్టు ఛాంపియన్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. 2014, 2015లో కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. ఇక 2016, 2017లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున ఆడి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అనంతరం 2018లో చెన్నై సూపర్ కింగ్స్‌ అతడిని సొంతం చేసుకోగా ఆ  సీజన్‌లో అదరగొట్టాడు. 2 సెంచరీలు బాదాడు. అలా 2018లో చెన్నై విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. చివరగా గతేడాది యూఏఈలో జరిగిన 13వ సీజన్‌లో వాట్సన్‌ చివరిసారి ఐపీఎల్‌ ఆడాడు. అక్కడ జట్టు  పూర్తిగా విఫలమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వాట్సన్‌ మెగా ఈవెంట్‌కు రిటర్మైంట్‌ ప్రకటించాడు. అతడి ఐపీఎల్‌ గణాంకాలు పరిశీలిస్తే.. 31 సగటుతో 3,874 పరుగులు సాధించాడు. అలాగే 7.9 ఎకానమీతో 92 వికెట్లు పడగొట్టాడు.


                                                                              

4.రవీంద్ర జడేజా 

మెరుపు వేగంతో ఫీల్డింగ్‌ చేయడంతోపాటు కష్టసాధ్యమైన క్యాచులను సైతం సునాయసంగా అందుకోవడంలో రవీంద్ర జడేజా దిట్ట. 2008 నుంచి 2010 వరకు రాజస్థాన్‌ తరపున ఆడిన జడ్డూ.. 2011లో కొచ్చి టస్కర్స్‌ కేరళ తరఫున ప్రాతినిధ్యం వహించి మెరుగైన ప్రదర్శన చేశాడు. 2012 నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టులో కొనసాగుతూ కీలక ఆటగాడిగా ఎదిగాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌తో రాణించి తన సత్తా చాటాడు. ఈ క్రమంలోనే 184 మ్యాచులడిన జడ్డూ.. 2,159 పరుగులు చేయడంతోపాటు 7.67 ఎకానమీతో 114 వికెట్లు పడగొట్టాడు.


                                                                   

5.హార్దిక్‌ పాండ్యా

2015లో ముంబయి ఇండియన్స్‌ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన హార్దిక్‌ పాండ్య..వచ్చిరావడంతోనే మెరుపులు మెరిపించాడు. ఈ సీజన్‌లో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో క్లిష్టమైన లక్ష్యఛేదనలో కేవలం 8 బంతుల్లోనే 21 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. తర్వాత వాంఖడే స్టేడియంలో కోల్‌కతాతో తలపడిన మ్యాచ్‌లో 61 పరుగులు చేసి అదరగొట్టాడు. కెప్టెన్‌ రోహిత్ శర్మ సూచనలు పాటిస్తూ బౌలింగ్‌లోనూ సత్తా చాటుతున్నాడు. లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చే బరోడా క్రికెటర్‌..‌ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 159.26 స్ట్రెక్‌రేట్‌తో 1,349 పరుగులు చేశాడు. అలాగే 42 వికెట్లు తీశాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని