IND vs AUS: విరాట్‌ని ఆపకపోతే ఆస్ట్రేలియా గెలవడం చాలా కష్టం: ఆసీస్ మాజీ కెప్టెన్‌

బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీ సిరీస్‌ ఫలితం టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ (Virat Kohli)ఆటతీరుపై ఆధారపడి ఉంటుందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, భారత మాజీ కోచ్‌ గ్రెగ్‌ చాపెల్ అభిప్రాయపడ్డాడు.

Published : 09 Feb 2023 01:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్: గురువారం నుంచి (ఫిబ్రవరి 9) భారత్-ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య నాలుగు టెస్టు సిరీస్‌ (బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ) ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌ భారత్‌కు చాలా కీలకం. ఇందులో ఫలితాల ఆధారంగానే భారత్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుతుందా? లేదా అని తేలుతుంది. అయితే, సిరీస్‌ భారత్‌లో జరుగుతుండటంతో ఆస్ట్రేలియా విజయం సాధించే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని, కానీ ఆ జట్టు టీమ్ఇండియాకు గట్టి పోటీ ఇస్తుందని పలువురు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రిషభ్‌ పంత్‌, బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో ఆసీస్‌కు భారత్‌ను భారత్‌లో ఓడించడానికి ఆసీస్‌కు ఇదే మంచి అవకాశమని మరికొంతమంది విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ (Virat Kohil) ఆటతీరుపై సిరీస్ ఫలితం ఆధారపడి ఉంటుందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, భారత మాజీ కోచ్‌ గ్రెగ్‌ చాపెల్ అభిప్రాయపడ్డాడు.  

‘విరాట్ కోహ్లీ చాలా మంచి ఆటగాడు. అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. పెద్ద సిరీస్‌లలో బాగా ఆడాలని కోరుకుంటాడు. ఆస్ట్రేలియాపై గెలవాలని అతడు ప్రతీసారి కోరుకుంటాడు. ఆస్ట్రేలియాపై కొన్ని అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఆస్ట్రేలియాను కోహ్లీ అతిపెద్ద సవాల్‌గా భావిస్తాడు. కోహ్లీ ఈ సిరీస్‌పై గట్టి ప్రభావాన్ని చూపుతాడు. విరాట్ భారీగా పరుగులు చేస్తే ఆస్ట్రేలియా ఈ సిరీస్‌ను గెలవడం చాలా కష్టం. ఆసీస్‌ బౌలర్లు విరాట్‌ను భారీ స్కోరు చేయకుండా అడ్డుకుంటే అప్పుడు విజయావకాశాలు మెరుగవుతాయి. మొత్తమ్మీద విరాట్ బ్యాటింగ్ సిరీస్‌పై గట్టి ప్రభావం చూపుతుంది’ అని గ్రెగ్ చాపెల్ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని