Published : 20 Aug 2022 01:37 IST

AIFF: ఏఐఎఫ్‌ఎఫ్‌ అధ్యక్ష పదవి.. బరిలో దిగిన టీమ్‌ఇండియా ఫుట్‌బాల్‌ దిగ్గజం

(ఫొటో సోర్స్‌: భూటియా ట్విటర్)

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా మాజీ ఫుట్‌బాల్ దిగ్గజం భైచుంగ్‌ భూటియా ఎన్నికల రణరంగంలోకి దిగాడు. ఇదేదో పార్లమెంట్, అసెంబ్లీ ఎలక్షన్‌ కాదండోయ్‌.. ఇటీవల అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) నిషేధం ఎదుర్కొన్న అఖిల భారత ఫుట్‌బాల్‌ సంఘం (ఏఐఎఫ్‌ఎఫ్‌) అధ్యక్ష పదవి కోసం నామినేషన్‌ దాఖలు చేశాడు. నామినేషన్ల ప్రక్రియకు ఇవాళే ఆఖరి తేదీ. ఆగస్ట్‌ 28న ఎగ్జిక్యూటివ్‌ కమిటీకి ఎన్నికలు జరుగుతాయి. భూటియాతోపాటు మాజీ ఆటగాడు కల్యాణ్‌ చౌబే కూడా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నారు. భూటియా పేరును మాజీ ప్లేయర్‌ దీపక్‌ మండల్, మధుకుమారి ప్రతిపాదించారు. ప్రస్తుతం మధుకుమారి ఎలక్టోరల్‌ కాలేజ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. 

‘‘నేను ఇవాళ ఏఐఎఫ్‌ఎఫ్‌ అధ్యక్ష పదవికి నామినేషన్‌ దాఖలు చేశా. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మాజీ ఆటగాళ్లు కూడా పోటీపడొచ్చనే క్రమంలో భారత ఫుట్‌బాల్‌ అసోషియేషన్‌కు సేవ చేసేందుకు అవకాశం వస్తుందని భావిస్తున్నా.  ప్లేయర్లుగా రాణించిన మేం పాలకులుగా కూడా మంచి చేస్తాం’’ అని భైచుంగ్‌ భూటియా వెల్లడించాడు. ఫుట్‌బాల్ దిల్లీ అధ్యక్షుడు షాజీ ప్రభాకరన్‌, మాజీ ఆటగాడు యూజెనెసన్ లింగ్డో కూడా నామినేషన్లను దాఖలు చేశారు. ఒకవేళ ఎన్నికలు జరిగి పాలక మండలి ఏర్పాటైతే భారత ఫుట్‌బాల్‌ సంఘం మీద విధించిన నిషేధాన్ని ఫిఫా తీసేసే అవకాశం ఉంది. అలానే అక్టోబర్‌లో అండర్‌-17 మహిళల ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌ నిర్వహించుకునే ఛాన్స్‌ భారత్‌కే దక్కుతుంది. భారత ఫుట్‌బాల్‌ సంఘం అధ్యక్షుడిగా ఉన్న ప్రఫుల్ పటేల్‌ను ఇటీవల సుప్రీంకోర్టు తొలగించి అడ్మినిస్ట్రేటివ్‌ కమిటీని నియమించింది. దీంతో ఫుట్‌బాల్‌ పాలక వ్యవహారాల్లో థర్డ్‌ పార్టీ కలగజేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏఐఎఫ్‌ఎఫ్‌పై ఫిఫా నిషేధం విధించిన విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని