Olympics archery: భజన్‌కు పారిస్‌ కోటా

భారత యువ ఆర్చర్‌ భజన్‌ కౌర్‌ పారిస్‌ ఒలింపిక్స్‌ కోటా స్థానాన్ని గెలిచింది. క్వాలిఫయర్స్‌ టోర్నీలో మహిళల రికర్వ్‌ సింగిల్స్‌లో స్వర్ణం సాధించిన ఆమె.. ఈ క్రమంలో దేశానికి కోటా స్థానాన్ని అందించింది.

Published : 17 Jun 2024 03:33 IST

క్వాలిఫయర్స్‌లో పసిడి గురి
దీపిక విఫలం 

అంటాల్య: భారత యువ ఆర్చర్‌ భజన్‌ కౌర్‌ పారిస్‌ ఒలింపిక్స్‌ కోటా స్థానాన్ని గెలిచింది. క్వాలిఫయర్స్‌ టోర్నీలో మహిళల రికర్వ్‌ సింగిల్స్‌లో స్వర్ణం సాధించిన ఆమె.. ఈ క్రమంలో దేశానికి కోటా స్థానాన్ని అందించింది. ఆదివారం తుదిపోరులో భజన్‌ 6-2తో టాప్‌సీడ్‌ మొబినా (ఇరాన్‌)కు షాకిచ్చింది. సింగిల్స్‌లో పారిస్‌ బెర్తు సాధించిన భారత రెండో ఆర్చర్‌ భజన్‌. పురుషుల రికర్వ్‌ సింగిల్స్‌లో విజయవాడ కుర్రాడు బొమ్మదేవర ధీరజ్‌ కోటా గెలుచుకున్నాడు. సింగిల్స్‌లో ఒక దేశానికి రెండే కోటా స్థానాలు లభిస్తాయి. మరోవైపు అంకిత భాకత్‌ పోరాటం క్వార్టర్‌ఫైనల్లోనే ముగిసింది. ఆమె 4-6తో మొబినా చేతిలో పరాజయం చవిచూసింది. ఇంకోవైపు స్టార్‌ ఆర్చర్‌ దీపిక కుమారికి నిరాశ ఎదురైంది. దీపిక 4-6తో రంజానోవా (అజర్‌బైజాన్‌) చేతిలో ఓడింది. టీమ్‌ విభాగాల్లో భారత జట్లు కోటాలు సాధించడంలో విఫలమయ్యాయి. క్వార్టర్స్‌లో పురుషుల జట్టు 4-5తో మెక్సికో చేతిలో ఓడగా.. ప్రిక్వార్టర్స్‌లో మహిళల జట్టు 3-5తో ఉక్రెయిన్‌కు తలొంచింది. అయితే జూన్‌ 24న కటాఫ్‌ తేదీ నాటికి ర్యాంకింగ్‌ను బట్టి భారత జట్లు బెర్తులు సాధించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం రికర్వ్‌ టీమ్‌ ర్యాంకింగ్స్‌లో భారత పురుషుల జట్టు రెండో స్థానంలో, మహిళల జట్టు ఎనిమిదో స్థానంలో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని