పంత్‌, అశ్విన్ తర్వాత భువి

టీమ్‌ఇండియా సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌కుమార్‌ మార్చి నెలకు సంబంధించి ‘ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌’ అవార్డుకు ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్ సందర్భంగా అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు...

Published : 14 Apr 2021 01:02 IST

దుబాయ్‌: టీమ్‌ఇండియా సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌కుమార్‌ మార్చి నెలకు సంబంధించి ‘ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌’ అవార్డుకు ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్ సందర్భంగా అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన అతడు గతనెలలో మేటి క్రికెటర్‌గా నిలిచాడు. గాయాలతో చాలాకాలం అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన భువి ఇటీవల ఇంగ్లాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌ల సందర్భంగా తిరిగి జట్టులో చేరాడు. ఈ నేపథ్యంలోనే మూడు వన్డేల సిరీస్‌లో 4.65 ఎకానమీతో ఆరు వికెట్లు తీసిన టీమ్‌ఇండియా పేసర్‌, తర్వాత ఐదు టీ20ల సిరీస్‌లో 6.38 ఎకానమీతో నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.

కాగా ఈ ఏడాదే ప్రవేశ పెట్టిన ‘ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌’ అవార్డును ఇప్పటివరకూ ముగ్గురు టీమ్‌ఇండియా ఆటగాళ్లు సొంతం చేసుకోవడం విశేషం. జనవరిలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ సందర్భంగా తిరిగి ఫామ్‌లోకొచ్చిన రిషభ్‌పంత్‌.. భారత జట్టు చారిత్రక సిరీస్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో అతడిని జనవరి నెలకు సంబంధించి అత్యుత్తమ ఆటగాడిగా ఎంపిక చేశారు. తర్వాతి నెలలో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ సందర్భంగా స్పిన్ బౌలింగ్‌తో మాయ చేసిన రవిచంద్రన్‌ అశ్విన్‌ ఫిబ్రవరి ‘ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్’‌గా ఎంపికయ్యాడు. ఇప్పుడు అదే ఇంగ్లాండ్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్‌ సందర్భంగా ఇరు జట్లలో కలిపి మేటి బౌలింగ్‌ ప్రదర్శన చేసిన భువనేశ్వర్‌ మార్చి నెల అత్యుత్తమ క్రికెటర్‌గా నిలిచాడు. దీంతో ఈ అవార్డు ప్రవేశపెట్టినప్పటి నుంచి టీమ్‌ఇండియా ఆటగాళ్లే సొంతం చేసుకోవడం విశేషం. ఈ అవార్డు లభించడం పట్ల భువనేశ్వర్‌ సంతోషం వ్యక్తం చేశాడు. గాయాల కారణంగా చాలా కాలం జట్టుకు దూరమవ్వడం బాధేసిందని, ఇప్పుడు తిరిగి టీమ్‌ఇండియాకు వికెట్లు తీయడం సంతోషంగా ఉందన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని