Olympics: సైనా, కిదాంబికి ఎదురు దెబ్బ.. 

ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనాలని భావించిన భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు సైనా నెహ్వాల్‌, కిదాంబి శ్రీకాంత్‌కు శుక్రవారం పెద్ద ఎదురుదెబ్బ తగిలింది...

Updated : 07 May 2021 18:53 IST

మలేసియా ఓపెన్‌ వాయిదా

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనాలని భావించిన భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు సైనా నెహ్వాల్‌, కిదాంబి శ్రీకాంత్‌కు శుక్రవారం పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కరోనా వైరస్‌ కారణంగా మే 25 నుంచి 30 వరకు కౌలాలంపూర్‌లో జరగాల్సిన మలేసియా ఓపెన్‌ సూపర్‌ 750 టోర్నీ వాయిదా పడింది. దాంతో సైనా, శ్రీకాంత్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశాలు సన్నగిల్లాయి. ఇప్పటికే మే 11 నుంచి 16 వరకు జరగాల్సిన ఇండియా ఓపెన్ వాయిదా పడటంతో వారిద్దరూ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడానికి చివరగా రెండు టోర్నీలే మిగిలాయి. అవే మలేసియా, సింగపూర్‌ ఓపెన్‌(జూన్‌ 1 నుంచి 6) టోర్నీలు.

మరోవైపు మలేసియా ఓపెన్‌ రీషెడ్యూల్ చేసినా ఒలింపిక్స్‌ అర్హతకు సంబంధించిన విండోలో దాన్ని పరిగణించలేమని ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఫెడరేషన్‌ స్పష్టం చేసింది. మలేసియా టోర్నీని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, కానీ.. కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా వేయక తప్పడం లేదని నిర్వాహకులు తెలిపారు. ఇక సైనా, శ్రీకాంత్‌ సింగపూర్‌ టోర్నీలో ఆడదామనుకున్నా అదీ కష్టంగానే కనిపిస్తోంది. ఎందుకంటే సింగపూర్‌ ఇప్పటికే ఇక్కడి నుంచి విమాన రాకపోకలను నిషేధించింది. ఒకవేళ ఎవరైనా భారతీయులు అక్కడికి రావాలంటే విడిగా వేరే దేశంలో 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని, ఆ తర్వాత సింగపూర్‌లో అడుగుపెట్టాక మరో 21 రోజులు క్వారంటైన్‌లో ఉండాలనే నిబంధనలు ఉన్నట్లు భారత బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని