WTC Final: టెస్టు గదకు పేరు పెట్టిన కివీస్‌ క్రికెటర్లు

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ గెలిచిన న్యూజిలాండ్‌ ఆటగాళ్లు తిరిగి స్వదేశానికి ప్రయాణమయ్యారు. సొంతగడ్డపై లభించే ఘన స్వాగతం గురించి ఆసక్తిగా ఉన్నారు.

Published : 25 Jun 2021 15:23 IST

రాత్రంతా సంబరాలే.. తన్మయత్వంలో ఆటగాళ్లు

సౌథాంప్టన్‌: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ గెలిచిన న్యూజిలాండ్‌ ఆటగాళ్లు తిరిగి స్వదేశానికి ప్రయాణమయ్యారు. సొంతగడ్డపై లభించే ఘన స్వాగతం గురించి ఆసక్తిగా ఉన్నారు. ప్రపంచ విజేతగా అవతరించాక తొలిరాత్రి ఎలా గడిచిందో.. సంబరాలు ఎలా చేసుకున్నారో.. విమానం ఎక్కేముందు ఆటగాళ్లు వివరించారు. ఐసీసీ అందజేసిన టెస్టు గదకు వారొక పేరు పెట్టారు.

టెస్టు గదకు ‘మైకేల్‌ మేసన్‌’ అని పేరు పెట్టారు. ఇందుకో కారణం ఉంది. మైకేల్‌ మేసన్‌ కివీస్‌ తరఫున 2004లో ఒకే ఒక టెస్టు ఆడాడు. 26 వన్డేలు, 3 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం అతడి వయసు 46. న్యూజిలాండ్‌లో క్రికెట్‌ ఆడని ప్రాంతం నుంచి అతడు జట్టుకు ఎంపికయ్యాడు. అతడి శ్రమకు చిహ్నంగా ఆ పేరు పెట్టారు.

‘రాత్రి మాకు బాగా గడిచింది. ఆటగాళ్లంతా సంతోషంగా ఉన్నారు. రెండేళ్ల కష్టం తర్వాత ఇలాంటి అద్భుతమైన క్షణాలు లభించాయి. రాత్రంతా సంబరాలు చేసుకున్నారు’ అని కివీస్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ అన్నాడు.

ఇక సీనియర్‌ ఫాస్ట్‌ బౌలర్‌ నీల్‌ వాగ్నర్‌ టెస్టు గదను రాత్రంతా చూస్తూనే ఉన్నాడని పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ చెప్పాడు. ‘రాత్రి నుంచి అతడు గదను చూస్తూనే ఉన్నాడు. తన కంటి పరిధిని దాటనివ్వలేదు. కుర్రాళ్లు తన్మయత్వంలో ఉన్నారు. ఒకవైపు సంతోషం, మరోవైపు భావోద్వేగం వారిలో కనిపించింది. న్యూజిలాండ్‌ వెళ్లాక, క్వారంటైన్‌ పూర్తయ్యాక సంబరాలు ఇలాగే కొనసాగుతాయని ఆశిస్తున్నా’ అని బౌల్ట్‌ చెప్పాడు.

విమానం ఎక్కేముందు గద టిమ్‌ సౌథీ చేతుల్లో ఉంది. భుజాలపై దానిని మోసుకొచ్చాడు. ‘రాత్రి అద్భుతంగా గడిచింది. ఆరో రోజుకు చేరిన మ్యాచ్‌లో గెలవడం ప్రత్యేకం. కుర్రాళ్లలో భావోద్వేగం నిండింది. వాతావరణం బాగా లేకపోవడంతో కొంత చిరాకు పడ్డారు. న్యూజిలాండ్‌లో స్పందన ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. ఎందుకంటే మేం చాలాదూరంలో ఉన్నాం. అక్కడి ప్రజలు గర్వ పడతారని, భావోద్వేగంతో ఉంటారని అనిపించింది’ అని సౌథీ తెలిపాడు.

న్యూజిలాండ్‌ ఆటగాళ్లంతా సొంత దేశానికి వెళ్లడం లేదు. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ బ్రిటన్‌లోనే ఉండిపోతున్నాడు. జులై 21 నుంచి ఆరంభమయ్యే ది హండ్రెడ్‌ టోర్నీలో బర్మింగ్‌హామ్‌ ఫీనిక్స్‌ తరఫున ఆడనున్నాడు. ఇక డేవాన్‌ కాన్వే, కైల్‌ జేమీసన్‌, కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌ టీ20 బ్లాస్ట్‌లో మెరవనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని