IPL:ఆటగాళ్ల పనిభార నిర్వహణ.. అవసరమైతే ఐపీఎల్‌లో ఆడటం మానేయండి: రవిశాస్త్రి

ప్రపంచకప్‌ని దృష్టిలో ఉంచుకుని అవసరమైతే ఆటగాళ్లు ఐపీఎల్‌ (IPL 2023)కు దూరం కావాలని భారత మాజీ కోచ్‌ రవిశాస్త్రి సూచించాడు. 

Published : 24 Mar 2023 13:30 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచకప్‌ సమీపిస్తున్నందున అన్ని జట్లు సన్నాహాలు మొదలెట్టాయి. ఇలాంటి తరుణంలో కీలక ఆటగాళ్లు గాయాలబారినపడుతుండటం భారత్‌ని కలవరపెడుతోంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషభ్‌ పంత్ ఎప్పటికి కోలుకుంటాడనే దానిపై స్పష్టత లేదు. గాయాల కారణంగా జట్టుకు దూరమైన బుమ్రా, శ్రేయస్ అయ్యర్‌ అందుబాటులోకి రావడానికి కనీసం నాలుగైదు నెలల సమయం పట్టే అవకాశముంది. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ (IPL) ప్రారంభంకానుంది.ఈ మెగా టోర్నీలో స్టార్‌ ఆటగాళ్లలందరూ ఆడనున్నారు.  ఈ సమయంలో వీరంతా తమ ఫిట్‌నెస్‌ కాపాడుకోవడం ముఖ్యం. ఈ నేపథ్యంలో భారత మాజీ కోచ్‌ రవిశాస్త్రి (Ravi Shastri) బీసీసీఐకి కీలక సూచన చేశాడు. ప్రపంచకప్‌ని దృష్టిలో ఉంచుకుని కీలక ఆటగాళ్ల మ్యాచ్‌ల భారాన్ని తగ్గించేందుకు  ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలతో బీసీసీఐ (BCCI), ఆటగాళ్లు మాట్లాడాలని చెప్పాడు. అవసరమైతే ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడకూడదని సూచించాడు.

‘‘కీలక ఆటగాళ్లు గాయాల బారినపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మేం క్రికెట్‌ ఆడినప్పుడు ఇన్ని సదుపాయాలు లేవు. అయినా, 8-10 సంవత్సరాలు సులభంగా ఆడటం మీరు చూశారు. చాలా మంది ఏడాదిలో 8-10 నెలల పాటు ఆడేవారు. ప్రస్తుతం అప్పటి కంటే ఎక్కువ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లీగ్‌ల్లో ఆటగాళ్లు భాగం కావడంతో వారి విశ్రాంతి సమయం తగ్గుతోంది. బీసీసీఐ, ఆటగాళ్లు కూర్చొని చర్చించుకోవాలి. మీకు క్రికెట్‌ చాలా అవసరం. అదే సమయంలో విశ్రాంతి కూడా ముఖ్యం. అవసరమైతే ఐపీఎల్‌లో ఆడకండి. బీసీసీఐ బాధ్యత తీసుకుని.. ‘ఈ ఆటగాళ్లు మాకు కావాలి. భారత్‌కు వీరి సేవలు అవసరం. వారు ఈ మ్యాచ్‌లు (ఐపీఎల్‌) ఆడకపోతే బాగుంటుంది’ అని ఫ్రాంచైజీలతో చెప్పాలి’’ అని రవిశాస్త్రి వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని