T20 WORLD CUP 2024: టీ20 వరల్డ్‌ కప్‌.. బంతి గెలుస్తోంది

దాదాపు రెండు నెలలపాటు బ్యాటింగ్‌ మెరుపులు మాత్రమే చూసిన క్రికెట్ అభిమానులకు అసలైన మజా లభిస్తోంది. 

Published : 12 Jun 2024 16:49 IST

ఐపీఎల్‌-17లో విపరీతమైన బాదుడు.. బ్యాటింగ్‌ రికార్డులు బద్దలయ్యాయి.. బౌలర్లు బిక్కుబిక్కుమన్నారు. బంతులు ఎక్కడ వేయాలో తెలియక భయపడిపోయారు! 200 స్కోర్లు ఎన్ని నమోదయ్యాయో! నెల వ్యవధిలోనే టోర్నీ మారిపోయింది! టీ20 మెగా సంబరం ప్రపంచకప్‌ వచ్చేసింది. అయింది కొన్ని మ్యాచ్‌లే అయినా ఎంత తేడా! బ్యాటర్లకు కష్టాలు మొదలయ్యాయి. బౌలర్ల ముఖంలో ఆనందం వచ్చింది. బౌలర్లకు కూడా తమ ఉనికిని నిరూపించుకునే అవకాశం చిక్కింది. కారణం వెస్టిండీస్, అమెరికా పిచ్‌లు పూర్తిగా బ్యాటింగ్‌కు స్వర్గధామాలు కాకపోవడమే! అందుకే ఈ కప్‌లో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లో బంతి ప్రతాపం చూపించింది. బ్యాట్‌తో సమానంగా తానూ ఉన్నానంటూ చాటుకుంది.

టీ20 ప్రపంచకప్‌లో తక్కువ స్కోర్లే అవుతున్నాయ్‌! కానీ మ్యాచ్‌లు ఆసక్తిగా సాగుతున్నాయి. ఒక సగటు అభిమానికి ఇంతకంటే ఏం కావాలి? టీ20లు అంటే సిక్స్‌లు, ఫోర్ల మోతే కాదు ఆసక్తికరమైన మ్యాచ్‌లు కూడా అని టీ20 ప్రపంచకప్‌ నిరూపిస్తోంది. డ్రాప్‌ ఇన్‌ పిచ్‌లపై జరుగుతున్న మ్యాచ్‌లు భిన్నమైన ఫలితాలను ఇస్తున్నాయి. ఈసారి సగం టోర్నీ కాకముందే రెండు మ్యాచ్‌ల్లో సూపర్‌ ఓవర్లో రిజల్ట్‌ రావడమే ఇందుకు ఉదాహరణ. ముఖ్యంగా న్యూయార్క్‌లో భారత్‌-పాకిస్థాన్‌.. దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ల్లో స్పల్ప స్కోర్లే నమోదైనా రంజుగా సాగాయి. కనీసం 115 కూడా దాటని భారత్, దక్షిణాఫ్రికా జట్లు బంతితో ప్రత్యర్థి జట్లను నిలువరించి విజయాలు అందుకున్నాయి. టీ20ల్లో బాదుడుతోనే కాదు ఇలా కూడా గెలవచ్చని చాన్నాళ్లకు నిరూపించాయి. ఇప్పటివరకు 21 మ్యాచ్‌లు జరిగితే 10 మ్యాచ్‌ల్లో బంతి ప్రతాపం చూపించింది. తన ఉనికిని చాటుకుంది.

కుదురుకుంటే.. 

వెస్టిండీస్‌లో పిచ్‌లు సహజంగానే కాస్త నెమ్మదిగా ఉంటాయి. కానీ కుదురుకుంటే బ్యాటర్లు అదరగొట్టొచ్చు. అయితే ప్రస్తుత ప్రపంచకప్‌లో పసికూనలు సైతం బౌలర్లను తెలివిగా ఉపయోగించుకుని పెద్ద జట్లను కట్టడి చేస్తున్నాయి. పాకిస్థాన్‌పై అమెరికా సంచలన విజయమే ఇందుకు ఉదాహరణ. ఇక బలమైన న్యూజిలాండ్‌ను 75 పరుగులకే ఆలౌట్‌ చేసి అఫ్గానిస్థాన్‌ బంతి తడాఖా చూపించింది. ఎడాపెడా షాట్లు బాదేయడానికి అనువుగా లేని పిచ్‌ల వల్ల హిట్టర్లకు చాలా కష్టమవుతోంది. నెమ్మదిగా ఆగి వస్తున్న బంతులను ఎదుర్కొని షాట్లుగా మలచాలంటే కాస్త ఓపిక కావాలి. అలా వేచి చూసి కుదురుకున్న బ్యాటర్లు మాత్రమే సఫలం అవుతున్నారు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భారత బ్యాటర్లు అటాకింగ్‌ చేద్దామని ప్రయత్నించి వికెట్లు సమర్పించుకున్నారు. బంతి బతికించింది కాబట్టి భంగపాటు తప్పింది.

ప్రపంచకప్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల ద్వారా ఒక విషయం అయితే స్పష్టమైంది. బ్యాటర్లకు అంత వీజీ కాదని! స్పిన్నర్లు ఎక్కువగా వికెట్లు తీయకున్నా బ్యాటర్లను కట్టిపడేస్తున్నారు. ఊరించే ఫ్లయిటెడ్‌ బంతులతో పరీక్ష పెడుతున్నారు. ముఖ్యంగా అఫ్గాన్‌ స్టార్‌ రషీద్‌ఖాన్, విండీస్‌ కుర్రాడు అకీల్‌ హోసిన్‌ ఆరేసి వికెట్లతో ఇప్పటికే టాప్‌-5 జాబితాలో ఉన్నారు. బంతి ప్రభావం ఉంది కాబట్టే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఒక్క ఆస్ట్రేలియా మాత్రమే 200 పరుగుల మార్కు అందుకోగలిగింది. ఎంత బ్యాటింగ్‌ పవర్‌ ఉన్నా.. తెలివిగా ఆడితేనే వెస్టిండీస్, అమెరికాలో పెద్ద జట్లకు అంత మంచింది. లేకపోతే పాపువా న్యూగినియా, ఒమన్, నమీబియా లాంటి కూనలు షాక్‌ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని