Pele: ఫుట్‌బాల్‌ అత్యుత్తుమ ఆటగాడు.. సాకర్‌ దిగ్గజం పీలే కన్నుమూత

సాకర్‌ దిగ్గజం, బ్రెజిల్‌కు మూడు సార్లు ప్రపంచకప్‌ అందించిన పీలే(82) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. 

Updated : 30 Dec 2022 05:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్రెజిల్‌ దిగ్గజం, ఫుట్‌బాల్‌ అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకరైన పీలే(82) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న పీలే సావోపాలోలోని ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కూతురు ధ్రువీకరించారు. క్యాన్సర్‌ బారిన పడ్డ పీలేకు గతేడాది సెప్టెంబర్‌లో వైద్యులు పెద్ద పేగులో క్యాన్సర్‌ కణితిని తొలగించారు. అప్పటి నుంచి ఆయనకు కీమోథెరపీ చికిత్స అందిస్తున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేర్చారు. ఆయనకు ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఈ క్రమంలో పలు అవయవాలు పనిచేయకపోవడంతో పీలే ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. పీలే కన్నుమూయడంతో దేశాధినేతలు, క్రీడాకారులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు సంతాపం ప్రకటిస్తున్నారు. 

అత్యుత్తుమ ఆటగాడిగా పేరు..

1940 అక్టోబర్‌ 24న జన్మించిన పీలే తన మంత్ర ముగ్ధమైన ఆటతీరుతో సాకర్‌ చరిత్రలో ఓ దిగ్గజ ఆటగాడిగా వెలుగొందాడు. 1958, 1962, 1970 ప్రపంచకప్‌లలో బ్రెజిల్‌ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన పీలే.. సుమారు రెండు దశాబ్దాలపాటు ఎన్నో ఘనతలు అందుకున్నాడు. మూడు ప్రపంచకప్‌లు అందుకున్న ఏకైక వ్యక్తిగా పీలే నిలిచాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్‌బాల్‌ ఫార్వర్డ్ క్రీడాకారుడిగా పేరు లిఖించుకున్న పీలే.. 16 ఏళ్ల ప్రాయంలోనే బ్రెజిల్‌ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 92 మ్యాచ్‌ల్లో 77 గోల్స్‌ చేసి జట్టు తరఫున అత్యధిక గోల్స్‌ చేసిన వ్యక్తిగా నిలిచాడు. 1956 నుంచి 1974 వరకు బ్రెజిలియన్‌ క్లబ్‌ శాంటోస్‌ తరఫున బరిలోకి దిగిన పీలే 659 మ్యాచ్‌ల్లో 643 గోల్స్‌ చేశాడు. 1961, 1962, 1963, 1964, 1965, 1968లో ఆరుసార్లు తన క్లబ్‌కు బ్రెజిల్‌ లీగ్‌ టైటిల్‌ను అందించాడు. ఇక తన కెరీర్‌ చరమాంకంలో న్యూయార్స్‌ కాస్మోస్‌ తరఫున రెండేళ్లు యూఎస్‌లో ఫుట్‌బాల్‌ ఆడాడు. మరో దిగ్గజ ఆటగాడు, అర్జెంటీనా దిగ్గజం  డిగో మారడోనాతో కలిపి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సెంచరీ’ అవార్డును పీలే అందుకున్నాడు. 

చివరిసారిగా సందేశం..

గత నెలలో తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో పీలే ఆసుపత్రిలో చేరాడు. అక్కడి నుంచి చివరిసారిగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘మిత్రులారా.. నెలవారి చెకప్‌లో భాగంగా ఆసుపత్రికి వచ్చాను. ఇలా మీ నుంచి నాకు పాజిటివ్‌ సందేశాలు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఖతార్‌, నాకు సందేశాలు పంపుతున్న వారందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని