FIFA: బ్రెజిల్‌ టీమ్‌ స్పిరిట్‌తో మెరిసిన గోల్‌..!

సమష్టిగా గోల్‌ కొట్టడం ఎలానో 1970 ప్రపంచ కప్‌ ఫైనల్స్‌లో బ్రెజిల్‌ ప్రపంచానికి చూపింది. కెప్టెన్‌ కార్లోస్‌ అల్బెర్టో నాయకత్వంలో ఈ గోల్‌ను సాధించింది. 

Updated : 22 Nov 2022 11:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ గెలవాలంటే ప్రతి ఆటగాడు అద్భుతంగా ఆడితీరాల్సిందే. ఇలా బ్రెజిల్‌ జట్టు సమష్టి పోరాటంతో ఇటలీని ఓడించి 1970లో ప్రపంచకప్‌ను ముద్దాడింది‌. ఈ మ్యాచ్‌లో ఓ గోల్‌ ఫిఫా చరిత్రలోనే గ్రేటెస్ట్‌గా నిలిచిపోతుంది. దిగ్గజ ఆటగాడు పీలే అందించిన పాస్‌తో ఈ గోల్‌ను బ్రెజిల్‌ కెప్టెన్‌ కార్లోస్‌ అల్బెర్టో కొట్టాడు. అతడికి బంతిని అందించడానికి దాదాపు ఏడుగురు బ్రెజిల్‌ ఔట్‌ఫీల్డ్‌ ఆటగాళ్లు 10సార్లు పాస్‌ చేయాల్సి వచ్చింది.

ఈ గోల్‌ పాస్‌ల్లో భాగస్వాములైన ఆటగాళ్లలో టోస్టావో, బ్రిటో, క్లోడో అల్డో, పీలే, గెర్సన్‌, రెవిల్లినో, జార్జిన్హో ఉన్నారు. కోల్డోఅల్డో ఏకంగా నలుగురు ఇటలీ ఆటగాళ్లను బురిడీ కొట్టించి బంతిని చాకచక్యంగా బ్రెజిల్‌ ఆటగాడికి పాస్‌ చేశాడు. అక్కడి నుంచి బంతిని అందుకొన్న పీలే దానిని కెప్టెన్‌ అల్బెర్టో వద్దకు చేర్చాడు. అల్బెర్టో గోల్‌పోస్టులోకి పంపాడు. మైదానంలో ఇటలీ ఆటగాళ్లు ప్రేక్షకుల్లా మిగిలిపోయారు. గోల్‌కు దాదాపు 47 సెకన్ల ముందు ఇటలీ వైపు పొజిషన్‌తో మొదలై.. చివరికి వారి గోల్‌పోస్టులోనే బంతి పడటంతో ముగుస్తుంది. 2002లో ఇంగ్లాండ్‌ నిర్వహించిన సర్వేలో 100 అత్యుత్తమ క్రీడా స్మృతుల్లో దీనికి 36వ స్థానం కల్పించారు. 1970 ప్రపంచకప్‌ అనంతరం పుట్‌బాల్‌ లెజెండ్‌ పీలే రిటైర్మెంట్‌ ప్రకటించారు. 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని