WTC Final: మళ్లీ ట్రోఫీ గెలవలేమనుకున్నా..

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ విజేతగా అవతరించడంపై ఆ జట్టు మాజీ సారథి బ్రెండన్‌ మెక్‌కలమ్‌ సంతోషం వ్యక్తం చేశాడు. అయితే, రిజర్వ్‌డే రోజు మ్యాచ్‌ చూస్తున్నంతసేపు కివీస్‌ విజయానికి చేరువైనా గత ప్రపంచకప్ల మాదిరి ఆఖరి క్షణంలో టైటిల్‌ గెలవలేదేమోనని భయపడినట్లు చెప్పాడు...

Published : 25 Jun 2021 01:14 IST

న్యూజిలాండ్‌ మాజీ సారథి బ్రెండన్‌ మెక్‌కలమ్‌

ఆక్లాండ్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ విజేతగా అవతరించడంపై ఆ జట్టు మాజీ సారథి బ్రెండన్‌ మెక్‌కలమ్‌ సంతోషం వ్యక్తం చేశాడు. అయితే, రిజర్వ్‌ డే రోజు మ్యాచ్‌ చూస్తున్నంతసేపు కివీస్‌ విజయానికి చేరువైనా.. గత ప్రపంచ కప్‌ మాదిరి ఆఖరి క్షణంలో టైటిల్‌ గెలవలేదేమోనని భయపడినట్లు చెప్పాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌ 2015, 2019 వన్డే ప్రపంచకప్‌ టోర్నీల్లో ఫైనల్‌కు చేరినా విజేతగా నిలవలేకపోయిన సంగతి తెలిసిందే. దాంతో ఈసారి కూడా కివీస్‌ ఈ ఐసీసీ మెగా టోర్నీలో ఓడిపోతుందని భావించినట్లు వివరించాడు.

‘కేన్‌ విలియమ్సన్‌ నేతృత్వంలోని కివీస్‌ జట్టు గత కొన్నేళ్లుగా అత్యద్భుతంగా రాణిస్తోంది.  కానీ ఇలా సంప్రదాయ టెస్టు క్రికెట్‌లో ఛాంపియన్‌గా అవతరించడం ఇంకా అమోఘంగా అనిపిస్తోంది. చివరిరోజు ఆట ఇరుజట్లకూ సమానంగా మారడంతో గత ప్రపంచకప్‌ల మాదిరే ఆఖరి క్షణంలో ఓడిపోతామనే భావన కలిగింది. విజేతగా నిలవడానికి చేరువైనా, ఆ మెట్టును చేరుకోలేమని అనుకున్నా. మరోవైపు ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొని, టీమ్‌ఇండియా లాంటి మేటి జట్టుతో తలపడుతూ, అతిపెద్ద మెగా ఈవెంట్‌లో విజేతగా నిలవడం ఇంకా బాగుంది’ అని మెక్‌కలమ్‌ సంబరపడ్డాడు.

భవిష్యత్తులోనూ ఈ విజయాన్ని తలచుకొని తాము గర్వపడతామని, విలియమ్సన్‌ టీమ్‌ మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరాలని మాజీ సారథి ఆశాభావం వ్యక్తం చేశాడు. పరిమిత వనరులు కలిగిన న్యూజిలాండ్‌.. ప్రపంచ క్రికెట్‌లో గొప్ప జట్టుగా పేరున్న టీమ్‌ఇండియాను ఓడించడం అమితానందంగా ఉందన్నాడు. కాగా, ఈ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 170 పరుగులకు ఆలౌట్‌ అయిన సంగతి తెలిసిందే. అంతకుముందు కివీస్‌కు 32 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించడంతో ఆ జట్టు లక్ష్యం 139 పరుగులుగా నమోదైంది. ఈ క్రమంలోనే న్యూజిలాండ్‌ రెండు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. కెప్టెన్‌ విలియమ్సన్‌(52*), సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌టేలర్‌(47*) చివరి వరకు క్రీజులో నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని