IPL 2022: శుభ్‌మన్‌ గిల్‌ సేవలను కోల్పోవడం విచారకరం

రాబోయే ఐపీఎల్‌ మెగా ఈవెంట్‌లో శుభ్‌మన్‌గిల్‌ లాంటి ప్రతిభావంతుడి సేవలు కోల్పోవడం విచారకరమని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కోచ్‌ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ అన్నాడు...

Published : 31 Jan 2022 14:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రాబోయే ఐపీఎల్‌ మెగా ఈవెంట్‌లో శుభ్‌మన్‌గిల్‌ లాంటి ప్రతిభావంతుడి సేవలు కోల్పోవడం విచారకరమని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కోచ్‌ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ అన్నాడు. ఐపీఎల్‌ 2022లో పది జట్లతో మెగా టోర్నీ మరింత భారీగా జరగనున్న నేపథ్యంలో ఈసారి ఫ్రాంఛైజీలన్నీ తమ ఆటగాళ్లను (నలుగురు మినహా) వదులు కోవాల్సివచ్చింది. ఈ క్రమంలో కోల్‌కతా.. రసెల్‌, సునీల్‌ నరైన్‌, వెంకటేశ్ అయ్యర్‌, వరుణ్‌ చక్రవర్తిలను అట్టిపెట్టుకుని..  కొన్నాళ్లుగా తమకు ఓపెనింగ్‌ అందించిన శుభ్‌మన్‌గిల్‌ను వదిలేసింది. తాజాగా రాబోయే సీజన్‌లో తమ జట్టు ప్రణాళికలపై స్పందిస్తూ.. గిల్‌ సేవలను కోల్పోవడం బాధగా ఉందని మెక్‌కలమ్‌ పేర్కొన్నాడు.

‘రాబోయే సీజన్‌ కోసం చాలా మంది ఆటగాళ్లను కోల్పోవాల్సి రావడంతో అందుకు తగ్గ ఆటగాళ్లను తీసుకోవాలంటే సరైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. గిల్‌ మా జట్టు తరఫున మంచి ప్రదర్శన చేశాడు. అతడిని కోల్పోవడం నిరాశ కలిగించింది. కానీ, కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. అయితే, మరికొద్ది రోజుల్లో జరగబోయే మెగా వేలంలో మంచి జట్టును ఎంపిక చేసుకోవాల్సి ఉంది. అందుకు తగ్గట్టే ప్రణాళికలు రూపొందించి రెడీగా ఉంటాం. ఇకపోతే నరైన్‌, రసెల్‌ లాంటి ఆటగాళ్లు మా జట్టుకు దశాబ్దకాలంగా సేవలందిస్తున్నారు. అలాగే వరుణ్‌, వెంకటేశ్‌ ఇటీవల ఎలాంటి ప్రదర్శన చేశారో మనం చూశాం. అందుకే వారిని అట్టిపెట్టుకున్నాం’ అని బ్రెండన్‌ చెప్పుకొచ్చాడు. కాగా, రసెల్‌పై ప్రత్యేకంగా మాట్లాడిన కోల్‌కతా కోచ్‌.. ఈ విండీస్‌ ఆల్‌రౌండర్‌ అత్యుత్తమ ఫామ్‌లో ఉంటే.. అతడిలో ఒకేసారి ఇద్దరు ప్రపంచశ్రేణి ఆటగాళ్లను చూడొచ్చని కొనియాడాడు. అతడిని రీప్లేస్ చేసే ఆటగాడు దొరకడం కష్టమని అభిప్రాయపడ్డాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని