
T20 WORLD CUP: టీ20 ప్రపంచకప్ టాప్ స్కోరర్.. బౌలర్ ఎవరో చెప్పేసిన బ్రెట్ లీ
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్-12 పోటీలు ఎల్లుండి (అక్టోబర్ 23) నుంచి ప్రారంభమవుతాయి. ప్రస్తుతం క్వాలిఫయర్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పొట్టి ప్రపంచకప్‌ను ఎవరు గెలుచుకుంటారనే దానిపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రతి మాజీ క్రికెటర్ కూడా భారత జట్టే ఫేవరేట్ అని ఘంటాపథంగా చెబుతున్నారు. యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకునే అవకాశం భారత్‌కే ఎక్కువగా ఉందని ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్‌లీ విశ్లేషించాడు. ‘‘భారత జట్టులోని టాప్-4 బ్యాటర్లు మంచి ఫామ్‌లో ఉండటం సానుకూలాంశం. అలానే బౌలింగ్ దళం పటిష్ఠంగా ఉంది. టోర్నమెంట్లో కేఎల్ రాహుల్ కీలకమవుతాడు. అత్యధిక పరుగులు సాధించే బ్యాటర్ కూడా కేఎల్ రాహులే. అధిక వికెట్లను పడగొట్టే బౌలర్ మహమ్మద్ షమీ. గత కొన్ని నెలలుగా వారి ప్రదర్శనను బట్టి ఇలా అంచనా వేశా’’ అని బ్రెట్ లీ పేర్కొన్నాడు.
క్రికెట్ చరిత్రలో అత్యధికంగా ఐదు వన్డే ప్రపంచకప్‌లను దక్కించుకున్న ఆస్ట్రేలియా.. ఇప్పటి వరకు ఒక్క టీ20 వరల్డ్ కప్‌ను సొంతం చేసుకోకపోవడం లోటే. గతంలో (2010) ఫైనల్లో ఓటమిపాలైంది. అప్పటి నుంచి టైటిల్‌పై కన్నేసిన ఆసీస్ ఈసారి ఎలాగైనా సాధించాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఆసీస్ విజయావకాశాలపై బ్రెట్‌లీ స్పందిస్తూ.. చాలా కఠినమైన పరిస్థితులు ఉన్నాయని, వాటిని ఎదుర్కొని కప్‌ను గెలుచుకోవడం సులభమేమీ కాదన్నాడు. ‘‘ ఈ ఫార్మాట్లో ఆసీస్ పెద్దగా విజయవంతం కాలేదు. మార్చేందుకు ఇదే సరైన సమయం. అంత ఈజీ మాత్రం కాదు. మరీ ముఖ్యంగా భారత్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ వంటి కఠిన ప్రత్యర్థులు ఉన్నారు. అయితే ఆసీస్ జట్టులో ప్రతిభకు కొదవేంలేదు. అందులో డేవిడ్ వార్నర్‌దే కీలక పాత్ర. ఐపీఎల్ ఫామ్‌నుబట్టి కాకుండా వార్నర్ చాలా ప్రమాదకరమైన బ్యాటర్. ఒక్క మ్యాచ్‌తోనే ఫామ్‌లోకి వచ్చేస్తాడు. భారీ మ్యాచుల్లో రాణించడం డేవిడ్ అలవాటు’’ అని బ్రెట్ లీ చెప్పాడు. ఇంగ్లాండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో కూడిన గ్రూప్‌లో ఆసీస్ ఉంది. ఈ నెల 23న దక్షిణాఫ్రికాతో ఆసీస్ కప్ వేటను ప్రారంభించనుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.