Arshdeep Singh: బౌలర్‌కి ‘నో బాల్‌’ ప్రధాన శత్రువు.. అర్ష్‌దీప్‌కి ఆ వేళ కలిసిరాలేదు: బ్రెట్‌ లీ

శ్రీలంకతో టీ20 సిరీస్‌ సందర్భంగా (IND vs SL) యువ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ (Arshdeep Singh) ఒకే మ్యాచ్‌లో ఐదు నో బాల్స్‌ వేసి తీవ్ర విమర్శలకు గురైన సంగతి తెలిసిందే. అయితే గాయం నుంచి కోలుకుని వచ్చిన బౌలర్‌ ఇలా చేయడం సహజమేనని, తప్పకుండా అర్ష్‌దీప్‌ మెరుగవుతాడని బ్రెట్‌లీ వ్యాఖ్యానించాడు.

Updated : 21 Jan 2023 13:47 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్ఇండియా యువ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ ఒకే మ్యాచ్‌లో ఐదు నో బాల్స్‌ వేసి తీవ్ర విమర్శలపాలైన విషయం తెలిసిందే. అయితే.. గత ఆసియా కప్‌, టీ20 ప్రపంచకప్‌లో నాణ్యమైన పేస్‌తో భారత్‌ తరఫున కీలక బౌలర్‌గా మారాడు. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసినప్పటికీ.. తొలి మ్యాచ్‌ నాటికి అందుబాటులోకి రాలేదు. ఆ తర్వాత రెండో టీ20కి వచ్చాడు. కానీ కేవలం రెండు ఓవర్లలో 37 పరుగులు సమర్పించాడు. అర్ష్‌దీప్‌ సింగ్‌ను సరైన సన్నద్ధత లేకుండానే తుది జట్టులోకి తీసుకొన్నారని మేనేజ్‌మెంట్‌పైనా కామెంట్లు వచ్చాయి. అయితే కీలకమైన మూడో మ్యాచ్‌లో మాత్రం మళ్లీ పుంజుకొని కీలకమైన మూడు వికెట్లు తీసి భారత్‌ సిరీస్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో రెండో టీ20లో అర్ష్‌దీప్‌ బౌలింగ్‌పై తాజాగా బ్రెట్‌ లీ స్పందించాడు. తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు.

‘‘కొన్ని రోజుల కిందట శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమ్‌ఇండియా బౌలర్‌ అర్ష్‌దీప్‌ బౌలింగ్‌ చూశా. తన బౌలింగ్‌ లయను పూర్తిగా కోల్పోయాడు. ఒకదాని తర్వాత మరొకటి.. ఇలా ఐదు నో బాల్స్‌ వేశాడు. ఇది అతడికి మింగుడుపడని విషయం. కేవలం రెండు ఓవర్లలో 37 పరుగులు ఇచ్చాడు. గాయం నుంచి కోలుకొని తిరిగి జట్టులోకి వచ్చినట్లు తెలుస్తోంది. వరుసగా మూడు సార్లు క్రీజ్‌ను దాటి ముందుకు అడుగు వేశాడు. గాయం నుంచి కోలుకుని వచ్చిన తర్వాత రిథమ్‌ను కోల్పోవడం సహజం. పరిగెత్తే విధానం, పాదాల కదలికను కోల్పోతారు. ఇలాంటి సమయంలో వికెట్లను తీయాలనే కెప్టెన్‌ నమ్మకాన్ని నిలబెట్టడం కష్టంగా మారుతుంది’’

‘‘నో బాల్‌ అనేది బౌలర్‌కు ప్రధాన శత్రువు. భారీ మూల్యం చెల్లించుకుంటే మాత్రం మానసికంగా తీవ్ర అసహనానికి గురి కావాల్సి ఉంటుంది. అదనంగా బంతిని విసిరి.. బ్యాటర్‌ మరింత స్వేచ్ఛగా ఆడేందుకు  అనుమతి ఇచ్చినట్లు అవుతుంది. అయితే అర్ష్‌దీప్‌ తప్పకుండా బలంగా తిరిగి వస్తాడు. కానీ, ట్రైనింగ్‌ తీసుకొనేటప్పుడు.. పాత పొరపాట్లను వదిలేయాలి. అప్పుడేం చేశామనేది గుర్తెరిగి తప్పుల నుంచి గుణపాఠాలను నేర్చుకోవాలి. ఇదే నేనిచ్చే సలహా. మళ్లీ అర్ష్‌దీప్‌ అదరగొడతాడని ఆశిస్తున్నా’’ అని బ్రెట్‌ లీ వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని