Wrestling: ‘ప్లీజ్‌ మేడమ్.. దయచేసి వేదిక దిగండి’: వేడుకున్న రెజ్లర్లు

తాము చేపడుతోన్న నిరసన కార్యక్రమాన్ని రాజకీయం చేయొద్దంటూ వేడుకున్నారు రెజ్లర్లు(wrestlers). సభాస్థలి నుంచి రాజకీయ నేతలు వెళ్లిపోవాలని కోరారు. 

Published : 19 Jan 2023 19:12 IST

దిల్లీ: ‘ప్లీజ్‌ మేడమ్.. దయచేసి వేదిక దిగండి’ అని వామపక్ష నేత బృందా కారాట్‌(Brinda Karat)ను చేతులు జోడించి అడిగాడు బజరంగ్ పునియా.  భారత రెజ్లింగ్‌ సమాఖ్య (WFI) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ (Brij Bhushan)కు వ్యతిరేకంగా దేశ అగ్రశ్రేణి రెజ్లర్లు చేపట్టిన ఆందోళన రెండో రోజు కొనసాగుతోంది. దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat)‌, బజరంగ్‌ పునియా (Bajrang Punia), సాక్షి మలిక్ (Sakshi Malik)‌, సంగీత ఫొగాట్‌ సహా పలువురు క్రీడాకారులు ఈ నిరసనలో పాల్గొన్నారు.

ఈ క్రమంలో వారికి మద్దతు తెలిపేందుకు బృందా కారాట్‌ నిరసన స్థలానికి వచ్చారు. వేదికపైకి ఎక్కిన ఆమెతో భజరంగ్‌ పునియా మాట్లాడాడు. ‘ప్లీజ్‌ మేడమ్.. ఈ వేదిక నుంచి దిగి వెళ్లిపోండి. ఇది అథ్లెట్లు చేస్తోన్న పోరాటం. దీనిని రాజకీయం చేయకండి’ అని పునియా ఆమెను వేడుకున్నాడు.

బ్రిజ్‌ భూషణ్‌ నిరంకుశంగా వ్యవహరిస్తున్నాడని, రెజ్లర్లపై అసభ్య పదజాలాన్ని వాడాడంటూ బుధవారం కుస్తీ యోధులు రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. అంతేగాక, ఆయన చాలా ఏళ్లుగా మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నాడని వినేశ్ ఫొగాట్‌ ఆరోపించింది. లఖ్‌నవూ జాతీయ శిబిరంలో అనేక మంది కోచ్‌లు మహిళా రెజ్లర్లను లైంగిక దోపిడీ చేశారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.  దీంతో ఈ ఆరోపణలు పెను వివాదానికి దారితీశాయి.

కాగా దీనిపై బృందా కారాట్ మీడియాతో మాట్లాడారు. ‘మహిళలపై జరిగే లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. ఈ వ్యవహారంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసేందుకే ఇక్కడికి వచ్చాం’ అని ఆమె మీడియాతో అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని