Olympics: 2032 ఒలింపిక్స్‌ ఎక్కడో తెలుసా?

2032లో నిర్వహించబోయే ఒలింపిక్స్‌కు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) వేదికను ఖరారు చేసింది.......

Updated : 21 Jul 2021 16:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 2032లో నిర్వహించబోయే ఒలింపిక్స్‌కు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) వేదికను ఖరారు చేసింది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌ నగరంలో 35వ ప్రపంచ క్రీడా సంబరాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టు ప్రకటించింది. దీంతో 32 ఏళ్ల తర్వాత మళ్లీ ఆస్ట్రేలియా అంతర్జాతీయ ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తున్న దేశంగా నిలుస్తుంది. సిడ్నీలో 2000లో ఒలింపిక్స్‌ జరగ్గా.. అంతకముందు 1956లో మెల్‌బోర్న్‌ వేదికగానూ ఈ అంతర్జాతీయ క్రీడలు జరిగాయి. 2032 ఒలింపిక్స్‌ అనంతరం పారాలింపిక్స్‌ కూడా అక్కడే జరగనున్నాయి. బ్రిస్బేన్‌ నగరంలో ఒలింపిక్స్‌ నిర్వహణపై ఓటింగ్‌ నిర్వహించారు. మొత్తం 80 ఓటింగ్‌ కార్డులను పంపిణీ చేయగా.. 77 ఓట్లు చెల్లాయి. 72 ఓట్లు అనుకూలంగా రాగా.. వ్యతిరేకంగా 5 ఓట్లు మాత్రమే వచ్చినట్టు ఐఓసీ మీడియా ట్విటర్‌లో పేర్కొంది.

తమ దేశంలో క్రీడలను విజయవంతం చేసేందుకు ఏమేం అవసరమో తెలుసని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరీసన్‌ అన్నారు. ఇది బ్రిస్బేన్‌, క్వీన్స్‌లాండ్‌కే కాదు.. యావత్‌ దేశానికే చరిత్రాత్మకమైన రోజుగా అభివర్ణించారు.  ఈ మేరకు ఆయన ఐఓసీ ఓటింగ్‌ సెషన్‌లో తన కార్యాలయం నుంచి వర్చువల్‌గా మాట్లాడారు. నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ క్రీడా సంబరానికి 2024లో ప్యారిస్‌ ఆతిథ్యం ఇస్తుండగా..  2028లో లాస్‌ ఏంజెల్స్‌లో ఒలింపిక్స్‌ జరగనున్నట్టు ఐఓసీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ నెల 23 నుంచి ఆగస్టు 8వరకు జరిగే టోక్యో ఒలింపిక్స్‌ సందడి ఇప్పటికే మొదలైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని