Sourav Ganguly : నాట్‌వెస్ట్‌ ఫైనల్‌కు 20 ఏళ్లు.. సౌరభ్‌ గంగూలీకి అరుదైన సత్కారం

2002లో నాట్‌వెస్ట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. తుదిపోరులో ఇంగ్లాండ్‌ను రెండు వికెట్ల తేడాతో మట్టికరిపించి భారత్‌ కప్‌ను..

Updated : 14 Jul 2022 13:57 IST

ఇంటర్నెట్ డెస్క్‌: 2002లో నాట్‌వెస్ట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. తుదిపోరులో ఇంగ్లాండ్‌ను రెండు వికెట్ల తేడాతో మట్టికరిపించి భారత్‌కప్‌ను సొంతం చేసుకొంది. మ్యాచ్‌ విజయం అనంతరం గంగూలీ షర్ట్‌ విప్పి గాల్లోకి గిరాగిరా తిప్పిన ఫొటోలు, వీడియోలు అప్పట్లో సంచలనం రేపాయి. ఈ మ్యాచ్‌ జరిగి నిన్నటికి (జులై 13)  సరిగ్గా ఇరవై ఏళ్లైంది. ఈ క్రమంలో టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీకి అరుదైన ఘనత దక్కింది. గంగూలీని బ్రిటన్‌ పార్లమెంట్‌ ఘనంగా సత్కరించింది. ‘‘బ్రిటన్‌ పార్లమెంట్‌ నన్ను సత్కరించడం ఎంతో గర్వంగా ఉంది. ఆరు నెలల కిందటే వారు సంప్రదించారు. ప్రతి సంవత్సరం ఇలాంటి సత్కారం చేస్తున్నారు. అయితే, ఈ ఏడాది నేను అందుకోవడం సంతోషంగా ఉంది’’ అని గంగూలీ వివరించాడు.

(ఫొటో సోర్స్‌: బీసీసీఐ ట్విటర్‌)

నాట్‌వెస్ట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జ్ఞాపకాలను గంగూలీ మరోసారి గుర్తుకు తెచ్చుకొన్నాడు. ‘‘మ్యాచ్‌ జరిగి 20 ఏళ్లు అయిన విషయం నేనూ సోషల్‌మీడియలో చూశా. అప్పుడే ఇంత సమయం గడిచిపోయిందా..? అనిపించింది. ఇంగ్లాండ్‌ను వారి దేశంలోనే చిత్తు చేయడం మధుర జ్ఞాపకం. ప్రస్తుతం రోహిత్‌ శర్మ నేతృత్వంలోని భారత్‌ కూడా తొలి వన్డేలో ఘన విజయం సాధించింది. అంతకుముందు టీ20 సిరీస్‌ను కూడా కైవసం చేసుకొంది. ఇంగ్లాండ్‌ పిచ్‌లు బౌలింగ్‌కు అనుకూలిస్తాయి. దానిని బుమ్రా, షమీ సద్వినియోగం చేసుకొన్నారు. ఫస్ట్‌ స్పెల్‌తోనే ఇంగ్లాండ్‌ నుంచి మ్యాచ్‌ను లాగేశారు. 110 పరుగులకే కుప్పకూల్చి పదివికెట్ల తేడాతో విజయం సాధించారు. ఇప్పటి వరకైతే టీమ్‌ఇండియా ప్రదర్శన బాగుంది. రెండో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఆశిస్తున్నా’’ అని గంగూలీ తెలిపాడు.

అంతకుముందు ఐదో టెస్టులో (కరోనా కారణంగా గతేడాది వాయిదా పడింది) ఇంగ్లాండ్‌ సూపర్ ఛేజింగ్‌ చేసిందని గంగూలీ ప్రశంసించాడు. రెండో ఇన్నింగ్స్‌లో దాదాపు నాలుగు వందల పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అంత సులువేం కాదన్నాడు. ఇంగ్లాండ్‌ బ్యాటర్లు అద్భుతం చేశారని గంగూలీ పేర్కొన్నాడు. జులై 8న గంగూలీ 50వ జన్మదినం కూడా ఇంగ్లాండ్‌లోనే జరుపుకొన్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. గంగూలీ కుమార్తె బ్రిటన్‌లోనే చదువుతోంది. ‘సంవత్సరం నుంచి లండన్‌లో నా కుమార్తె ఉంటోంది. ఈసారి బర్త్‌డే ఇక్కడే జరుపుకోవడం బాగుంది. అలానే కుటుంబంతో గడపడం అద్భుతం’’ అని గంగూలీ చెప్పాడు. 

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts