Updated : 05 Jul 2022 09:52 IST

Bumrah : బుమ్రా ఖాతాలో మరో రికార్డు.. SENAపై అదరగొట్టేసిన టీమ్ఇండియా పేసర్‌

ఇంటర్నెట్ డెస్క్: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతోన్న ఐదో టెస్టు (గతంలో వాయిదా పడిన) రసవత్తరంగా మారింది. 378 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ నాలుగో రోజు ఆట ముగిసేసమయానికి 259/3 స్కోరు సాధించింది. ఆఖరి రోజు కేవలం 119 పరుగులు చేస్తే ఇంగ్లాండ్‌ విజయం సాధించి సిరీస్‌ను సమం చేస్తుంది. ఇప్పుడు టీమ్‌ఇండియా 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఐదో రోజు ఆట ఆరంభంలోనే వికెట్లను తీసి ఇంగ్లాండ్‌పై ఒత్తిడి పెంచితే గెలిచే అవకాశాలు భారత్‌ వైపు ఉంటాయి. అప్పుడు సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకోవచ్చు. అయితే ఇలా సాధ్యమవ్వాలంటే మాత్రం బుమ్రా నేతృత్వంలోని బౌలింగ్ దళం అద్భుతం చేయాల్సిందే. మరీ ముఖ్యంగా బుమ్రా మరోసారి చెలరేగాలి. 

బుమ్రా ఇప్పటికే పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే సిరీస్‌లో అత్యధిక వికెట్లు (21) తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. అంతకుముందు భువనేశ్వర్‌ కుమార్‌ 2014లో ఐదు టెస్టుల్లో 19 వికెట్లు తీశాడు. ఇప్పుడు భువీని బుమ్రా అధిగమించాడు. ఇదే క్రమంలో బుమ్రా మరో ఘనత సాధించాడు. SENA (సౌతాఫ్రికా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) జట్లపై అక్కడి మైదానాల్లో వంద వికెట్లకుపైగా సాధించిన ఆరో భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. బుమ్రా (101) కంటే ముందు అనిల్ కుంబ్లే (141), ఇషాంత్ శర్మ (130), జహీర్‌ ఖాన్‌ (119), మహమ్మద్ షమీ (119), కపిల్‌ దేవ్ (119) ఉన్నారు. 

SENA జట్లలో ఇంగ్లాండ్‌పైనే బుమ్రా అత్యధికంగా 37 వికెట్లు పడగొట్టాడు. ఎకానమీ కేవలం 2.67 మాత్రమే కావడం విశేషం. అత్యుత్తమ బౌలింగ్‌ 5/64. అదే విధంగా ఆసీస్‌పై 32 వికెట్లు (అత్యుత్తమ బౌలింగ్‌ 6/33), దక్షిణాఫ్రికా జట్టుపై 26 వికెట్లు (అత్యుత్తమం 7/111),  న్యూజిలాండ్‌ మీద రెండు టెస్టుల్లో ఆరు వికెట్లు (అత్యుత్తమం 3/62) తీశాడు. అదేవిధంగా వందకుపైగా వికెట్లు తీసిన ఐదో టీమ్‌ఇండియా పేసర్‌ కూడా బుమ్రానే. 

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని