Jasprith Bumrah:అవకాశమిస్తే... సారథ్యానికి సిద్ధం: బుమ్రా

అవకాశమిస్తే జట్టు  సారథ్యానికి వెనుకాడనని టీమ్‌ఇండియా వైస్‌ కెప్టెన్‌ బుమ్రా ప్రకటించాడు. ‘‘అవకాశం లభిస్తే.. అదెంతో గౌరవం. సారథ్యానికి వెనుకాడే ఆటగాడు ఉండడు. నేనేమీ    భిన్నం కాదు. ఎవరి నాయకత్వమైనా నా శక్తిసామర్థ్యాల మేరకు జట్టుకు సహకారం అందిస్తా.

Updated : 18 Jan 2022 12:44 IST

పార్ల్‌ (దక్షిణాఫ్రికా): అవకాశమిస్తే జట్టు  సారథ్యానికి వెనుకాడనని టీమ్‌ఇండియా వైస్‌ కెప్టెన్‌ బుమ్రా ప్రకటించాడు. ‘‘అవకాశం లభిస్తే.. అదెంతో గౌరవం. సారథ్యానికి వెనుకాడే ఆటగాడు ఉండడు. నేనేమీ  భిన్నం కాదు. ఎవరి నాయకత్వమైనా నా శక్తిసామర్థ్యాల మేరకు జట్టుకు సహకారం అందిస్తా. పదవి ఉందా లేదా అన్న పట్టింపు నాకుండదు. జట్టుకు ఎలా సహకారం అందించాలన్న దానిపైనే దృష్టిసారిస్తా. పదవి ఉన్నంత మాత్రాన మార్పేమీ ఉండదు. ముందు నా పని నేను చేయాలి కదా? నేను వీలైనంత సహకారం అందించేందుకు ప్రయత్నిస్తా. అనంతరం దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో రాహుల్‌కు ఏమైనా అవసరమైతే సహాయం అందిస్తా. వైస్‌ కెప్టెన్‌గా లేనప్పుడు కూడా యువ ఆటగాళ్లతో మాట్లాడేవాడిని. మైదానంలో ఎలాంటి ఫీల్డింగ్‌ మోహరింపులు ఉండాలో చర్చించేవాడిని. మళ్లీ అదే పాత్ర పోషించడానికి ప్రయత్నిస్తా. టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్‌ కోహ్లి మాకు ముందుగానే చెప్పాడు. సారథిగా అతని భాగస్వామ్యాన్ని మేమంతా అభినందించాం. ఒక జట్టుగా మేమంతా చాలా సన్నిహితంగా ఉంటాం. అతను టెస్టు సారథ్యం నుంచి తప్పుకుంటున్న విషయం మాకు ముందే తెలుసు. అతని నిర్ణయాన్ని మేం గౌరవిస్తాం. అతని నాయకత్వానికి విలువిస్తాం. విరాట్‌ నిర్ణయంపై నేను తీర్పు చెప్పలేను. అది అతని వ్యక్తిగత నిర్ణయం. దేహం ఎలా స్పందిస్తుందో.. ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నాడో అతనికే తెలుసు. కోహ్లి సారథ్యంలో టెస్టు క్రికెట్‌ ఆడటం చాలా ఆనందంగా ఉంది. అతని నాయకత్వంలోనే టెస్టుల్లో అరంగేట్రం చేశా. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా కోహ్లి   ఎప్పటికీ నాయకుడిగానే ఉంటాడు. అతని  భాగస్వామ్యం అపారమైనది. జట్టులో ఫిట్‌నెస్‌ సంస్కృతి తీసుకొచ్చాడు. ప్రతి ఒక్కరు ఫిట్‌గా మారారు. సుదీర్ఘ కాలం కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లి సహకారం, సూచనలు జట్టుకు  ఎప్పటికీ ముఖ్యమే’’ అని బుమ్రా తెలిపాడు. బుధవారం భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని