T20 World Cup: అరుదైన రికార్డుకు చేరువగా బుమ్రా.. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో తీరేనా?

టీమ్‌ఇండియా ఫాస్ట్‌బౌలర్ జస్ప్రీత్‌ బుమ్రా అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. ఇంకో మూడు వికెట్లు పడగొడితే టీ20 మ్యాచుల్లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన...

Updated : 03 Nov 2021 13:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా ఫాస్ట్‌బౌలర్ జస్ప్రీత్‌ బుమ్రా అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. ఇంకో మూడు వికెట్లు పడగొడితే టీ20 మ్యాచుల్లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ అవుతాడు. ఇవాళ అఫ్గానిస్థాన్‌తో పోరులో బుమ్రా రాణించి రికార్డు సృష్టించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం బుమ్రా 52 టీ20 మ్యాచుల్లో 61 వికెట్లు పడగొట్టాడు. భారత బౌలర్లలో అత్యధిక వికెట్లు తీసిన వారిలో బుమ్రా కంటే ముందు చాహల్ ఉన్నాడు. చాహల్ కేవలం 49 టీ20ల్లో 63 వికెట్లను తీశాడు. వీరిద్దరి తర్వాత రవిచంద్రన్ అశ్విన్‌ 46 మ్యాచుల్లో 52 వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్‌ (50), హార్దిక్‌ పాండ్య (42) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.  పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్‌ తీయని బుమ్రా.. కివీస్‌ మీద రెండు వికెట్లు తీశాడు. ఈ క్రమంలో అఫ్గాన్‌ మీద నిప్పులు చెరిగే బంతులను విసిరి ఈ రికార్డును ఖాతాలో వేసుకుంటాడో లేదో వేచి చూడాలి. ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో 34వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. 2016లో తొలి ఇంటర్నేషనల్‌ టీ20 మ్యాచ్‌ ఆడిన బుమ్రా అత్యుత్తమ గణాంకాలను (3/11) జింబాబ్వే మీద 2016లో నమోదు చేశాడు. యార్కర్లను సంధించడంలో తిరుగులేని బుమ్రా.. డెత్‌ ఓవర్లలో ప్రమాదకరంగా బౌలింగ్‌ చేస్తాడు.

అంతర్జాతీయంగా చూస్తే అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ షకిబ్ అల్‌ హసన్‌ టాప్‌లో ఉన్నాడు. 94 మ్యాచుల్లో 117 వికెట్లను పడగొట్టాడు. తర్వాత లసిత్‌ మలింగ (84 మ్యాచుల్లో 107), రషీద్‌ ఖాన్‌ (102) ఉన్నారు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ పరంగా..  తాబ్రైజ్‌ షంసి (దక్షిణాఫ్రికా), వహిందు హసరంగ డిసిల్వా (శ్రీలంక), రషీద్‌ఖాన్‌ (అఫ్గాన్‌), అదిల్ రషీద్‌ (ఇంగ్లాండ్‌), ముజీబ్ (అఫ్గాన్‌) టాప్‌-5లో నిలిచారు. వీరందరూ స్పిన్నర్లే కావడం విశేషం. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో టీమ్‌ఇండియా బౌలర్‌ ఒక్కరూ లేకపోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని