PV Sindu: సింధు సాధించేనా!

టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత, భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌ టైటిల్‌పై గురిపెట్టింది. వరుసగా మూడు టోర్నీల్లో సెమీస్‌ చేరుకున్న ప్రపంచ ఛాంపియన్‌ సింధు.. ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌లో విజేతగా నిలిచి

Updated : 01 Dec 2021 08:53 IST

బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌ నేటినుంచే

బాలి: టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత, భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌ టైటిల్‌పై గురిపెట్టింది. వరుసగా మూడు టోర్నీల్లో సెమీస్‌ చేరుకున్న ప్రపంచ ఛాంపియన్‌ సింధు.. ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌లో విజేతగా నిలిచి ఈ ఏడాదిని ఘనంగా ముగించాలని భావిస్తోంది. బుధవారం ప్రారంభంకానున్న ఈ టోర్నీలో సింధు ఫేవరెట్‌లలో ఒకరుగా బరిలో దిగుతుంది. పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌, యువ ఆటగాడు లక్ష్యసేన్‌ తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజు- చిరాగ్‌ శెట్టి, మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి- అశ్విని పొన్నప్ప పోటీలో ఉన్నారు. ప్రతిష్టాత్మక టోర్నీలో భారత్‌ తరఫున ఏడుగురు క్రీడాకారులు బరిలో ఉండటం ఇదే ప్రథమం.

2018లో విజేతగా నిలవడం ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌లో సింధు అత్యుత్తమ ప్రదర్శన. 2016లో సెమీస్‌, 2017లో ఫైనల్‌ చేరుకున్న సింధు.. 20019, 2020లలో గ్రూపు దశ దాటలేదు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉండటం.. ఫ్రెంచ్‌ ఓపెన్‌, ఇండోనేసియా మాస్టర్స్‌, ఇండోనేసియా ఓపెన్‌లలో సెమీస్‌ చేరుకుని నిలకడగా రాణించడంతో సింధుపై అంచనాలు పెరిగాయి. గ్రూపు-ఎలో సింధుతో పాటు పోర్న్‌పావీ చోచువాంగ్‌ (థాయ్‌లాండ్‌), లైన్‌ క్రిస్టోఫెర్సెన్‌ (డెన్మార్క్‌), యోనె లీ (జర్మనీ) ఉన్నారు. బుధవారం తొలి పోరులో క్రిస్టోఫెర్సెన్‌తో సింధు తలపడనుంది.  గ్రూపు-బిలో అకానె యమగూచి (జపాన్‌), బుసానన్‌ (థాయ్‌లాండ్‌), ఆన్‌ సియాంగ్‌ (కొరియా), జియా మిన్‌ (సింగపూర్‌) బరిలో ఉన్నారు. పురుషుల సింగిల్స్‌ గ్రూపు-ఎలో లక్ష్యసేన్‌, విక్టర్‌ అక్సల్సెన్‌ (డెన్మార్క్‌), కెంటొ మొమట (జపాన్‌),    రస్‌ముస్‌ గెమ్కీ (డెన్మార్క్‌).. గ్రూపు-బిలో శ్రీకాంత్‌, లీ జియా (మలేసియా), టోమా జూనియర్‌ పొపోవ్‌ (ఫ్రాన్స్‌), కున్లవుత్‌   వితిద్సర్న్‌ (థాయ్‌లాండ్‌) పోటీలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని