Ball Tampering: వివాదానికి ముగింపు పలకండి.. 

2018లో దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌ సందర్భంగా ఆస్ట్రేలియా ఆటగాడు కామెరూన్‌ బాన్‌క్రాఫ్ట్‌ ‘బాల్‌ టాంపరింగ్‌’కు పాల్పడిన వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇటీవల ఓ అంతర్జాతీయ పత్రికతో మాట్లాడిన అతడు...

Published : 18 May 2021 18:23 IST

బాన్‌క్రాఫ్ట్‌ యూటర్న్‌ నేపథ్యంలో ఆస్ట్రేలియా బౌలర్ల విజ్ఞప్తి..

ఇంటర్నెట్‌డెస్క్‌: 2018లో దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌ సందర్భంగా ఆస్ట్రేలియా ఆటగాడు కామెరూన్‌ బాన్‌క్రాఫ్ట్‌ ‘బాల్‌ టాంపరింగ్‌’కు పాల్పడిన వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇటీవల ఓ అంతర్జాతీయ పత్రికతో మాట్లాడిన అతడు.. ఆ మ్యాచ్‌లో తమ బౌలర్లకు కూడా ఆ సంగతి తెలుసని చెప్పాడు. దాంతో టాంపరింగ్‌ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే క్రికెట్‌ ఆస్ట్రేలియా నాటి వివాదంపై మరోసారి విచారణకు ఆదేశించింది. అలాగే అప్పటి ఆటగాళ్లకు దాని గురించి ఏదైనా కొత్త సమాచారం తెలిస్తే తమకు తెలియజేయాలని కోరింది. అయితే, బాన్‌క్రాస్ట్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు యూటర్న్‌ తీసుకోవడం విశేషం. ఆ వివాదానికి సంబంధించి కొత్త సమాచారం ఏమీ లేదని విచారణ బృందానికి చెప్పాడని సిడ్నీ హెరాల్డ్‌ ఓ కథనంలో పేర్కొంది.

మరోవైపు నాటి మ్యాచ్‌లో బౌలర్లుగా ఉన్న మిచెల్‌ స్టార్క్‌, పాట్‌ కమిన్స్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, నాథన్‌ లైయన్‌, మిచెల్‌ మార్ష్‌తో.. బాన్‌క్రాఫ్ట్‌ మాట్లాడినట్లు ఆ కథనంలో తెలిపింది. తన వ్యాఖ్యలపై వారికి వివరణ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ ఇంటర్వ్యూలో ప్రశ్నలడిగినప్పుడు తాను గందరగోళానికి గురయ్యానని, దాంతో కంగారులో అలా అన్నానని వారితో చెప్పినట్లు తెలిపింది. కాగా, ఈ వివాదానికి ముగింపు పలకాలని స్టార్క్‌, కమిన్స్‌, హాజిల్‌వుడ్‌, లైయన్‌ తాజాగా ఓ సంయుక్త ప్రకటనలో కోరారు. బాల్‌ టాంపరింగ్‌కు సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదన్నారు. ‘2018 నాటి టెస్టు మ్యాచ్‌కు సంబంధించి ఇటీవల కొందరు మీడియా వాళ్లు, మాజీ ఆటగాళ్లు మా విశ్వసనీయతను శంకించడం బాధ కలిగించింది. ఆరోజు బంతి స్వరూపాన్ని మార్చడానికి మైదానంలోపలికి ఒక వస్తువు తీసుకొచ్చారనే విషయం.. పెద్ద తెరమీద చూసేవరకు మాకూ తెలియదు. అయితే, ఆ విషయంలో ఏ కారణాలు చెప్పినా తప్పే. అలా చేయాల్సింది కాదు. ఆ సంఘటన నుంచి మేమెన్నో పాఠాలు నేర్చుకున్నాం. ఇకనైనా ఆ వివాదానికి ముగింపు పలకాలని మనసారా కోరుతున్నాం. అది జరిగి చాలా కాలమైంది. దాని గురించి మర్చిపోయి ముందుకు సాగాల్సిన సమయం ఇది’ అని లేఖలో పేర్కొన్నారు.

కాగా, అంతకుముందు ఈ విషయంపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు ఆడం గిల్‌క్రిస్ట్‌, మైఖేల్‌ క్లార్క్‌, డేవిడ్‌ వార్నర్‌ మేనేజర్ జేమ్స్‌ కూడా స్పందించారు. క్లార్క్‌ ఓ మీడియాతో మాట్లాడుతూ బాల్‌ టాంపరింగ్‌ విషయంలో స్మిత్‌, వార్నర్‌, బాన్‌క్రాఫ్ట్‌ మాత్రమే కాకుండా ఇంకా ఎవరికైనా దాని గురించి ముందే తెలిసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నాడు. గిల్‌క్రిస్ట్‌ స్పందిస్తూ బాల్‌ టాంపరింగ్‌ వివాదం ఎప్పటికీ తెరమీదే ఉంటుందన్నాడు. టాంపరింగ్‌ విషయంలో అసలైన నిజాలు తెలియాలంటే లోతైన విచారణ జరగాలని కోరాడు. అయితే, బాన్‌క్రాఫ్ట్‌ లాగే ఇంకొంత మందికీ దాని గురించి ముందే తెలుసని, దాంట్లో భాగమైన వారి పేర్లు ఏదో ఒక సందర్భంలో బయటకు వస్తాయని చెప్పాడు. ఇక డేవిడ్‌ వార్నర్‌ మేనేజర్‌ మాట్లాడుతూ గతంలో విచారణ సందర్భంగా ఆటగాళ్లందర్నీ విచారించలేదన్నాడు. అప్పుడేం జరిగిందనే విషయం తనకు తెలుసని చెప్పాడు. అయితే, దాన్ని ఇప్పుడు బయటపెట్టినా ప్రయోజం లేదన్నాడు. ఎందుకంటే ప్రజలు కొంతకాలం తర్వాత ఆస్ట్రేలియా జట్టును ఇష్టపడటం లేదని అన్నాడు. అప్పుడు వార్నర్‌, స్మిత్‌, బాన్‌క్రాఫ్ట్‌ పట్ల సరిగ్గా వ్యవహరించలేదన్నాడు. వాళ్లు చేసింది తప్పే అయినా, ఆ శిక్ష సరైందికాదన్నాడు. వాళ్లు న్యాయపరంగా వెళ్లి ఉంటే కేసు గెలిచేవారని మరో సందేహాస్పద వ్యాఖ్యలు చేశాడు. కాగా, అప్పట్లో ఈ ముగ్గుర్నీ ఏడాది పాటు ఆటకు దూరం చేసిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని