
T20 World Cup: వావ్!.. 4 బంతుల్లో 4 వికెట్లు!
టీ20 ప్రపంచకప్‌లో రికార్డు సృష్టించిన ఐర్లాండ్ బౌలర్ కుర్టిస్ కాంఫర్
ఇంటర్నెట్ డెస్క్: అబుదాబి వేదికగా సాగుతున్న టీ20 ప్రపంచకప్‌లో అద్భుతం చోటు చేసుకుంది. ఐర్లాండ్, నెదర్లాండ్స్ దేశాల మధ్య జరిగిన మ్యాచులో ఐర్లాండ్ బౌలర్ కుర్టిస్ కాంఫర్ 4 బంతుల్లో 4 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా కాంఫర్ నిలిచాడు. తొలుత టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్.. కుర్టిస్ కాంఫర్ ధాటికి 106 పరుగులకే ఆలౌటైంది. కాంఫర్ వేసిన పదో ఓవర్లో వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీసి నెదర్లాండ్స్‌ని కోలుకోలేని దెబ్బ కొట్టాడు. 9.2వ బంతికి క్రీజులో ఉన్న నెదర్లాండ్ బ్యాటర్ అకర్మన్.. వికెట్ కీపర్ నీల్రాక్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన డశ్చేట్.. 9.3వ బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 9.4వ బంతికి స్కాట్ ఎడ్వర్డ్స్ కూడా ఎల్బీగా వెనుదిరిగాడు.
అయితే, ఫీల్డ్-అంపైర్ ఔట్ ఇవ్వలేదు. దాంతో ఐర్లాండ్ జట్టు రివ్యూకి వెళ్లింది. రివ్యూలో బంతి ప్యాడ్‌కు తగిలినట్లు తేలడంతో థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు. దీంతో కుర్టిస్ మూడు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టి టీ20 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. అతని కంటే ముందు ఆస్ట్రేలియా బౌలర్ బ్రెట్‌లీ టీ20 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన విషయం తెలిసిందే. ఇక అదే ఓవర్ ఐదో బంతికి వాన్ డర్ మెర్వెని బౌల్డ్ చేశాడు. దీంతో టీ20ల్లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. కుర్టిస్ కంటే ముందు టీ20ల్లో అఫ్గాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్, శ్రీలంక పేసర్ లసిత్ మలింగ ఈ ఘనత సాధించారు. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ 7 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌పై గెలుపొందింది. 107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 15.1 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.