PCB: ‘భారత్‌లో పాక్‌ పర్యటనపై ప్రభావం చూపవచ్చు’.. జైషా వ్యాఖ్యలపై పీసీబీ ప్రకటన

ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు జైషా వ్యాఖ్యలపై పీసీబీ ఘాటుగా స్పందించింది. ఆసియా కప్‌ వేదిక మార్పు అంశం ఏకపక్ష నిర్ణయం అంటూ అసహనం వ్యక్తం చేసింది. దీనిపై అత్యవసర బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని ఏసీసీని కోరింది.

Published : 19 Oct 2022 23:41 IST

దిల్లీ: ఆసియాకప్‌ 2023ని పాకిస్థాన్‌లో ఆడబోమని ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ చీఫ్‌ జైషా చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. మంగళవారం జైషా చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) తాజాగా ఘాటుగానే స్పందించింది. షా మాటలు ఆశ్చర్యానికి గురిచేయని, ఆ ప్రకటన ఏకపక్షంగా ఉందని పేర్కొంది. ప్రపంచకప్‌ కోసం భారత్‌లో పాకిస్థాన్‌ పర్యటనపై ఇది ప్రభావం చూపవచ్చని వెల్లడించింది.

‘వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరిగే ఆసియా కప్‌ను తటస్థ వేదికపై నిర్వహిస్తామని ఏసీసీ అధ్యక్షుడు జైషా నిన్న చేసిన వ్యాఖ్యలపై పీసీబీ ఆశ్చర్యంతోపాటు నిరాశకు గురైంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ బోర్డ్ లేదా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (ఈవెంట్ హోస్ట్)తో ఎలాంటి చర్చ, సంప్రదింపులు లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీర్ఘకాలిక పరిణామాలు, ప్రభావాల గురించి ఆలోచించకుండానే మాట్లాడారు. పాకిస్థాన్‌లో ఆసియా కప్‌ నిర్వహణకు ఏసీసీ బోర్డు సభ్యులు భారీగా మద్దతు ప్రకటించి నిర్ణయం తీసుకున్న తర్వాత.. వేదికను మారుస్తున్నట్లు షా చేసిన ప్రకటన ఏకపక్షమని తేటతెల్లమవుతోంది’ అంటూ పీసీబీ ఓ ప్రకటన విడుదల చేసింది.

‘ఇలాంటి ప్రకటనలు ఆసియా, అంతర్జాతీయ క్రికెట్ కమ్యూనిటీలను విభజించే అవకాశం ఉంటుందని పీసీబీ పేర్కొంది. ‘2023లో ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ కోసం భారత్‌లో పాకిస్థాన్ పర్యటనపై ఇది ప్రభావం చూపవచ్చు. ఇదేకాక 2024-2031 కాలంలో భారత్‌లో జరిగే ఐసీసీ టోర్నీల్లోనూ దీని ప్రభావం ఉండవచ్చు’ అని తెలిపింది. షా ప్రకటనపై పీసీబీకి ఇప్పటి వరకు ఏసీసీ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదని పేర్కొంది. అందువల్ల, ఈ ముఖ్యమైన విషయాన్ని చర్చించేందుకు వీలైనంత త్వరగా బోర్డు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్‌ను పీసీబీ అభ్యర్థించింది.

వచ్చే ఏడాది ఆసియాకప్‌ పాకిస్థాన్‌లో కాకుండా తటస్థ వేదికపై ఆడవచ్చని జైషా పేర్కొన్నారు. మంగళవారం ముంబయిలో జరిగిన బీసీసీఐ 91వ వార్షిక సమావేశం అనంతరం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘ఆసియా కప్‌ తటస్థ వేదికపై జరుగుతుంది. నేను ఏసీసీ అధ్యక్షుడిగా ఈ మాట చెబుతున్నా. మేము అక్కడికి వెళ్లం. వారు ఇక్కడికి రారు. గతంలో కూడా ఆసియాకప్‌లు తటస్థ వేదికలపై నిర్వహించాం’’ అని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌లో చర్చించాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని