Rohit Sharma: టీ20ల్లో గెలవాలంటే ఫిఫ్టీలు.. హండ్రెడ్‌లు అక్కర్లేదు: రోహిత్ శర్మ

బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమ్‌ఇండియా సెమీస్‌కు చేరువైంది. మెరుగైన రన్‌రేట్‌తో సూపర్‌-8 గ్రూప్‌1లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Updated : 23 Jun 2024 08:57 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌ సెమీస్‌ దిశగా సాగుతోంది. సూపర్‌-8లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గెలిచింది. బంగ్లాదేశ్‌ను 50 పరుగుల తేడాతో చిత్తు చేసి గ్రూప్‌-1లో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో సంపూర్ణ ఆధిక్యంతో బంగ్లాను చిత్తు చేసింది. ఈ విక్టరీపై కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘‘బ్యాటింగ్‌ చేసేటప్పుడు దూకుడు ప్రదర్శించడంపై ఇప్పటికే చాలాసార్లు చెప్పా. ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచేందుకు ఇలా ఆడాల్సి ఉంటుంది. జట్టులోని ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఆడారు. పరిస్థితులకు త్వరగా అలవాటు పడి ప్రదర్శన చేశారు. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో గాలి ప్రభావం ఎక్కువగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో స్మార్ట్‌గా ఆలోచించాం. ఎనిమిది మంది బ్యాటర్లతో బరిలోకి దిగడం కూడా కలిసొచ్చింది. అందరూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారు. ఒకరు హాఫ్ సెంచరీ సాధించడంతో బంగ్లా ముందు 197 పరుగుల లక్ష్యం నిర్దేశించగలిగాం. టీ20ల్లో ఎక్కువగా ఫిఫ్టీలు, సెంచరీలు అవసరం లేదనుకుంటా. ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి తీసుకొస్తే ఆటోమేటిక్‌గా పరుగులు వస్తాయి. జట్టులో ఎక్కువ అనుభవం కలిగిన ప్లేయర్లు ఉన్నారు. పాండ్య బ్యాటింగ్‌లో మెరిస్తే మాదే పైచేయి అవుతుందని గత మ్యాచ్‌ సమయంలోనే అన్నా. మిడిలార్డర్‌, లోయర్‌ ఆర్డర్‌తో కలిసి పరుగులు చేసే బాధ్యత తీసుకున్నాడు. బౌలర్‌గానూ మాకు అత్యంత కీలకమైన ప్లేయర్. కుల్‌దీప్‌, బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు’’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు. 

భారత్‌ను తక్కువకే కట్టడి చేయాల్సింది: షాంటో

‘‘భారత బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. మేం వారిని 170లోపే కట్టడి చేయాలని అనుకున్నాం. కానీ, మాకు అవకాశం దక్కలేదు. వాతావరణం, గాలి ప్రభావం పెద్ద సమస్య కాదు. లక్ష్య ఛేదన సమయంలోనూ మేం సరైన ప్రదర్శన చేయలేదు. దూకుడుగా ఆడలేకపోయాం. 190+ స్కోరును ఛేదించాలంటే కీలక భాగస్వామ్యాలు అవసరం. తొలి ఆరు ఓవర్లలో ఇంకాస్త దూకుడు ప్రదర్శించాల్సింది. తంనిమ్‌ మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. మ్యాచ్‌ను గెలిపించేందుకు నేను చేసిన పరుగులు ఉపయోగపడితే సంతోషించేవాడిని. చివర్లో రిషద్ కూడా బ్యాట్‌ను ఝళిపించాడు. బౌలింగ్‌లోనూ మంచి ప్రదర్శన చేశాడు. బంగ్లాకు మంచి లెగ్‌ స్పిన్నర్‌ దొరికాడు’’ అని బంగ్లాదేశ్‌ కెప్టెన్ షాంటో అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని