Ruturaj Gaikwad: నా బ్యాటింగ్‌కు.. ఐపీఎల్‌ కెప్టెన్సీ చాలా సాయపడింది: రుతురాజ్‌ గైక్వాడ్

బాధ్యతాయుతంగా ఎలా ఆడాలనేది కెప్టెన్‌గా మారిన తర్వాత పూర్తి అవగాహన వచ్చిందని యువ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. జింబాబ్వే పర్యటనలో ఉన్న అతడు రెండో టీ20 కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

Published : 10 Jul 2024 15:04 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ 2024 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ కెప్టెన్‌గా రుతురాజ్‌ గైక్వాడ్ (Ruturaj Gaikwad) బాధ్యతలు చేపట్టాడు. ఎంఎస్ ధోనీ స్వచ్ఛందంగా వైదొలిగి రుతురాజ్‌కు కెప్టెన్సీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ను విజేతగా నిలిపిన అనుభవం కూడా గైక్వాడ్ సొంతం. ఇప్పుడు జింబాబ్వేతో (ZIM vs IND) టీ20 సిరీస్‌లో ఆడుతున్న అతడు.. ఐపీఎల్‌లో (IPL 2024) సారథ్యం వహించడం వల్లే మరింత బాధ్యతగా ఆడేందుకు కారణమైందని వ్యాఖ్యానించాడు. 

‘‘అప్పుడైనా.. ఇప్పుడైనా నా బ్యాటింగ్‌లో ఏ మార్పు లేదు. కానీ, బాధ్యతాయుతంగా ఆడటం మాత్రం మెరుగైంది. ప్రతిసారీ మ్యాచ్‌లో ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికే ప్రయత్నిస్తా. ఐపీఎల్‌ ఫ్రాంచైజీలో సీఎస్కే కెప్టెన్‌ అయినప్పటినుంచి మ్యాచ్‌ను చూసే విధానం కూడా మారిపోయింది. కేవలం బౌండరీలను కొట్టడంపైనే కాకుండా.. సుదీర్ఘంగా క్రీజ్‌లో పాతుకుపోయి ప్రత్యర్థిపై ఆధిపత్యం సాధించాలనే లక్ష్యంతో ఆడుతున్నా. ఒక్కో బంతిపై ఫోకస్‌ చేస్తూ వెళ్తున్నా. అంతకుమించి నా ఆటతీరులో మరే వ్యత్యాసం లేదు. వన్‌డౌన్‌లో రావడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇక్కడ ఆడటం సవాలే. జట్టు అవసరాల మేరకు ఎక్కడ ఆడమన్నా బరిలోకి దిగేందుకు సిద్ధమే. ఓపెనర్‌, వన్‌డౌన్‌కు పెద్దగా తేడా ఉండదు. కొత్త బంతితోనే ఆడాల్సి ఉంటుంది’’ అని రుతురాజ్‌ వ్యాఖ్యానించాడు. 

రచిన్‌ రవీంద్రకు సెంట్రల్ కాంట్రాక్ట్

సీఎస్కే తరఫున ఐపీఎల్‌లో ఆడిన రచిన్‌ రవీంద్ర (Rachin Ravindra)కు న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు బంపర్ ఆఫర్ ఇచ్చింది. సెంట్రల్ కాంట్రాక్ట్‌లోకి పేరును జత చేసింది. ఈ జాబితాలో అజాజ్‌ పటేల్‌కూ స్థానం దక్కింది. కొత్త ప్లేయర్లు బెన్‌ సీర్స్, వి ఓ రూర్కె, జాకబ్ డఫీ కూడా కాంట్రాక్ట్‌ను పొందినవారిలో ఉన్నారు. భారత వారసత్వం కలిగిన రచిన్‌ రవీంద్ర గతేడాది వన్డే ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో మెరిశాడు. 2024-25 సీజన్‌కు సంబంధించి 20 మందితో కూడిన సెంట్రల్‌ కాంట్రాక్ట్‌  జాబితాను న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు