NZ vs IND: ఇది మాకు మంచి అవకాశం.. ఇక నా కొడుకు కోసం సమయం వెచ్చిస్తా: హార్దిక్‌

న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌ను భారత్‌ 1-0 తేడాతో కైవసం చేసుకొంది. మొదటి మ్యాచ్‌ రద్దు కాగా.. రెండో టీ20లో భారత్‌ ఘన విజయం సాధించింది. అయితే మూడో మ్యాచ్‌ వర్షం కారణంగా టైగా ముగియడంతో సిరీస్‌ టీమ్‌ఇండియా వశమైంది. శుక్రవారం నుంచి కివీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది.

Published : 23 Nov 2022 01:04 IST

(ఫొటో సోర్స్‌: బీసీసీఐ ట్విటర్)

ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌ను భారత్‌ 1-0 తేడాతో కైవసం చేసుకొంది. నేపియర్‌ వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌ వర్షం కారణంగా మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. 161 పరుగుల లక్ష్య ఛేదనలో ఆట ఆగే సమయానికి భారత్‌ 9 ఓవర్లకు 75/4 స్కోరుతో ఉంది. డక్‌వర్త్‌లూయిస్ పద్ధతి ప్రకారం మ్యాచ్‌ టైగా ముగిసింది.ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ మహమ్మద్‌ సిరాజ్‌ అవార్డు దక్కించుకొన్నారు. మూడో టీ20 అనంతరం కెప్టెన్లు హార్దిక్ పాండ్య, టిమ్‌ సౌథీ మాట్లాడారు. 

మొత్తం గేమ్‌ జరిగితే బాగుండేది

‘‘పూర్తి ఓవర్లపాటు ఆట జరిగి విజయం సాధిస్తే ఆ ఆనందం మరోలా ఉంటుంది. అయితే వర్షం కారణంగా సాధ్యపడలేదు. ఈ పిచ్‌ మీద ప్రత్యర్థి బౌలింగ్‌పై ఎటాక్‌ చేయడమే సరైన డిఫెన్స్‌గా నేను భావించా. కివీస్‌ బౌలింగ్‌ దళం బాగుంది. అందుకే త్వరగా వికెట్లను కోల్పోయినా కనీసం 10-15 పరుగులు అదనంగా చేయాలని అనుకొన్నా. ఇలాంటి గేమ్ వల్ల మా ఆటగాళ్లను పరీక్షించేందుకు అవకాశం దక్కింది. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవు. టీ20 సిరీస్‌ ముగిసింది కాబట్టి నేను భారత్‌కు వెళ్లిపోతా. నా కొడుకుతో సమయం వెచ్చిస్తా’’ - హార్దిక్‌ పాండ్య.

శుక్రవారం నుంచి జరిగే మూడు వన్డేల సిరీస్‌కు హార్దిక్‌ పాండ్య అందుబాటులో ఉండడు.  దాదాపు నెలరోజులపాటు టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్‌ పాల్గొన్నాడు. ఆ తర్వాత ఆసీస్‌ నుంచి నేరుగా న్యూజిలాండ్‌కు వచ్చాడు. ఇక వన్డే సిరీస్‌కు భారత్‌ జట్టు సారథిగా శిఖర్ ధావన్ వ్యవహరిస్తాడు.

తీవ్ర నిరుత్సాహం

‘‘వర్షం కారణంగా ఆట ఇలా ముగియడం నిరుత్సాహానికి గురి చేసింది. అలాగే బ్యాటింగ్‌ విషయంలోనూ సరిగ్గా ఆడలేకపోయాం. బౌలింగ్‌లో త్వరగా వికెట్లు తీసి భారత్‌పై ఒత్తిడి పెంచాం. కానీ దురదృష్టవశాత్తూ వాతావరణం ప్రతికూలంగా మారింది. దీంతో మ్యాచ్‌ ఆసక్తికరంగా మారేది. వర్షం రావడంతో స్కోరుబోర్డుపై అనిశ్చితి నెలకొంది. మ్యాచ్‌ జరిగివుంటే తప్పకుండా వికెట్లు తీసి భారత్‌ను ఇబ్బందుల్లోకి నెట్టేవాళ్లం. అయితే నాణ్యమైన జట్టుతో వన్డే సిరీస్‌నూ ఆడబోతున్నాం. ఆక్లాండ్‌లోనూ ఇలానే ప్రేక్షకాదరణ భారీగా ఉంటుందని ఆశిస్తున్నా’’ - టిమ్‌ సౌథీ

బ్యాటింగ్‌కు సులువేం కాదు: సిరాజ్‌

‘‘నేపియర్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించలేదు. అందుకే లెంగ్త్‌తో బంతులను సంధించాలని నిర్ణయించుకొన్నా. టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా నేను స్టాండ్‌బై ఆటగాడిగా ఉన్న సమయంలో కఠినంగా ప్రాక్టీస్‌ చేశా. ఇప్పుడు నా ప్రణాళికలను అమలు చేశా. వాతావరణం మన చేతుల్లో ఉండదు. అయితే సిరీస్‌ను గెలవడం ఆనందంగా ఉంది’’

నా బ్యాటింగ్‌ పట్ల ఆనందంగా ఉంది: సూర్యకుమార్‌

‘‘ఇప్పటి వరకు జరిగిన విషయాలను తలుచుకొంటే ఎంతో ఆనందంగా ఉంది. అయితే ఇవాళ పూర్తి మ్యాచ్‌ జరిగి ఉంటే బాగుండేది. వాతావరణం అనేది మన చేతుల్లో ఉండదని అప్పుడే  సిరాజ్‌ కూడా అన్నాడు. మ్యాచ్‌ అనగానే తప్పకుండా ఒత్తిడి ఉంటుంది. అయితే నా బ్యాటింగ్‌తో నేను హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే నేను ఎప్పుడూ ఒత్తిడిని అట్టిపెట్టుకొని తిరగను. ఎప్పుడూ నా ఆలోచన, విధానం ఒకేలా ఉంటాయి’’ 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని