Pakistan: సాధారణ క్యాచ్‌ను సిక్సర్‌గా మార్చిన పాక్‌ ఫీల్డర్లు..!

ఓ క్యాచ్‌ అందుకోవడం కోసం ఇద్దరు ఫీల్డర్లు పోటీపడి పరస్పరం ఢీకొని దానిని నేలపాలు చేయడం క్రికెట్‌లో సర్వసాధారణం. లేకపోతే

Published : 12 Sep 2022 10:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఓ క్యాచ్‌ అందుకోవడం కోసం ఇద్దరు ఫీల్డర్లు పోటీపడి పరస్పరం ఢీకొని దానిని నేలపాలు చేయడం క్రికెట్‌లో సర్వసాధారణం. లేకపోతే.. ఓ ఫీల్డర్‌ బౌండరీ లైన్‌ అంచున క్యాచ్‌ పట్టి.. బ్యాలెన్స్‌ ఆపుకోలేని సమయంలో మైదానంలోకి బంతిని విసిరి బౌండరీ లైన్‌ను దాటేయడం.. కుదిరితే గాల్లో ఉన్న ఆ బంతిని మరో ఫీల్డర్‌ అందుకోవడం వంటి అద్భుతాలు అప్పుడప్పుడు జరుగుతాయి. అలాంటప్పుడు ఫీల్డర్‌ అక్కడ లేకపోయినా కనీసం పరుగులనైనా అడ్డుకోవచ్చు. కానీ, పాక్‌ ఫీల్డర్లు ఆదివారం జరిగిన ఆసియాకప్‌ ఫైనల్స్‌లో దీనికి పూర్తి భిన్నంగా చేశారు. బౌండరీ లైన్‌ లోపలే నేలను తాకాల్సిన బంతిని బౌండరీ లైన్‌ బయటకు చేర్చి శ్రీలంకకు ఆరు పరుగులు సమర్పించుకున్నారు.

శ్రీలంక 58 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన సమయంలో భానుక రాజపక్స రంగంలోకి దిగి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. 18.6వ ఓవర్‌లో మహమ్మద్‌ హస్నైన్‌ వేసిన బంతిని డీప్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా భారీ షాట్‌కు ప్రయత్నించాడు. గాల్లో ఉన్న ఈ బంతిని అందుకొనేందుకు అక్కడే ఉన్న అసిఫ్‌ అలీ ప్రయత్నిస్తుండగా.. అదే సమయంలో షాదాబ్‌ ఖాన్‌ గుడ్డిగా ఆ దిశగా పరిగెత్తుకొంటూ వచ్చి అలీను ఢీకొన్నాడు. అప్పటికే అలీ చేతికందిన బంతి.. షాదాబ్‌ ఢీకొనడంతో బౌండరీ లైన్‌ బయటపడింది. ఫలితంగా శ్రీలంకకు ఓ సిక్సర్‌ లభించింది. అసలు ఆ క్యాచ్‌ను వదిలేసినా ఫోర్‌ మాత్రమే లంకకు లభించేది.. రెండు పరుగులు పాక్‌కు ఆదా అయ్యేవి..!

అలీని ఢీకొన్న షాదాబ్‌ నేలపైనే పడిపోవడంతో వైద్య బృందం అక్కడకు వచ్చి చికిత్సను అందించింది. ఈ ఇన్నింగ్స్‌లో భానుక 2 సిక్స్‌లు, 6 ఫోర్ల సాయంతో 45 బంతుల్లో 71 పరుగులు చేసి లంకకు గౌరవప్రదమైన (170/6) స్కోర్‌ అందించాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని