ఇషాన్‌.. 99 ఔట్‌ బాధ నీ ఒక్కడిదే కాదు

ఒక్క అడుగుతోనే మొదలయ్యే ప్రయాణం గమ్యం చేరుకుంటేనే ఆనందం. అదే ప్రయాణం చేరాల్సిన గమ్యానికి ఒక్క అడుగు దూరంలోనే ఆగిపోతే..? గుండె తరుక్కుపోతుంది. ఆవేదన కట్టలు తెంచుకుంటుంది. చెప్పలేని బాధ మనసును పట్టి పీడిస్తుంది...

Published : 29 Sep 2020 08:15 IST

 గుండెల్ని పిండేసే ఆ ఒక్క పరుగు

ఒక్క అడుగుతోనే మొదలయ్యే ప్రయాణం గమ్యం చేరుకుంటేనే ఆనందం. అదే ప్రయాణం చేరాల్సిన గమ్యానికి ఒక్క అడుగు దూరంలోనే ఆగిపోతే..? గుండె తరుక్కుపోతుంది. ఆవేదన కట్టలు తెంచుకుంటుంది. చెప్పలేని బాధ మనసును పట్టి పీడిస్తుంది.

10ని 20.. 20ని 50.. 50ని 100గా మలిచేందుకే క్రికెటర్లు తాపత్రయపడతారు. మధ్యలోనే వెనుదిరిగితే ప్చ్‌..! అనుకొని మర్చిపోతారు. 99 వద్ద ఔటైతే ఉండే బాధ మాత్రం వర్ణనాతీతం. ప్రస్తుత లీగ్‌లోనూ ఆ మైలురాయికి పరుగు దూరంలో నిలిచిపోయిన సందర్భాలు కొందరికి ఎదురయ్యాయి. తాజాగా ముంబయి యువకుడు ఇషాన్‌ కిషన్‌ 99 బాధను అనుభవిస్తున్నాడు.


‘రైనా’కే ఫస్ట్‌

(Twitter/Suresh Raina)

లీగ్‌లో 99 వద్ద ఆగిపోయిన మొదటి వ్యక్తి సురేశ్‌ రైనా. 2013లో హైదరాబాద్‌ మ్యాచులో అతడు విధ్వంసకర బ్యాటింగ్‌ చేశాడు. కేవలం 52 బంతుల్లో 99 పరుగులతో అజేయంగా నిలిచాడు. 11 బౌండరీలు 3 సిక్సర్లు బాదేశాడు. అతడి స్ట్రైక్‌రేట్‌ ఏకంగా 190.38 కావడం విశేషం. మ్యాచులో టాస్‌ గెలిచిన చెన్నై తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. మురళీ విజయ్‌ (29), మైకేల్‌ హస్సీ (67) తొలి వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 5.2వ బంతికి విజయ్‌ను పెరీరా పెవిలియన్‌ చేర్చాడు. ఆ తర్వాత రైనా రంగంలోకి దిగడంతో అసలు తుపాను మొదలైంది. హస్సీతో కలిసి అతడు రెండో వికెట్‌కు 133, జడ్డూతో కలిసి నాలుగో వికెట్‌కు 40* పరుగుల భాగస్వామ్యాలు అందించాడు. 4 బౌండరీలు, 1 సిక్సర్‌తో 35 బంతుల్లోనే అర్ధశతకం బాదేసిన రైనా ఆ తర్వాత హైదరాబాద్‌‌ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. 19వ ఓవర్‌కు రైనా 86 (47 బంతుల్లో)తో ఉన్నాడు. ఆఖరి ఓవర్‌ తొలి బంతిని బౌండరీకి బాది 90కి చేరుకున్న అతడిని సామి ఇబ్బంది పెట్టాడు. సింగిల్స్‌ మాత్రమే ఇచ్చాడు. అయితే ఆరో బంతిని నో బాల్‌ వేయడం, తర్వాతి బంతికి బౌండరీ రావడంతో 99 వద్ద అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచులో చెన్నై 223 పరుగులు చేయగా హైదరాబాద్‌ 146/8కు పరిమితమైంది.


‘రారాజు’కూ అప్పట్లోనే

టీ20 క్రికెట్లో విరాట్‌ మెరుపుల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది! సంప్రదాయ షాట్లతోనే పరుగుల వరద పారిస్తాడు. లీగులో 5 శతకాలు చేసిన కోహ్లీ 2013లోనే తొలి సెంచరీని త్రుటిలో చేజార్చుకున్నాడు. కోట్లా వేదికగా దిల్లీతో తలపడ్డ పోరులో బెంగళూరు మొదట బ్యాటింగ్‌ చేసింది. పుజారా (17), గేల్‌ (4) వెంటవెంటనే వెనుదిరిగారు. అప్పుడు భారమంతా ‘కింగ్‌ కోహ్లీ’పైనే పడింది. ఈ క్రమంలో అతడు తన కవర్‌డ్రైవ్‌ల సొగసును ప్రదర్శించాడు. రెండో వికెట్‌కు పుజారాతో కలిసి 26, మూడో వికెట్‌కు హెన్రిక్స్‌తో కలిసి 57, నాలుగో వికెట్‌ డివిలియర్స్‌తో కలిసి 94 పరుగుల భాగస్వామ్యాలు అందించాడు. తొలుత నిదానంగా ఆడుతూ 6 బౌండరీలతో 44 బంతుల్లో అర్ధశతకం అందుకున్నాడు. డివిలియర్స్‌ రాగానే గేరు మార్చాడు. మరో 14 బంతుల్లోనే కళ్లు చెదిరే 4 సిక్సర్లు, అద్భుతమైన 4 బౌండరీలతో 49 పరుగులు చేసేశాడు. 19వ ఓవర్‌కు కోహ్లీ 76 (52 బంతుల్లో)తో ఉన్నాడు. ఉమేశ్‌ వేసిన ఆఖరి ఓవర్లో 2, 4, 4, 6, 6 బాది 5 నిమిషాల్లోనే 98కి చేరుకున్నాడు. అయితే ఆఫ్‌సైడ్‌ ఫుల్లర్‌గా వేసిన ఆఖరి బంతిని విరాట్‌ డీప్‌ పాయింట్లోకి నెట్టాడు. సింగిల్‌ తీశాడు. రెండో పరుగుకోసం పరుగెత్తాడు. అప్పటికే బంతిని అందుకున్న ఫీల్డర్‌ స్టంప్స్‌కు విసిరాడు. దాంతో ఓ అద్భుత ఇన్నింగ్స్‌ 99 వద్దే ముగిసింది. బెంగళూరు 183/4 చేయగా దిల్లీ 179/7తో ఓటమి పాలైంది.


షా.. షో! కానీ..

గతేడాది ఇద్దరు క్రికెటర్లకు 99 అనుభవం ఎదురైంది. అందులో దిల్లీ యువ ఓపెనర్‌ పృథ్వీషా బాధను వర్ణించడం కష్టం. తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 185/8తో నిలిచింది. ఛేదనలో షా తన షో చూపించాడు. సహజంగా బ్యాక్‌ఫుట్‌ ఆడే అతడు ఆధునిక షాట్లతోనూ బెంబేలెత్తించాడు. ధావన్‌తో 27, శ్రేయస్‌ అయ్యర్‌తో 89, రిషభ్‌ పంత్‌తో 54 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పాడు. జట్టు స్కోరు 27 వద్దే గబ్బర్‌ ఔటైనా 9 ఓవర్లకే దిల్లీ 75/1తో నిలిచింది. ఎందుకంటే షా దూకుడు చూపించాడు. 4 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో 30 బంతుల్లోనే అర్ధశతకం బాదేశాడు. శ్రేయస్‌ సైతం బాదేయడంతో 16 ఓవర్లకే కోల్‌కతా రెండోసారి స్ట్రాటజిక్‌ టైం తీసుకుంది. అప్పుడు దిల్లీ 152/2, పృథ్వీ 81తో ఉన్నారు. అర్ధశతకం తర్వాత జోరు పెంచిన షా మరో 8 బౌండరీలు బాదేసి 95కు చేరుకున్నాడు. కాస్త పొట్టివాడైన షాను అడ్డుకొనేందుకు లాకీ ఫెర్గూసన్ పదేపదే‌ షార్ట్‌ పిచ్ బంతులతో దాడి చేశాడు. ఈ క్రమంలో 18.3వ తలమీదకు రావడంతో షా బ్యాటును అడ్డంగా ఊపాడు. బ్యాటు అంచుకు తగిలిన బంతి గాల్లోకి లేచింది. కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ కాస్త వెనక్కి పరుగెత్తి సులభంగానే క్యాచ్‌ అందుకున్నాడు. దాంతో 99 పరుగుల వద్ద ఉన్న షా దిగాలుగా మైదానంలోనే కూలబడ్డాడు. నిరాశగా డగౌట్‌ చేరుకున్నాడు. ఆ తర్వాత మ్యాచ్‌ టై కావడంతో సూపర్‌ ఓవర్‌ ఆడించారు. దిల్లీ విజయం అందుకుంది.


గేల్‌కు సరదాయే

‘యూనివర్స్‌ బాస్‌’కు క్రిస్‌గేల్‌కు శతకాలు చేయడం కొత్తేమీ కాదు. నిజానికి అతడికదో సరదా! తన సుదీర్ఘ టీ20 కెరీర్‌లో ఎన్నో శతకాలు బాదేశాడు. ఈ లీగ్‌లోనే ఆరు చేశాడు. 2019లోనే గేల్‌ త్రుటిలో ఒక శతకం చేజార్చుకున్నాడు.  మొహాలి వేదికగా బెంగళూరుతో మ్యాచులో 99 పరుగులతో అజేయంగా నిలిచాడు. 64 బంతుల్లో 10 బౌండరీలు, 5 సిక్సర్లు బాదేశాడు. కేఎల్‌ రాహుల్‌తో 66, మయాంక్‌తో 20, సర్ఫరాజ్‌తో 24, మన్‌దీప్‌తో 60* భాగస్వామ్యాలు నెలకొల్పాడు. గేల్‌ దూకుడుతో 6 ఓవర్లకే పంజాబ్‌ 60తో నిలిచింది. సిరాజ్‌ వేసిన 6 ఓవర్లో 4, 6, 4, 0, 6, 4తో విరుచుకుపడ్డ గేల్‌ 28 బంతుల్లోనే 6 బౌండరీలు, 3 సిక్సర్లతో అర్ధశతకం బాదేశాడు. ఈ క్రమంలో పంజాబ్‌ వరుసగా వికెట్లు చేజార్చుకోవడంతో మధ్య ఓవర్లలో నెమ్మదించాడు. ఆ తర్వాత మళ్లీ చెలరేగాడు. అయితే  90 (60 బంతుల్లో) వద్ద ఉన్న గేల్‌ను 20వ ఓవర్లో సిరాజ్‌ ఇబ్బంది పెట్టాడు. తొలి మూడు బంతుల్లో సింగిల్స్‌ మాత్రమే ఇచ్చాడు. నాలుగో బంతిని గేల్‌ బౌండరీగా మలిచాడు. ఐదో బంతికి సిరాజ్‌ పరుగులేమీ ఇవ్వకపోవడంతో గేల్‌  95 వద్ద ఉన్నాడు. శతకం చేయాలంటే సిక్సర్‌ బాదాల్సింది. సిరాజ్‌ తెలివిగా ఆలోచించి వైడ్‌ యార్కర్‌ విసరడంతో నాలుగు పరుగులే వచ్చాయి. 99*తో గేల్‌ నవ్వుతూ వచ్చేశాడు. పంజాబ్‌ మొదట 173/4తో నిలిచినా ఛేదనలో ఏబీ డివిలియర్స్‌ చుక్కలు చూపించడంతో బెంగళూరు గెలిచింది.


Jr. ఝార్ఖండ్‌ డైనమైట్‌ నిర్వేదం

(Twitter/Ishan kishan)

ఝార్ఖండ్‌ కుర్రాడు, ధోనీ శిష్యుడు ఇషాన్‌ కిషన్‌ (99; 58 బంతుల్లో 2×4, 9×6)కు తాజా సీజన్‌లో 99 బాధ ఎదురైంది. అయితే ఓ చారిత్రక ఛేదనలో భాగమైనందుకు సంతోషమే. దుబాయ్‌ వేదికగా జరిగిన ఈ పోరులో మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఛేదనలో ముంబయి 39 పరుగుల్లోపే రోహిత్‌ (8), సూర్యకుమార్‌ (0), డికాక్‌ (14) వికెట్లు చేజార్చుకుంది. ఈ క్రమంలో 2.3వ బంతికి క్రీజులో అడుగుపెట్టిన కిషన్‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. చక్కని బంతుల్ని గౌరవిస్తూనే అందివచ్చిన బంతుల్ని బౌండరీకి తరలించాడు. ముంబయి విజయానికి ఆఖరి 6 బంతుల్లో 19 పరుగులు కావాలి. కిషన్‌ 86తో ఉన్నాడు. మొదటి బంతికి సింగిల్‌ తీసిన అతడు 3, 4 బంతుల్ని సిక్సర్లుగా మలిచి 99కి చేరుకున్నాడు. అయితే ఉదాన వేసిన ఐదో బంతిని స్లాగ్‌ చేసి ఫీల్డర్‌ దేవదత్‌ పడిక్కల్‌కు దొరికేశాడు. ఆ తర్వాత బంతికి పొలార్డ్‌ బౌండరీ బాదడంతో మ్యాచ్‌ టై అయింది కానీ ఇషాన్‌ మాత్రం నిర్వేదంగా బయటకొచ్చాడు. 

-ఇంటర్‌నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని