Updated : 02 Jul 2022 10:12 IST

Rishabh pant : విమర్శలకు బెదరని నయా ‘వీరు‌’డు.. రిషభ్‌ పంత్

ఫార్మాట్ ఏదైనా సరే పరుగులు వరద పారించడమే తెలుసు

(ఫొటో సోర్స్‌: బీసీసీఐ ట్వీటర్)

ఇంటర్నెట్ డెస్క్‌: సుదీర్ఘ ఫార్మాట్‌లో రాణించాలంటే కాస్త ఓర్పు కావాలంటారు.. ఆచితూచి ఆడుతూ పరుగులు రాబట్టాలి. నిలకడగా ఆడి రన్స్ చేస్తేనే జట్టులో స్థానం పదిలంగా ఉంటుంది. కానీ ఇవేవీ ఒకప్పుడు వీరేంద్ర సెహ్వాగ్‌కు నచ్చేవి కావు. ఇప్పుడు ఈ టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌ కూడా అంతే.. అయితే ఒకవైపు కీలకమైన సమయాల్లో అనవసర షాట్లకు పోయి ఔట్‌ అవుతున్నాడనే విమర్శలు చెలరేగుతున్నా.. తన దూకుడును మాత్రం తగ్గించేదేలే అంటూ విరుచుకుపడటం నయా ‘వీరు’డు రిషభ్‌ పంత్‌ స్టైల్‌. ఇంగ్లాండ్‌తో టెస్టులోనూ ఇలానే సెంచరీ బాదేశాడు.

కీలకమైన ఇంగ్లాండ్‌తో టెస్టులో టాప్‌ బ్యాటర్లంతా చేతులెత్తేసిన వేళ జడ్డూభాయ్‌తో కలిసి రిషభ్‌ (146) ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టాడు. తనదైన శైలిలో బ్యాటింగ్‌ చేస్తూనే అరవీర భయంకర పేసర్లను ఎదుర్కొని శతకం సాధించడం సాధారణ విషయమేమీ కాదు. అండర్సన్, బ్రాడ్‌తోపాటు పాట్స్‌ వంటి కొత్త బౌలర్‌ను అడ్డుకొని మరీ పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకొన్నాడు. టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలు కొట్టాడు. 2005లో పాక్‌పై 93 బంతుల్లోనే ధోనీ శతకం చేశాడు. అయితే ఇప్పుడు ఇంగ్లాండ్‌పై రిషభ్‌ పంత్ కేవలం 89 బంతుల్లోనే సెంచరీ సాధించి అత్యంత వేగంగా బాదిన భారత వికెట్‌ కీపర్‌గా నిలవడం విశేషం.

ఇంగ్లాండ్‌పైనే మూడోది..

(ఫొటో సోర్స్‌: బీసీసీఐ ట్వీటర్)

రిషభ్‌ పంత్ తన టెస్టు కెరీర్‌లో ఐదు సెంచరీలు బాదాడు. ఇందులో మూడు ఇంగ్లాండ్‌పైనే కావడం గమనార్హం. అందులోనూ ఇంగ్లిష్‌ గడ్డపై రెండు సెంచరీలు ఉన్నాయి. విదేశీ పిచ్‌లు అంటే పేస్‌కు స్వర్గధామం. అలాంటి పిచ్‌లపై నాలుగు శతకాలు చేశాడు. ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండేది. అయితే ‘90’ల్లో ఔటై కొన్ని మ్యాచ్‌ల్లో పెవిలియన్‌కు చేరాడు. అయితే ఈసారి మాత్రం ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా సెంచరీ పూర్తి చేసేశాడు. ఈ క్రమంలో అత్యంత తక్కువ వయస్సులో 2000 పైచిలుకు టెస్టు పరుగులు చేసిన వికెట్‌ కీపర్‌గా అవతరించాడు. 

డిఫెన్స్‌ చాలా కీలకం: పంత్

(ఫొటో సోర్స్‌: బీసీసీఐ ట్వీటర్)

ఇంగ్లాండ్‌తో తొలి రోజు ఆట ముగిసేససమయానికి భారత్‌ 338/7 స్కోరుతో నిలిచింది. క్రీజ్‌లో రవీంద్ర జడేజా (83*), షమీ (0*) ఉన్నారు. మ్యాచ్‌ ముగిసిన అనంతరం రిషభ్ పంత్ మాట్లాడుతూ.. ‘‘ఈ మ్యాచ్‌లో వందశాతం ఆడేందుకు ప్రయత్నించా. నా చిన్నప్పటి నుంచి క్రికెట్ పైనే ధ్యాస ఉంచా. బంతిని ఎంత హిట్‌ చేసినా.. డిఫెన్స్‌ మీద దృష్టి పెట్టాలని నా చిన్ననాటి కోచ్ తారక్‌ చెప్పేవారు. టెస్టులో డిఫెన్స్ చాలా కీలకం. అందుకే చెత్త బంతిని బౌండరీకి తరలించి మిగతావాటిని డిఫెన్స్‌ ఆడాను. ఇంగ్లాండ్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ఇంగ్లాండ్‌లోని పిచ్‌ పరిస్థితులు పేస్‌కు అనుకూలంగా ఉంటాయి. జడేజాతో భాగస్వామ్యం నిర్మించడం అద్భుతంగా ఉంది. బంతిపైనే దృష్టి పెట్టాలని మాట్లాడుకుంటూ ఉన్నాం’’ అని రిషభ్‌ పంత్ వివరించాడు. జడేజా, రిషభ్‌  కలిసి ఆరో వికెట్‌కు 222 పరుగులు జోడించారు.

రిషభ్‌ పంత్‌ టెస్టు సెంచరీలు: 
* మొత్తం టెస్టులు : 31 (ఇప్పుడు ఆడుతున్నదానితో కలిపి)
* సెంచరీలు: 5
* లండన్‌ వేదికగా ఇంగ్లాండ్‌పై (114) 2018లో
* సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాపై (159*) 2019లో
* అహ్మదాబాద్‌లో ఇంగ్లాండ్‌పై (101) 2021లో
* కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాపై (100) 2022లో
* బర్మింగ్‌హామ్‌ వేదికగా ఇంగ్లాండ్‌పై (146) 2022లో

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts