Published : 29 Jun 2022 02:34 IST

Chandrakant Pandit: మధ్యప్రదేశ్ కెప్టెన్‌ పెళ్లికి రెండు రోజులే సెలవిచ్చా: చంద్రకాంత్‌ పండిత్‌

(Photo: BCCI Domestic Twitter Video Screenshot)

ఇంటర్నెట్‌డెస్క్‌: రెండు దశాబ్దాలకుపైగా రంజీ ట్రోఫీలో విజయానికి చేరువగా వచ్చి టైటిల్‌ సాధించడంలో విఫలమవుతున్న మధ్యప్రదేశ్‌ జట్టు ఎట్టకేలకు ఆదివారం ఆ కలను సాకారం చేసుకుంది. దీంతో ఆటగాళ్లంతా సంబరాల్లో మునిగితేలారు. మరోవైపు ఆటగాళ్ల కన్నా ఆ జట్టు కోచ్‌ చంద్రకాంత్‌ పండితే మరింత ఎక్కువ సంతోషంలో మునిగిపోయాడు. ఎందుకంటే మధ్యప్రదేశ్‌ కెప్టెన్‌గా ఉన్న రోజుల్లో త్రుటిలో కప్పును కోల్పోయిన అతడు ఇప్పుడు అదే జట్టుకు కోచ్‌గా వ్యవహరించి ఆ స్వప్నాన్ని నిజం చేసుకున్నాడు. అందులోనూ మధ్యప్రదేశ్‌కి ఇది తొలి రంజీ ట్రోఫీ కావడం మరింత విశేషం. దీంతో ఆ జట్టు విజయంలో చంద్రకాంత్‌ది కీలక పాత్ర.

ఈసారి ఎలాగైనా ఆ జట్టును విజేతగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో కొంతకాలంగా నిరంతరాయంగా పనిచేశాడు. అనుకున్నది సాధించేవరకు పట్టువీడలేదు. అందుకోసం ఆటగాళ్లు కూడా త్యాగాలు చేయాల్సి వచ్చింది. తాజాగా చంద్రకాంత్‌ పీటీఐతో మాట్లాడుతూ పలువురు ఆటగాళ్లతో తాను ఎంత కఠినంగా వ్యవహరించాడో చెప్పాడు. ‘ఎవరైనా ఉన్నత శిఖరాలు చేరాలంటే త్యాగాలు చేయక తప్పదు. మధ్యప్రదేశ్‌ కెప్టెన్‌ ఆదిత్య గతేడాది నా వద్దకు వచ్చి ఏ సమయంలో పెళ్లి చేసుకుంటే మంచిదని (సెలవుల కోసం) నన్ను అడిగాడు. దానికి నేను బదులిస్తూ నీకెప్పుడైనా రెండు రోజులు మాత్రమే సెలవులు మంజూరు చేస్తానని చెప్పాను’ అని చంద్రకాంత్‌ పేర్కొన్నాడు. మరోవైపు శ్రీవాస్తవ అనే ఆటగాడు కూడా గతేడాదే వివాహం చేసుకున్నానని చెప్పాడు.  ఇప్పటివరకు కనీసం 10 రోజులు కూడా ఇంటిదగ్గర ఉండలేదని వివరించాడు. ఈ విషయాలను బట్టి చంద్రకాంత్‌ తన ఆటగాళ్లను విజేతలుగా తీర్చిదిద్దడానికి ఎంత కఠినంగా వ్యవహరించారో అర్థమవుతోంది.

కాగా, చంద్రకాంత్‌ 1998-1999 సీజన్‌లో మధ్యప్రదేశ్‌ జట్టుకు కెప్టెన్‌గా చేశాడు. అప్పుడు ఇదే చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటక చేతిలో ఫైనల్లో త్రుటిలో ఓటమిపాలై కప్పు కలను దూరం చేసుకున్నాడు. ఇప్పుడు అదే స్టేడియంలో కోచ్‌గా రంజీ ట్రోఫీని ముద్దాడి మధుర జ్ఞాపకాన్ని మిగిల్చుకున్నాడు. మరోవైపు చంద్రకాంత్‌ కోచింగ్‌ శైలిని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌, బ్యాటింగ్‌ లెజెండ్‌ సునీల్‌ గావస్కర్‌ మెచ్చుకున్నాడు. చందూ ఏ జట్టుకు కోచ్‌గా వ్యవహరించినా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపుతాడని. విదర్భ జట్టు అతడి శిక్షణలోనే ఒకటికి రెండుసార్లు రంజీ ట్రోఫీని గెలిచిందని గుర్తుచేశాడు. అనామకులైన ఆటగాళ్లతోనే ఛాంపియన్‌ జట్టును తయారు చేస్తాడని, తద్వారా దేశవాళీ క్రికెట్‌లో పేరుమోసిన కోచ్‌గా మారాడని వివరించాడు. ఆటగాళ్లను తెలివిగా క్రికెట్‌ ఆడేలా, ఏ స్థితిలోనూ వెనుకంజ వేయని విధంగా తీర్చిదిద్దుతాడని చెప్పాడు. క్రికెటర్‌గానూ అతడి తీరు అలాగే ఉండేదన్నాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని