MS Dhoni : దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో మెంటార్‌గా ధోనీ సేవలు ఈసారికి కష్టమే!

 భారత టీ20 లీగ్‌ ఫ్రాంచైజీలైన ముంబయి, చెన్నై, కోల్‌కతా, దిల్లీ తదితర యాజమాన్యాలు విదేశాల్లోని లీగుల్లోనూ...

Published : 14 Aug 2022 02:31 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత టీ20 లీగ్‌ ఫ్రాంచైజీలైన ముంబయి, చెన్నై, కోల్‌కతా, దిల్లీ తదితర యాజమాన్యాలు విదేశాల్లోని లీగుల్లోనూ పెట్టుబడులు పెట్టాయి. ఉదాహరణకు యూఈఏ టీ20 లీగ్‌లో ముంబయి, దిల్లీ, కోల్‌కతా ఫ్రాంచైజీల ఓనర్లు జట్లను కలిగి ఉన్నారు. మొత్తం ఆరింటిలో ఐదు టీమ్‌లకు భారతీయులే యజమానులు కావడం విశేషం. ఇక దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లోని ఆరు జట్లనూ భారత టీ20 లీగ్‌ ఫ్రాంచైజీ ఓనర్లే సొంతం చేసుకున్నారు. అయితే విదేశాల్లోని లీగుల్లో బీసీసీఐతో కాంటాక్ట్‌ కలిగిన భారత ఆటగాళ్లు ఎవరూ పాల్గొనకూడదు. మెంటార్‌గానూ వ్యవహరించకూడదు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో ఓ జట్టును సొంతం చేసుకున్న చెన్నై యాజమాన్యం  టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీని మెంటార్‌గా నియమిస్తుందనే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటికీ ధోనీ చెన్నై జట్టుకు ఆడుతుండటంతో వీలుపడదని తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ అధికారులు కూడా వివరణ ఇచ్చారు. 

‘‘భారత్‌కు చెందిన ఏ ఆటగాడు.. దేశవాళీ క్రికెటర్‌ అయినా సరే విదేశాల లీగుల్లో ఆడటానికి అవకాశం లేదు. అన్ని ఫార్మాట్ల నుంచి వీడ్కోలు పలికే వరకు ఛాన్స్‌ ఉండదు. ఎవరైనా ఇతర దేశాల లీగుల్లో పాల్గొనాలంటే తప్పనిసరిగా బీసీసీఐతో తెగతెంపులు చేసుకోవాల్సిందే. అప్పుడే అవకాశం దొరుకుతుంది’’ అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే ధోనీ వంటి రిటైర్‌ ప్రకటించిన క్రికెటర్‌ ఇతర లీగ్‌లోని జట్టుకు మెంటార్‌గా కానీ.. కోచ్‌గా పని చేయొచ్చా...? అనే ప్రశ్నకు సమాధానంగా.. ‘‘భారత టీ20 లీగ్‌లో చెన్నైకి ఆడుతున్నాడు. మొదట ఇక్కడ నుంచి వీడ్కోలు తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో వెటరన్‌ ప్లేయర్ దినేశ్‌ కార్తిక్‌ ఒకసారి కరీబియన్‌ లీగ్‌ మ్యాచ్‌ చూసినందుకే చివరికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. బీసీసీఐ అనుమతి లేకుండా సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కలిగిన ఆటగాడు కనీసం ఇతర లీగ్‌ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూసేందుకు అవకాశం ఉండదు. కోల్‌కతా కోచ్‌ బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ ఆహ్వానం మేరకు కరేబియన్‌ లీగ్‌లోని ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌ డ్రెస్సింగ్‌రూమ్‌కు వెళ్లానని దినేశ్‌ కార్తిక్‌ బీసీసీఐ షోకాజ్‌ నోటీసుకు వివరణ ఇచ్చాడు. రిటైర్మెంట్‌ ప్రకటించని ఎవరైనా సరే విదేశాల్లోని లీగుల్లో భాగస్వామ్యం కావడం అసాధ్యమని బీసీసీఐ స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని