వాట్సన్‌ మెరిసినా చెన్నై పరాజయం

చెన్నైని మరో పరాజయం పలకరించింది. గత మ్యాచులో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఆ జట్టుకు కోల్‌కతా చేతిలో పరాజయం ఎదురైంది..

Published : 08 Oct 2020 01:58 IST

కోల్‌కతాలో రాణించిన రాహుల్‌ త్రిపాఠి

అబుదాబి: చెన్నైని మరో పరాజయం పలకరించింది. గత మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఆ జట్టుకు కోల్‌కతా చేతిలో పరాజయం ఎదురైంది. ఆ జట్టు నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ధోనీసేన విఫలమైంది. 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌ (50; 40 బంతుల్లో 6×4, 1×6), అంబటి రాయుడు (30; 27 బంతుల్లో 3×4) మినహా మరెవ్వరూ రాణించలేదు. అంతకు ముందు కోల్‌కతాలో రాహుల్‌ త్రిపాఠి (81; 51 బంతుల్లో 8×4, 3×6) అదరగొట్టాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్‌ సమష్టిగా విఫలమైనా అతడు అదరగొట్టాడు.

తొలుత చెన్నైదే హవా

ఛేదనలో చెన్నైకి శుభారంభమే లభించింది. డుప్లెసిస్ (17).. శివమ్‌ మావి వేసిన 3.4వ బంతికే ఔటైనా షేన్‌ వాట్సన్‌ దూకుడుగా ఆడాడు. అంబటి రాయుడు ( 30; 27 బంతుల్లో)తో కలిసి రెండో వికెట్‌కు 69 పరుగులు భాగస్వామ్యం అందించాడు. వీరిద్దరూ వరుసగా షాట్లు బాదడం.. 12వ ఓవర్‌ ముగిసినా వికెట్‌ పడకపోవడంతో డీకే సేన బెంబేలెత్తిపోయింది. వారి విజయంపై ఎవరికీ అనుమానాలు కలగలేదు. అయితే 12.1వ బంతికి నాగర్‌కోటి.. రాయుడిని పెవిలియన్‌ పంపించాడు.

అర్ధభాగం తర్వాతే కోల్‌కతాకు ఆశలు

అర్ధశతకం కాగానే వాట్సన్‌ను నరైన్‌ ఎల్బీ చేశాడు. జట్టు స్కోరు 129 వద్ద ఎంఎస్‌ ధోనీ (11; 12 బంతుల్లో 1×4)ని చక్రవర్తి క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. దాంతో చెన్నైకి వరుస షాకులు తగిలాయి. సామ్‌ కరన్‌ (17; 11 బంతుల్లో 1×4, 1×6)ను రసెల్‌ 17.1వ బంతికి ఔట్‌ చేయడంతో ఇక ఓటమి ఖాయమే అనిపించింది. చివరి రెండు ఓవర్లలో జడ్డూ (21*; 8 బంతుల్లో 3×4, 1×6)  బౌండరీలు బాదినా అవి ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే ఉపయోగపడ్డాయి. జాదవ్ (7*) షాట్లు ఆడలేదు. దాంతో ధోనీసేన 157/5కు పరిమితమైంది. కోల్‌కతా బౌలర్లు తొలి 10 ఓవర్లలో ఎక్కువ పరుగులు ఇచ్చినా చివరి 10 ఓవర్లలో అద్భుతంగా పుంజుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని